CM YS Jagan Review Meeting With Medical And Health Department - Sakshi
Sakshi News home page

104 వాహనాలు సమకూర్చుకుని ఖాళీల్లో సిబ్బందిని భర్తీ చేయాలి: సీఎం జగన్‌

Published Thu, Dec 1 2022 12:29 PM | Last Updated on Thu, Dec 1 2022 5:24 PM

CM YS Jagan Review Meeting on Medical and Health Department - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, ఆరోగ్యశ్రీ, నాడు–నేడు కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష జరిపారు. అయితే, అక్టోబరు 21న ప్రారంభించిన ఫ్యామిలీ డ్యాక్టర్‌ కాన్సెప్ట్‌ పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై సీఎం జగన్‌ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ప్రాజెక్టు అమలుకోసం తీసుకుంటున్న చర్యలను, పైలెట్‌ ప్రాజెక్టు అమలులో గుర్తించిన అంశాలను అధికారులు వివరించారు.

ఈ క్రమంలో అధికారులు..  26 జిల్లాల్లో నెలరోజుల వ్యవధిలో 7,166 విలేజ్‌ క్లినిక్స్‌లలో రెండుసార్లు చొప్పున, 2,866 విలేజ్‌ క్లినిక్స్‌లలో ఒకసారి చొప్పున ఫ్యామిలీ డాక్టర్‌ 104 వాహనంతో పాటు వెళ్లారని తెలిపారు. డిసెంబర్‌లో అదనంగా మరో 260.. 104 వాహనాలు సమకూర్చుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో పూర్తిస్థాయిలో 104 వాహనాలు అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వల్ల వైద్య సిబ్బందిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం, సమర్థత గణనీయంగా పెరిగాయన్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలు, గర్భవతుల ఆరోగ్యంపైన కూడా పరిశీలన చేస్తున్నామన్న అధికారులు తెలిపారు. ఎనీమియాతో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా నెలరోజుల వ్యవధిలో 7,86,226 మందికి సేవలందించామని వెల్లడించారు. హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్న 1,78,387 మందిని, 1,25,948 మంది మధుమేహంతో బాధపడుతున్నారని గుర్తించినట్టు తెలిపారు. వీరికి వైద్యసాయం అందించినట్టు స్పష్టం చేశారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు ఇవే..
- ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో క్రమం తప్పకుండా మందులు ఇవ్వడమే కాదు.. వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నదానిపై సూచనలు కూడా ఇవ్వాలి.
- ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తగిన స్థాయిలో సన్నద్ధం కావాలి. 
- అవసరాలకు తగిన విధంగా 104 వాహనాలను సమకూర్చుకోవాలి. 
- ఎక్కడా ఖాళీలు లేకుండా సిబ్బందిని భర్తీచేయాలి. ఆలోగా విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణాలను పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. 
- ఉగాది కల్లా వీటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. 
- ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలులో స్త్రీ శిశుసంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలి. 

- పిల్లలు, గర్భవతులు, బాలింతల్లో ఎనీమియాతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆ డేటాను స్త్రీ శిశుసంక్షేమశాఖకు బదిలీచేయాలి. డేటా ప్రకారం ఆయా లక్షణాలున్నవారికి పౌష్టికాహారం, మందులు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. 
- గ్రామ సందర్శనలో భాగంగా ఫ్యామిలీ డాక్టర్‌ ఆ గ్రామంలో మంచానికి పరిమితమైన రోగులను తప్పనిసరిగా కలవాలి.
- వైద్య, ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలి. 
- ఆరోగ్యశాఖలోని ఆశా వర్కర్‌ స్ధాయి వరకూ కూడా ట్యాబులు లేదా సెల్‌ఫోన్లు ఇవ్వాలి. 
- ఇందులో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ సహా వివిధ కార్యక్రమాలకు సంబంధించిన యాప్‌లు ఉంచాలని ఆదేశించారు. 

- ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కలిగించాలి. ఏ వ్యాధికి ఏ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుందన్నది బాధితులకు తెలియాజేయాలి.
- ఎవరికైనా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలంటే.. సంబంధిత చికిత్సను అందించే నెట్‌వర్క్‌ ఆసుపత్రి వివరాలు వెంటనే తెలిసేలా యాప్‌ను రూపొందించాలి. సంబంధిత ఆసుపత్రి లొకేషన్‌తో పాటు డైరెక్షన్‌ కూడా చూపేలా ఈ యాప్‌ ఉండాలి.
- ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు దగ్గర నుంచి కూడా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రి గురించి గైడ్‌ చేసే పరిస్థితి రావాలి. 
ప్రజలకు కూడా ఈ యాప్‌ అందుబాటులో ఉండేలా చూడాలి. ఆరోగ్య శ్రీసాప్ట్‌వేర్‌ కూడా బాగా మెరుగుపరచాలి. 

- ఎవరైనా తమకు వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలి? ఏ జబ్బుకు ఎక్కడ వైద్యం అందుతుంది? దీనికి ఆరోగ్య శ్రీ సేవలు ఎక్కడ అందుతాయి అన్నదానిపై లొకేషన్‌ సైతం తెలియజేసేలా యాప్‌లో వివరాలు ఉండాలి. 
- అలాగే ఫ్యామిలీ డాక్టర్‌ సంబంధిత గ్రామానికి వెళ్లినప్పుడు కూడా రియల్‌టైం డేటా కూడా రికార్డు చేయాలి.  దీనివల్ల సిబ్బంది మధ్య సమన్వయం, వివిధ విభాగాలు తీసుకునే చర్యల మధ్య కూడా సమన్వయం చక్కగా కుదురుతుంది. 
- ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పర్యవేక్షణకు సమర్థయంత్రాంగం ఉండాలి. రాష్ట్రస్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో అధికారులను ఉంచాలి. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటుచేయాలి.  ఆరోగ్యరంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలని, విలేజ్‌ క్లినిక్స్‌ సహా అన్నిచోట్లా  ఈ నంబర్‌ను ఉంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

- ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఏమైనా తప్పులు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సరిగ్గా సేవలు అందించకపోవడం, సేవల్లో నాణ్యత లేకపోవడం వంటి అంశాలపై కచ్చితంగా దృష్టిపెట్టాలి. నెగిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌పై కచ్చితంగా పరిశీలన, చర్యలు ఉండాలి. డయాలసిస్‌ పేషెంట్లకు సేవలందించేందుకు 108 వాహనాలు వినియోగించుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.  

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జి నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీంద్రప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవి శంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement