విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని న్యూరాలజీ వార్డులో అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు
కడుపు కింద భాగంలో జిస్ట్ అనే కణితి సమస్యతో బాధపడుతున్న విజయవాడకు చెందిన సునీల్‌కు గత మార్చిలో గుంటూరు జీజీహెచ్‌లో క్లిష్టమైన సర్జరీ విజయవంతంగా పూర్తైంది. బాధితుడికి చిన్న పేగు డ్యూడెనమ్, జెజునమ్ జంక్షన్ దగ్గర కణితి ఉన్నట్లు జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ కుమార్ గుర్తించారు. మెడికల్ జర్నల్స్ ప్రకారం ప్రపంచంలో ఇటువంటి కేసులు రెండు మాత్రమే నమోదయ్యాయి. అరుదైన ఈ సమస్యకు ఎలా ఆపరేషన్ చేయాలో నిర్దిష్ట విధానాలు లేకున్నా జనరల్ సర్జరీ విభాగం వైద్యులంతా చర్చించుకుని సాహసోపేతంగా నిర్వహించారు.
సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు పెద్దాస్పత్రి అంటే విజయవాడ జీజీహెచ్! 2019కి ముందు వరకూ ఇక్కడ న్యూరో విభాగంలో వైద్యులు అరకొరగా ఉండటంతో సేవలపై తీవ్ర ప్రభావం పడేది. రోజంతా కలిపినా కేవలం వంద లోపే ఓపీలు నమోదు అయ్యేవి. ఐపీలు అంతంత మాత్రంగానే ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూరో విభాగంలో మంజూరైన పోస్టులన్నింటిలో వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. ఖరీదైన చికిత్సలను సైతం ఉచితంగా అందించేలా మందులు, సదుపాయాలను సమకూర్చింది.
ప్రస్తుతం ఇక్కడ రోజుకు 250 వరకూ ఓపీలు నమోదు అవుతున్నాయి. పడకలన్నీ ఫుల్‌గా ఉంటున్నాయి. ఒక్క న్యూరో మాత్రమే కాకుండా అన్ని విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను అందుబాటులోకి తేవడంతో పాటు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చింది. సేవలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో పెద్దాస్పత్రిపై విశ్వాసం పెరిగింది. 2018–19లో 9,202 మేజర్ సర్జరీలు నిర్వహించగా 2022–23లో ఏకంగా 51 శాతం అదనంగా అంటే 13,095 సర్జరీలు జరగడం గమనార్హం. 2018–19లో 3.85 లక్షల ల్యాబ్ టెస్ట్‌లు చేయగా 2022–23లో 5.83 లక్షల టెస్ట్‌లు చేశారు.
వైద్య రంగంలో సంస్కరణలు..
సీఎం జగన్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. రోగుల తాకిడికి సరిపడా వైద్యులు, సిబ్బంది, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చారు. విజయవాడ జీజీహెచ్‌లోనే కాకుండా అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో గతంతో పోలిస్తే రోగుల సేవల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
సర్జరీల్లో పెరుగుదల
ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో బోధనాస్పత్రుల్లోని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా పోయింది. ఆపరేషన్ థియేటర్లలో అధునాతన వైద్య పరికరాలు సమకూరడంతో సర్జరీలు పెరిగాయి. 2022–23లో ఏకంగా 3,45,482 మైనర్, 1,50,592 మేజర్ సర్జరీలను నిర్వహించారు. 2023–24లో జూలై నెలాఖరు నాటికి 2.04 లక్షల మేజర్ సర్జరీలు జరిగాయి.
టీడీపీ హయాంలో 2018–19లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 1.99 లక్షల మైనర్, 98 వేల మేజర్ సర్జరీలు మాత్రమే జరిగాయి. గతంతో పోలిస్తే 73.05 శాతం మైనర్, 52.56 శాతం మేజర్ సర్టరీలు పెరిగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ల్యాబ్‌లను బలోపేతం చేయడంతో ఏటా కోటికిపైనే ల్యాబ్ టెస్ట్‌లు జీజీహెచ్‌లలో చేపడుతున్నారు. 2021–22లో 1.06 కోట్లు, 2022–23లో 1.32 కోట్ల మేర ల్యాబ్ టెస్ట్‌లు ఉచితంగా నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటికే 70 లక్షల టెస్ట్‌లు పూర్తి అయ్యాయి.
► 2021–22లో బోధనాస్పత్రుల్లో 49.32 లక్షల ఓపీ సేవలు నమోదు కాగా గతేడాది 83.16 లక్షలకు పెరిగాయి. ఐపీ సేవల్లో 33.63 శాతం పెరుగుదల నమోదైంది.
► డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో కూడిన 608 రకాల మందులను ప్రభుత్వం బోధనాస్పత్రుల్లో అందుబాటులోకి తెచ్చింది. 530కిపైగా రకాల మందులను సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ రూపంలో సరఫరా చేస్తుండగా మిగిలినవి స్థానిక ఫార్మా కంపెనీల ద్వారా అందిస్తున్నారు. ల్యాబ్ టెస్ట్‌ల నిర్వహణకు అవసరమయ్యే రీ ఏజెంట్స్ (రసాయనాలను) సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సరఫరా ప్రారంభించింది.
► నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. బోధనాస్పత్రుల్లో అదనపు వార్డులు, సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ల నిర్మాణం చేపట్టారు. గతంలో రూ.40 మాత్రమే ఉన్న డైట్ చార్జీలను రూ.80కు పెంచడం ద్వారా రోగులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
చక్కగా ఆపరేషన్ చేశారు
20 ఏళ్ల క్రితం గుండె కవాటం చెడిపోయింది. నా కుమార్తె సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నా మందులతోనే కాలం గడిపా. రానురాను సమస్య పెరగడంతో గత ఆగస్టులో కర్నూలు జీజీహెచ్‌లో అడ్మిట్ అయ్యా. సీటీ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆపరేషన్ చేశారు. మైట్రల్ వాల్వ్ రీ ప్లేస్‌మెంట్, కార్డల్ ప్రిజర్వేషన్ శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆపరేషన్ చక్కగా చేశారు. నర్సింగ్ సేవలు చాలా బాగున్నాయి. వారి చొరవతో చకచకా కోలుకోగలిగా. సాధారణంగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అంటే అందరూ తెలియని భయానికి లోనవుతుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. వసతులు బాగున్నాయి. అనుభవజ్ఞలైన వైద్యులు, సిబ్బంది మంచి వైద్యం అందిస్తున్నారు.
– వెంకట రెడ్డి, ప్రజా పరిరక్షణ ఐక్యవేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు
ప్రైవేట్‌కు మించి సేవలు..
నాన్న అనారోగ్యం బారిన పడటంతో విజయవాడ జీజీహెచ్‌కు తీసుకొచ్చాం. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి అడ్మిట్ చేసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించారు. నర్సులు, వైద్య సిబ్బంది రోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం ఈ తరహాలో సేవలుండవు.
– జి. రవి, ఎండపల్లి, ఏలూరు జిల్లా
సేవలు వినియోగించుకోవాలి
బోధనాస్పత్రుల్లో ఎంతో అనుభవజ్ఞలైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. అరుదైన జబ్బులకు ఇక్కడ చికిత్సలు అందుతున్నాయి. ప్రభుత్వం సౌకర్యాలను మెరుగుపరిచింది. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలి. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అనవసర వ్యయ ప్రయాసలకు గురి కావద్దు.
ప్రభుత్వాస్పత్రుల్లో సేవలను సద్వినియోగం చేసుకోవాలి. అరుదైన సర్జరీలు అలవోకగా చేసేందుకు వసతులున్నాయి. కోత, కుట్లు లేకుండా చిన్న గాటుతో సర్జరీలు చేస్తున్నారు.
– డాక్టర్ నరసింహం, డీఎంఈ
Comments
Please login to add a commentAdd a comment