జనరిక్‌తో మెడికల్ దందా
నెల్లూరు (విద్యుత్) : ‘వైద్యో నారాయణో హరి’ అంటే.. వైద్యుడిని భగవంతుడిగా రోగులు భావిస్తారు. అలాంటి వైద్యులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. జనరిక్ మందులను రోగులకు ఎక్కు వ ధరకు అంటగట్టి దోచుకుంటున్నారు. జిల్లాలోని నెల్లూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని డాక్టర్లు, కొన్ని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు ‘జనరిక్’ మందులతో జీరో బిజినెస్ చేస్తున్నారు.
దీంతో మరో వైపు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. కాంట్రాక్ట్ బేసిస్ మెడిసిన్ పేరుతో ఔషధాల విక్రయాల దందా జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. మందుల తయారీ సంస్థలు, కొందరు వైద్యులతో నేరుగా సంబంధాలు పెట్టుకుని వారు నడుపుతున్న ఆసుపత్రులకు జనరిక్ మందులను సరఫరా చేస్తున్నారు.
వీటికి బిల్లులు ఉండడం లేదు. మరి కొందరు వైద్యులు మందుల దుకాణాల యాజమాన్యంతో కుమ్మక్కై అధిక లాభాలు వచ్చే కొన్ని రకాల మందులను మాత్రమే రాసి, విక్రయాల జోరును పెంచుతున్నారు. ప్రతి ఫలంగా పర్సంటేజీలు అందుకుంటున్నారు. ఈ వ్యవహారం ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు తెలిసినా మామూళ్లు పుచ్చుకుంటూ చూసీ చూడన ట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రూ.లక్ష విలువైన కాంట్రాక్ట్ బేసిస్ మందులు విక్రయిస్తే డాక్టర్లకు కంపెనీ ప్రతినిధులు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ముట్టజెప్పుతున్నారు. వీటితో పాటు మూడు నెలలకు ఒకసారి ఖరీదైన బహుమతులు అందజేయడంతో పాటు ఏడాదికి రెండు సార్లు విదేశీ పర్యటనలకు పంపుతున్నారు.
మెడిసిన్‌పై 70 శాతం లాభాలు
కాసుల సంపాదనే ధ్యేయంగా కొందరు వైద్యులు మందుల దుకాణాల యజమానులతో చేతులు కలిపి రోగులను దోచుకుంటున్నారు. సరసమైన ధరల్లో లభించే నాణ్యమైన ఔషధాలు అందుబాటులో ఉన్నా వాటిని కాకుండా ఎక్కువ లాభాలు వచ్చే ‘జనరిక్’ బ్రాండ్ ఔషధాలను రాసి పంపుతున్నారు. మెడిసిన్లపై ఉన్న ఎమ్మార్పీ రేటులో జనరిక్ మెడిసిన్లు 30 నుంచి 40 శాతానికే లభిస్తాయి.
ఇవే మందులను జనరల్ మెడిసిన్స్‌గా ఎమ్మార్పీ రేటుకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్ మందు స్థానంలో ‘అసిక్లోమాల్-సి, అసిడాల్’ రెండు రకాల కంపెనీల పేరుతో ఉన్న జనరిక్ ఔషధాలను రాస్తున్నారు. జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రజిన్ స్థానంలో ‘సిట్రాల్, సిట్రైడ్’ పేర్లతో ఉండే మందులను, కడుపులో మంట నివారణకు వాడే ఫాంటాఫ్రిజోల్ స్థానంలో ‘పాంటాబ్, పాంటాబ్-డి’ అను పేరుతో ఉండే మరో మూడు రకాల కంపెనీలకు చెందిన ‘జనరిక్’ మందులు రాస్తున్నారు.
దీంతో మందుల దుకాణాల యజమానులు భారీగా లాభాలు దండుకుంటూ ఇందులో నుంచి పర్సంటేజీలను వైద్యులకు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు ముట్టజెప్పుతున్నారనే ఆరోణలు వినిపిస్తున్నాయి. అందుకే డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మందుల దుకాణాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు నెల నెలా మామూళ్లు తీసుకుంటూనే కొన్ని దుకాణాలకు వెళ్లి కొన్ని విలువైన వస్తువులు (న్యూట్రిన్స్ ఐటెమ్స్ డబ్బాలు) తీసుకెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే వారిపై కేసులు రాసి నానా ఇబ్బందులు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
మెడికల్ స్టోర్ల తీరు ఇది
బీ ఫార్మసీ పూర్తిచేసిన వారి ధ్రువపత్రాలను అద్దెకు తీసుకుని మందుల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకోవడం నిబంధనలకు విరుద్ధమైనా జిల్లాలో సర్వ సాధారణంగా మారింది. వినియోగదారులకు ఔషధాలు అందజేసేందుకు కచ్చితంగా ఫార్మాసిస్ట్‌లనే నియమించుకోవాలి.
జిల్లాలో చాలా వరకు మందుల దుకాణాల యజమానులు పదో తరగతి, ఇంటర్ తప్పిన వారిని పెట్టుకుని విక్రయాలు సాగిస్తున్నారు. దుకాణంలో ఉండే ఫార్మాసిస్టు స్థానికుడై ఉండాలి. అతని పేరు, అర్హత పత్రం నకలు కాపీ, ఇతర వివరాలు వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలి. 90 శాతం దుకాణాల్లో ఈ నిబంధనలు అమలు కావడం లేదు. మందుల కొనుగొలు సందర్భంగా దుకాణ యజమాని నుంచి ఇబ్బందులు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్, వారి హోదా, ఫోన్ నంబర్లను బోర్డులో వినియోగదారులకు కనిపించేలా ఉంచాలి.