ప్రజారోగ్య రక్షణలో అగ్రగామిగా ఏపీ ప్రభుత్వం
కుయ్..కుయ్..అంటూ అంబులెన్స్ పరుగులు
పెద్ద రాష్ట్రమైన యూపీలో 988 అంబులెన్స్‌లతోనే సేవలు
తక్కువ జనాభా ఉన్న ఇక్కడ 768 అంబులెన్స్‌లు
కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలోనూ అరకొరే
2,204 వాహనాలతో సేవలందిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం
768 అంబులెన్స్‌లు, 936 ఎంఎంయూలు, 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు
‘ఫ్యామిలీ డాక్టర్’లో 3 కోట్లకు పైగా సేవలందించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థలో అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. స్వతహాగా వైద్యుడైన మాజీ సీఎం వైఎస్సార్ ఆ విషయాన్ని గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలో 108 అంబులెన్స్, గ్రామీణ వైద్య సేవల కోసం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంత గొప్ప వ్యవస్థ 2014–19 మధ్య బాబు పాలనలో నిర్విర్యమైంది.
తర్వాత ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం వైఎస్ జగన్ గడిచిన ఐదేళ్ల పాలనలో 108, 104 వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చారు. వైఎస్సార్ కన్నా మరో రెండడుగులు ముందుకు వేసి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. 108 అంబులెన్స్‌లు 768, ఎంఎంయూలు 936, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు 500 చొప్పున అందుబాటులోకి తెచ్చి వైద్య పరంగా సేవలందించారు. మొత్తంగా 2,204 వాహనాల ద్వారా ప్రభుత్వ రంగంలో దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను నెలకొల్పారు.
దేశంలో అగ్రస్థానంలో ఏపీ
దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సుమారు 25 కోట్లకుపైగా ప్రజలకు 988 అంబులెన్స్‌లు ఉన్నాయి. యూపీ కంటే ఐదు రెట్లు తక్కువ జనాభా ఉన్న ఏపీలో 768 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నారు. ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లో తక్కువ సంఖ్యలో అంబులెన్స్‌లు ఉండటం గమనార్హం. ఏపీలో సగటున 64,306 మందికి ఒక అంబులెన్స్ ఉంది. తెలంగాణలో 75,524 మందికి, కర్ణాటకలో 85,929 మందికి, యూపీలో 2,00,200 మందికి, గుజరాత్‌లో 1,15,000 మందికి, అస్సాంలో 1,15,000 మందికి తమిళనాడులో 1,18,000 మందికి ఒకటి చొప్పున అంబులెన్స్‌లు ఉన్నాయి.
గిరిజన ప్రాంతాలకు సేవల విస్తరణ
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్స్‌లు 336 లే ఉన్నాయి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేదు. దీంతో సీఎం జగన్ 2020 జూలై1న 412 కొత్త 108 అంబులెన్స్‌లు ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలు తీసుకొచ్చారు. దీంతో అంబులెన్స్‌ల సంఖ్య 748కు పెరిగింది. దీనికి రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్‌లో అదనంగా మరో 20 అంబులెన్స్‌లు గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. దీనికి రూ.4.76 కోట్లు వెచి్చంచారు.
ఈ క్రమంలో 108 అంబులెన్స్‌ల సంఖ్య 768కి చేరింది. 2023లో 2.5 లక్షల కిలో మీటర్లు తిరిగిన పాత వాహనాలను తొలగించి 146 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసింది. ఇందుకు రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నెలా 108 అంబులెన్స్‌ల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచి్చస్తోంది. అంటే ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108 అంబులెన్స్‌ల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తోంది. రోజుకు సగటున 3 వేలకు పైగా అత్యవసర కేసుల్లో అంబులెన్స్‌లు సేవల్లో ఉన్నాయి. 2020 జూలై నుంచి 43 లక్షల మంది ప్రాణాలను 108 అంబులెన్స్‌లు కాపాడాయి.
పల్లె చెంతకే వైద్యులు
వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ కార్యక్రమం కింద 500 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. బాబు పాలనలో ఒక వాహనంలోనే ఆస్పత్రుల నుంచి ఇద్దరు, ముగ్గురు బాలింతలను ఇళ్లకు తరలించేవారు. ఈ ప్రభుత్వంలో విశాలమైన ఎకో మోడల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఏసీ వాహనంలో ఒక బాలింతను, ఆమె సహాయకులను మాత్రమే ఇంటి వరకూ సురక్షితంగా చేరుస్తున్నారు. గతంలో ఒక ట్రిప్పునకు కేవలం రూ. 499 మాత్రమే ఖర్చు చేస్తుండగా, ప్రస్తుతం రూ.895 ఖర్చు చేస్తున్నారు.
2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 4 లక్షల మందికిపైగా బాలింతలు, గర్భిణులు ఈ సేవలను పొందారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పల్లె ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతీ పీహెచ్‌సీ వైద్యుడు నెలలో రెండుసార్లు పల్లెలకు 104 ఎంఎంయూలతో పాటు వెళుతున్నారు. అన్ని పల్లెలను నెలలో రెండుసార్లు సందర్శించేందుకు వీలుగా 936 ఎంఎంయూలను సమకూర్చారు. ఈ విధానంలో 2022 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా వైద్య సేవలను ప్రభుత్వం అందించింది.
Comments
Please login to add a commentAdd a comment