సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వినూత్న విధానాలను, సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీలు లేదని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టంగా చెప్పారు.
మాటలు చెప్పడమే కాకుండా అందుకు తగ్గట్టుగా 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 46 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. తాజాగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరత అనేది తలెత్తకుండా వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి వైద్య కళాశాల, బోధనాస్పత్రి వరకు అన్ని స్థాయిల్లో వైద్య శాఖలో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చింది. కేవలం నియామకాల కోసమే ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏపీఎంఎస్‌ఆర్‌బీ)ను ఏర్పాటు చేస్తోంది.
ప్రతి నెలా 20న ఖాళీల గుర్తింపు
ఏపీఎంఎస్‌ఆర్‌బీ ద్వారా వైద్య శాఖలో ఖాళీల గుర్తింపు, వాటిని ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేయడానికి ప్రత్యేకంగా కాంప్రహెన్సివ్ హెచ్‌ఆర్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోర్టల్‌లో వేతన చెల్లింపుల సమాచారం ఆధారంగా ప్రతి నెలా 20వ తేదీన ఆస్పత్రుల్లో మంజూరైన పోస్టులు, ఇన్ పొజిషన్, ఖాళీల వివరాలను పీహెచ్‌సీ డీడీవో, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌లు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌వోల లాగిన్‌కు సీఎఫ్‌ఎంస్ నుంచి ఆన్‌లైన్‌లో వెళతాయి.
వీరు ఖాళీలను ధ్రువీకరించిన అనంతరం రాష్ట్ర స్థాయిలో ఆయా విభాగాధిపతులు పరిశీలిస్తారు. విభాగాధిపతులు కూడా ధ్రువీకరించిన అనంతరం 25వ తేదీన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏపీఎంఎస్‌ఆర్‌బీ ఆన్‌లైన్ నోటిఫికేషన్‌లు జారీ చేస్తుంది. మరుసటి నెల 7వ తేదీలోగా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తుంది. నియామకాల్లో భర్తీ అయిన పోస్టులు, భర్తీ కాకుండా మిగిలిపోయిన, కొత్తగా ఏర్పడిన ఖాళీలు మళ్లీ తిరిగి 20వ తేదీన గుర్తిస్తారు. ఇలా సైక్లింగ్ విధానంలో ప్రతి నెలా ఖాళీల గుర్తింపు, వాటి నియామక ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది.
అంతా ఆన్‌లైన్ లోనే
వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను గుర్తించడం మొదలు భర్తీ చేయడం వరకు మొత్తం ఆన్‌లైన్‌లోనే చేపట్టేలా ప్రత్యేక పోర్టల్‌ను రూపొందిస్తున్నాం. బదిలీల ప్రక్రియను కూడా ఈ పోర్టల్ ద్వారానే చేపడతాం. పోర్టల్ ద్వారా ప్రతి నెలా 20న ఖాళీలు గుర్తిస్తాం. మరుసటి నెల 7వ తేదీలోగా పోస్టుల భర్తీ పూర్తి చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిన వెంటనే కార్యాచరణ మొదలుపెడతాం.
– జి.ఎస్. నవీన్ కుమార్, కార్యదర్శి (ఎఫ్‌ఏసీ), వైద్య ఆరోగ్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment