సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ దేశంలోనే మిన్నగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలను చేరువ చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలో జంట జబ్బులైన మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) బాధితుల్లో 84% మందిపై వైద్య పర్యవేక్షణ ఉంచి, వారిలో జబ్బులు అదుపులో ఉండేలా కాలానుగుణంగా మందులు అందిస్తూ..ఇతర చికిత్సలు చేపడుతూ దేశంలోనే తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7.50 కోట్ల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా వీరిలో 24% (1.81 కోట్ల మంది) మాత్రమే వైద్య సంరక్షణలో ఉన్నారు. ఏపీ తర్వాత గోవాలో మొత్తం బాధితుల్లో 80% మంది, మధ్యప్రదేశ్‌లో 60% మంది వైద్య సంరక్షణలో ఉన్నట్లు పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 37.51 లక్షల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా..వీరిలో 31.44 లక్షల మంది వైద్య సేవలు పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది.
ప్రమాదకర జబ్బుల బారినపడకుండా...
దేశంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక జబ్బుల కారణంగా 64.9% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలున్న బాధితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, పరీక్షలు చేయించుకుని, మందులు సక్రమంగా వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర జబ్బుల బారినపడే అవకాశాలున్నాయి. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే 20% పక్షవాతం కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతుంటారు. అలాగే, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు.
ఈ క్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ విధానంలో పీహెచ్‌సీ వైద్యులు నెలలో 2 రోజులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా యాప్ రూపొందించి సచివాలయాల వారీగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను మ్యాప్ చేసి వారికి సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయో లేదో, మందులు ఇస్తున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారు.
ప్రత్యేకంగా డ్యాష్ బోర్డ్
ఎన్‌సీడీ బాధితులకు ఫాలో అప్ వైద్య సేవల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డ్‌ను వైద్య శాఖ ఏర్పాటు చేసింది. డ్యాష్ బోర్డు ద్వారా ఫలానా గ్రామానికి వైద్యుడు వెళ్లినప్పుడు ఆ గ్రామంలో బాధితులందరికీ వైద్యం చేశాడో లేదో పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు గ్రామానికి రాని రోజుల్లో విలేజ్ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన సీహెచ్‌వోలు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. క్లినిక్స్‌లో టెలీమెడిసిన్ సౌకర్యం ఉండటంతో అవసరమున్న సందర్భాల్లో హబ్‌లోని స్పెషాలిటీ వైద్యుడితో మాట్లాడించి వైద్య సేవలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment