సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానంతో గ్రామీణ ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇప్పటివరకు 1.8 కోట్ల మంది వైద్యసేవలు పొందారని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుపై మంత్రి రజిని మంగళవారం మంగళగిరిలోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గర్భిణులకు మరింత సులభంగా ప్రభుత్వ వైద్యసేవలు అందుతున్నాయని చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలపై మరింత పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలవుతున్న తీరు, ఓపీ సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు ఒక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు చెప్పారు. రక్తహీనత సమస్యను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్‌లు అవగాహన కల్పించాలన్నారు.
బీపీ, షుగర్ వంటి అసాంక్రమిక వ్యాధులపై రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయి సర్వే చేపట్టాలని సూచించారు. గత ఏడాది ప్రారంభించిన ఎన్‌సీడీ (నాన్ కమ్యునికబుల్ డిసీజెస్) సర్వేలో భాగంగా మొత్తం జనాభాలో ఏకంగా 82.47 శాతం మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌సీడీ బాధితులకు ఫ్యామిలీ డాక్టర్ ద్వారా చికిత్స కూడా అందిస్తున్నామని వివరించారు.
తాజాగా మరోసారి సర్వే చేపట్టాలని, సెపె్టంబర్ ఒకటో తేదీ నుంచి ఈ సర్వే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం జిల్లాల నోడల్ ఆఫీసర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి ఓపీలతోపాటు ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, జె.నివాస్, డాక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment