
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో గురువారం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) విభాగం ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్పష్టమైన లక్ష్యంతో సీఎం ముందుకు వెళుతున్నారని చెప్పారు.
గ్రామస్థాయి నుంచి మెడికల్ కళాశాలల బలోపేతం, నూతన వైద్య కళాశాలల నిర్మాణం, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఏకంగా రూ. 16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని వివరించారు. గడిచిన మూడేళ్లలో 40వేలకు పైగా నియామకాలు చేపట్టారని వెల్లడించారు. ప్రజలకు ఎక్కడా వైద్యం కోసం ఇబ్బందులు ఎదురవ్వకూడదన్నారు. ఆస్పత్రుల్లో మంచినీరు, పరిశుభ్రత, శుభ్రమైన మరుగుదొడ్లు ఉండేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్పారు. ప్రతి ఉద్యోగికి ఎక్కడ సమస్య ఎదురైనట్లు గుర్తించినా.. సదరు ఏజెన్సీలపై చర్యలకు వెనుకాడొద్దని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో మందుల కొరత ఉండకుండా చూడాలన్నారు. టెస్టులు, మందులు బయటకు రాయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి పీహెచ్‌సీలో నెలకు కనీసం 10 కాన్పులైనా జరిగేలా చూడాలన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.నివాస్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి, ఎన్‌హెచ్‌ఎం ఎస్పీఎం అప్పారావు, వివిధ కార్యక్రమాల అధికారులు డాక్టర్ అనీల్‌కుమార్, గణపతిరావు, డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.