ఆరోగ్య ఆసరాను అటకెక్కించిన ప్రభుత్వం
ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన వారికి జమ అవ్వని సాయం
గత ప్రభుత్వంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లోనే బ్యాంక్ ఖాతాలో జమ
ఆగస్టు నుంచి రోగుల ఖాతాల్లో జమ అవ్వని దుస్థితి
రెండు లక్షల మందికి రూ.30 కోట్ల మేర బకాయిలు
అనకాపల్లి జిల్లా రత్నాలపాలెంకు చెందిన పైడితల్లి ఈ ఏడాది ఆగస్టులో కోటవురట్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో బిడ్డకు జన్మనిచ్చి0ది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం కింద నమోదు చేసి వైద్యులు ప్రసవం చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లిన 24 గంటల్లో ఆమెకు ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం రూ.5 వేలు చెల్లించాల్సి ఉంది. రెండు నెలలు కావస్తున్నా ఆమె ఖాతాలో నగదు జమ అవ్వలేదు. పేమెంట్ ఇంకా ప్రాసెస్‌లో ఉన్నట్టు చూపిస్తోంది.
కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావుకు 58 ఏళ్లు. రెండు నెలల క్రితం అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. గుండెకు రక్తం సరఫరా అయ్యే రక్త నాళాల్లో పూడికలు ఉన్నట్టు తేలింది. దీంతో విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో స్టంట్‌లు వేశారు.
అడ్మిట్ అయ్యే సమయంలో ఆరోగ్య ఆసరా డబ్బు జమ చేయడం కోసం ఆరోగ్య మిత్ర ఆయన బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేశారు. చికిత్స పూర్తయ్యాక నాగేశ్వరరావు ఇంటికి చేరుకుని రెండు నెలలైంది. అయినా ఇప్పటి వరకు ఆసరా సాయం అందలేదు. ఆ సొమ్ము వస్తే పౌష్టికాహారం, మందుల ఖర్చుకు ఇబ్బంది ఉండేది కాదని మధనపడుతున్నాడు.
పేద ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష గట్టింది. విద్య, వైద్యం, సంక్షేమం.. ఇలా అన్ని విషయాల్లో వారిని వంచిస్తోంది. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమాను ప్రవేశపెట్టే క్రమంలో ప్రొసీజర్‌లకు కోతలు, చికిత్సల అనంతరం రోగులు ఇంట్లో గడిపే విశ్రాంత సమయానికి జీవన భృతి అందించే ఆసరా కార్యక్రమాన్ని అటకెక్కించే చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా రోగులకు ఆరోగ్య ఆసరా చెల్లింపును నిలిపి వేసింది.
గత ప్రభుత్వంలో రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో భృతి మొత్తం రోగి/కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేది. ప్రస్తుతం రోగి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లి కోలుకున్నాక కూడా ఆ సొమ్ము చెల్లించడం లేదు. దీంతో శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయంలో పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారు.
నెలకు రూ.5 వేలు
2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో కునారిల్లిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. ఇందులో భాగంగా 1,059 ప్రొసీజర్‌లను 3,257కు పెంచారు. వైద్య సేవల పరిమితిని దేశంలో ఎక్కడా లేనట్టుగా రూ.25 లక్షలకు పెంచారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యం బారినపడి శస్త్ర చికిత్సల అనంతరం ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈ క్రమంలో పూర్తిగా కోలుకోకుండానే వాళ్లు తిరిగి వృత్తి, ఉపాధి పనుల్లో నిమగ్నం అవుతారు. ఇలా చేయడంతో మళ్లీ వ్యాధులు, జబ్బులు తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ఈ సమస్య తలెత్తకుండా పూర్తిగా కోలుకునే వరకు రోగులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనే లక్ష్యంతో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని 2019లో ప్రవేశపెట్టారు.
ఈ కార్యక్రమం కింద నెట్‌వర్క్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోజే వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లించింది. ఇలా ఐదేళ్లలో 24,59,090 మందికి రూ.1465.67 కోట్ల మేర ఆర్థిక సాయం అందించింది.
రూ.30 కోట్ల మేర పెండింగ్
ప్రస్తుత ప్రభుత్వం ఆగస్టు నుంచి ఆసరా చెల్లింపులను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఆసరా ప్రతిపాదనలు పంపినప్పటికీ రోగుల ఖాతాల్లో డబ్బు జమ అవ్వడం లేదని ఆరోగ్య మిత్రలు చెబుతున్నారు. రోగులు, వారి బంధువులు తమకు ఫోన్‌లు చేస్తుండటంతో ఆన్‌లైన్‌లో వెరిఫై చేస్తే పేమెంట్ ప్రాసెస్‌లో ఉందని చూపిస్తోందని వెల్లడించారు. 60–70 రోజులుగా 1.50 లక్షల నుంచి రెండు లక్షల మంది రోగులకు రూ.30 కోట్ల మేర ఆసరా చెల్లింపులు నిలిచిపోయినట్టు సమాచారం.
ఆలస్యం లేకుండా రోగుల ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి ఆరోగ్య ఆసరాను గత ప్రభుత్వం గ్రీన్ ఛానల్‌లో ఉంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రీన్ ఛానల్ నుంచి ఆ పథకాన్ని తొలగించినట్టు తెలుస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్–పీఎం జన్ ఆరోగ్య యోజన పథకం కింద వచ్చే నిధులకు కొంత మేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి, బీమా రూపంలో భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆసరా భారాన్ని కూడా దించేసుకుని చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment