నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందించడంలో కీలకమైన ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా క్షేత్రస్థాయిలో వైద్యసేవలు గగనమవుతున్నాయి. ఉన్నతాధికారులు కేవలం పరిశీలనలకే పరిమితమవుతుండటంతో రోగికి నాడిపట్టే వారు కరువవుతున్నారు. మరోవైపు వైద్యాధికారులు, ల్యాబ్‌టెక్నీషియన్ల సిబ్బంది కూడా తీవ్రంగా ఉంది. జిల్లాలో 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), 74 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) ఉన్నాయి.
వీటిలోని 28 పీహెచ్‌సీల్లో నిరంతరం వైద్యసేవలు అందాల్సి ఉండగా కనీసం 8 గంటలు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. కలెక్టర్ శ్రీకాంత్ ఇటీవల వింజమూరు, వెంకటాచలం ప్రాంతాల్లో పీహెచ్‌సీలను తనిఖీ చేసిన సమయంలో ఈ విషయం వెలుగుజూసింది. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం తప్ప ఆయన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అధికారుల్లో మార్పు కరువైంది. జిల్లాలోని చాలా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు తమకు తీరిక ఉన్న సమయంలో చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు. ఈ క్రమంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
అరకొరగా వైద్యసేవలు
వైద్యాధికారులు, సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సేవలు అరకొరగా అందుతున్నాయి. జిల్లాలో 170 మంది వైద్యాధికారులు అవసరం కాగా 126 మంది ఉన్నారు. వీరిలో కొందరికి డిప్యూటేషన్‌పై మరోచోట అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో ఎక్కడా న్యాయం చేయలేకపోతున్నారు. మరోవైపు వ్యాధినిర్ధారణలో కీలకమైన ల్యాబ్ టెక్నీషియన్ల కొరత తీవ్రంగా ఉంది. 87 మంది ల్యాబ్ టెక్నీషియన్లు అవసరం కాగా 18 మంది మాత్రమే ఉన్నారు. టెక్నీషియన్లు ఉన్న చోట్ల అవసరమైన పరికరాలు లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లే దిక్కవుతున్నాయి. పరికరాలు ఉన్నచోట సిబ్బంది కరువవుతున్నారు. దీంతో ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు.
నిరుపయోగంగా వైద్యపరికరాలు
జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాల్లో లక్షలాది రూపాయల విలువజేసే వైద్యపరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. మొదట్లో కొద్ది కాలం వినియోగించినా, తర్వాత వాటిని మూలనపడేశారు. అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. రాపూరు ఆరోగ్య కేంద్రంలోని ఎక్స్‌రే ప్లాంటు మరమ్మతులకు నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. కో వూరు ఆస్పత్రిలోని డెంటల్ చెయిర్ నిరుపయోగంగానే ఉంది. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి.
ముణ్ణాళ్ల ముచ్చటగా ఉన్నతాధికారుల ప్రయత్నాలు
ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజలకు నమ్మకం క లిగించేందుకు గతంలో పనిచేసిన కలెక్టర్ రావమ్మ మహాలక్ష్మి పేరుతో ఓ కార్యక్రమం రూపొందించారు. ప్రజలను ఆరోగ్య కేంద్రాలకు ఆహ్వానించి అక్కడ అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు. అది కొద్ది రోజులకే పరిమితమైంది. ప్రస్తుత కలెక్టర్ శ్రీకాంత్ మరో కోణంలో దృష్టిసారించారు. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలకు వైద్యులు, సిబ్బంది, పరికరాల అవసరంపై వివరాలు సేకరిస్తున్నారు. వాటిని ప్రభుత్వానికి పంపి వసతులు పెంచే యోచనలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడకుండా ఇవన్నీ ఏ మేరకు ఫలితం ఇస్తాయనేది సందేహంగా మారింది.
సమస్యలు వాస్తవమే: డాక్టర్ కోటేశ్వరి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ
పలు ఆరోగ్యకేంద్రాల్లో తగినంతమంది వైద్యులు, ల్యాబ్‌టెక్నీషియన్లు లేరు. త్వరలోనే వీరి నియామకం జరిగే అవకాశం ఉంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వైద్య సేవలందేలా చూస్తాం. మూలనపడిన పరికరాలను ఉపయోగంలోకి తెస్తాం.
సక్రమంగా సేవలందడంలేదు: ప్రకాష్, రాపూరు
ఆరోగ్య కేంద్రంలో సక్రమంగా వైద్య సేవలు అందడంలేదు. డాక్టర్లు ఎప్పుడు ఉంటారో కూడా తెలీదు. ఇక్కడ ఎక్స్‌రే ఉన్నా పని చేయదు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బు ఖర్చు చేసుకుంటున్నాం.
‘నాడి’ పట్టేదెవరు?
Published Wed, Dec 25 2013 3:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement