సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు సంతృప్తికరమేనా? వసతులు బాగున్నాయా? డాక్టర్లు తగిన సమయం కేటాయించారా?..’ అంటూ రాష్ట్ర వైద్య శాఖ రోగుల నుంచి అభిప్రాయ సేకరణను ప్రారంభించింది. వారి అభిప్రాయాలకు అనుగుణంగా.. మరింత నాణ్యమైన సేవలందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది.
ఈ అభిప్రాయ సేకరణ కోసం ఒక వెబ్ అప్లికేషన్‌ను రూపొందించింది. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స తీసుకొని.. ఇంటికి వెళ్లిన రోగులకు అదే రోజు సాయంత్రంలోగా అప్లికేషన్ లింక్‌ను మొబైల్ ఫోన్‌కు టెక్ట్స్ మెసేజ్ పంపిస్తారు. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే వెబ్ అప్లికేషన్‌లోకి వెళ్తారు. అక్కడ 10 ప్రశ్నలు ప్రత్యక్షమవుతాయి. ప్రతి ప్రశ్నకు మూడు ఆప్షన్‌లు ఉంటాయి.
ఆస్పత్రికి చేరుకున్న తర్వాత మీరు డాక్టర్‌ను కలవడానికి ఎంత సమయం వేచి ఉన్నారు? డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో మీరు కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయా? చికిత్స సమయంలో డాక్టర్ మీ అనారోగ్య వివరాలు, లక్షణాలు అర్థం చేసుకోవడానికి తగిన సమయం కేటాయించారా? మీ సమస్య గురించి చెప్పేటప్పుడు డాక్టర్, నర్స్‌లు వింటున్నట్టు అనిపించిందా? శరీర పరీక్షలు చేస్తున్నప్పుడు వేరే వారికి కనపడకుండా అడ్డుగా కర్టెన్ వేశారా?.. ఇలా వైద్య సేవలు, రోగి గోప్యత, ఆస్పత్రిలో సౌకర్యాలపై పది ప్రశ్నల ద్వారా అభిప్రాయం సేకరిస్తారు.
10 ప్రశ్నలకు 11 పాయింట్లు ఉంటాయి. అభిప్రాయాల ఆధారంగా 0–4 పాయింట్లు వస్తే బిలో యావరేజ్, 4–8 పాయింట్లు వస్తే యావరేజ్, 8–10 పాయింట్లు వస్తే గుడ్, 11 పాయింట్‌లు వస్తే ఎక్స్‌లెంట్ అని ఆస్పత్రులకు గ్రేడింగ్ ఇస్తారు.
ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఒక డ్యాష్‌బోర్డును కూడా అందుబాటులోకి తెస్తున్నారు. బిలో యావరేజ్, యావరేజ్ గ్రేడింగ్ ఉన్న ఆస్పత్రుల్లో.. ఏ అంశాల్లో రోగులు అసంతృప్తిగా ఉన్నారో మెడికల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్‌లకు అలర్ట్ వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు డ్యాష్ బోర్డును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు.
వైద్య సేవలు సంతృప్తికరమేనా?
Published Fri, Dec 30 2022 2:28 AM | Last Updated on Fri, Dec 30 2022 2:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment