సాక్షి, అమరావతి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత వైద్యులపైనే ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లోని పరిపాలనా విభాగానికి చెందిన అధికారులకు విజయవాడలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి రజిని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిబ్బందికి సర్విస్ రూల్స్, ఫైల్స్ నిర్వహణ, ఆస్పత్రి, కళాశాలల్లో పరిపాలనా బాధ్యతలు, తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
వైద్య శాఖలో 49 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. అంతేకాకుండా ప్రతి గ్రామానికి విలేజ్ హెల్త్ కేర్ సెంటర్ తీసుకొచ్చామని, ఇందులో ప్రాథమిక వైద్య పరీక్షలన్నీ చేస్తున్నట్లు వివరించారు. మందులు కూడా అందుబాటులో ఉన్నాయని.. 80 శాతం మంది ప్రజలు ఇప్పుడు ఈ స్థాయిలోనే వైద్యం పొందుతున్నారని పేర్కొన్నారు. వైద్య విద్యలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ ఏకంగా 17 వైద్య కళాశాలలను సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని.. వీటిలో 5 కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.
కొత్త వైద్య కళాశాలల నిర్మాణం.. ఇప్పటికే ఉన్న ఆస్పత్రుల బలోపేతం, ఇతర సదుపాయాల కల్పనకు నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ఆస్పత్రుల్లోని సిబ్బంది సమయ పాలన కచ్చితంగా పాటించేలా చూడాలని సూపరింటెండెంట్‌లను మంత్రి ఆదేశించారు. ఆస్పత్రి నుంచి ప్రతి రోగి సంతృప్తిగా ఇంటికి వెళ్లినప్పుడే ప్రభుత్వ కృషి ఫలించినట్లన్నారు. ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి రజిని చెప్పారు.
ఏకంగా 3,255 ప్రొసీజర్‌లను పథకం పరిధిలోకి తెచ్చామన్నారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు పెండింగ్ బిల్లులను ఇప్పటికే కొంత మేర చెల్లించామని.. త్వరలో మరికొంత మొత్తం చెల్లిస్తామన్నారు. సమావేశంలో డీఎంఈ డాక్టర్ నరసింహం, అడిషనల్ డీఎంఈ డాక్టర్ సత్యవరప్రసాద్, ఏడీ అప్పారావు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment