సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించాలన్న సత్సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఐదు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం శాసన సభలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ.. తొలి రెండు దశల్లో 1.60 కోట్ల కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు.
బ్రోచర్ల ద్వారా వైద్యసేవలు పొందే విధానాన్ని వివరిస్తామన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అందించే వైద్య సేవలను వివరించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారన్నారు. బాధితులను గుర్తించిన అనంతరం ఇంటి వద్దే స్పెషలిస్టు వైద్యులతో చికిత్స అందించనున్నట్లు తెలిపారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కింద రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారన్నారు. ఒకప్పుడు 919 ఉండే నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఖ్యను ఏకంగా 2,283కు పెంచారని తెలిపారు. ఇందులో 204 ఆస్పత్రులతో చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. క్యాన్సర్ వైద్యంలో 638 ప్రొసీజర్స్‌ను చేర్చడంతో పాటు రూ.600 కోట్లు ఖర్చు చేశామన్నారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో రోగులను ఇబ్బంది పెట్టినా, డబ్బులు వసూలు చేసినా 104కు ఫిర్యాదు చేస్తే ఆ హాస్పిటల్స్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు: ప్రభుత్వ విప్ కొరముట్ల
అనంతరం ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యల ఫలితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. అందుకే పీహెచ్‌సీలు, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 300కు పైగా ఓపీలు నమోదవడంతో పాటు గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులకు వైద్యం ఉచితంగా అందుతోందని, ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. బద్వేల్ సీహెచ్‌సీలో ఆర్థోపెడిక్ సర్జన్ పోస్టు మంజూరు చేయాలని, ఎక్సరే యూనిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధ కోరారు.
సీఎస్‌ఆర్ కింద పూర్తయిన డయాలసిస్ యూనిట్ భవనాన్ని ప్రభుత్వం తీసుకుని వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని కోరారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో బలోపేతం చేసిందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి తెలిపారు. ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి పథకాన్ని చేరువ చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1059 ప్రొసీజర్లు ఉంటే ఈ ప్రభుత్వం 3,257కు పెంచిందన్నారు.
నెట్‌వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే జగన్మోహనరావు
నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో కొన్ని ప్రొసీజర్స్‌కు ఆరోగ్యశ్రీపై వైద్యం చేయట్లేదని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ తర్వాత సీఎంఆర్‌ఎఫ్ కింద దరఖాస్తు చేసుకుంటే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌లో ఉండటంతో సహాయ నిధిని విడుదల చేయట్లేదని తెలిపారు. ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సదుపాయాలపై తనిఖీలు చేయాలని, విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో నెట్‌వర్క్ ఆస్పత్రుల వివరాలు, అక్కడ లభించే ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై అవగాహన కల్పించేలా దృష్టి సారించాలని కోరారు.
ఇలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే తిప్పేస్వామి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా, డిశ్చార్జి తర్వాత ఆసరా కింద రూ.5 వేలు ఇచ్చి, స్థానిక ఏఎన్‌ఎంల ద్వారా ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపడుతున్నారని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తెలిపారు. అయితే, కొన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులు రోగుల దగ్గర, ఆరోగ్యశ్రీలోనూ రెండు రకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
108లను కర్ణాటకకూ నడపండి: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
రాయదుర్గం ప్రజలు వైద్యం కోసం 150 కిలోమీటర్ల దూరంలోని అనంతపురానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల సమీపంలోనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలోనూ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కోరారు. రోడ్డు ప్రమాదం, ఇతర అత్యవసర సమయాల్లో 108 అంబులెన్సులు కర్నాటకకు తీసుకెళ్లడంలేదని, ఇకపై 108లను కర్ణాటకకు కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రిని వేగంగా పూర్తి చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment