Posts Replacement
-
హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 7, తెలంగాణ హైకోర్టులో 16 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 84, తెలంగాణలో 115 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలో వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,432 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ఇది నిరంతర ప్రక్రియని స్పష్టం చేసింది. దేశంలోని జిల్లాల కోర్టుల్లో న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల హైకోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని పేర్కొంది. నిబంధనల ప్రకారం.. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపిక, నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 70 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. ఆ తర్వాత పంజాబ్, హరియాణా ఉమ్మడి హైకోర్టులో 29, బాంబే హైకోర్టులో 25, కలకత్తా, గుజరాత్ హైకోర్టుల్లో 21 చొప్పున ఖాళీలు ఉన్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 1,250, గుజరాత్లో 535, బిహార్‌లో 467, తమిళనాడులో 334, రాజస్థాన్‌లో 300 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. -
అన్ని పోస్టులూ భర్తీ చేసేలా...
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వినూత్న విధానాలను, సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీలు లేదని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టంగా చెప్పారు. మాటలు చెప్పడమే కాకుండా అందుకు తగ్గట్టుగా 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 46 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. తాజాగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరత అనేది తలెత్తకుండా వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి వైద్య కళాశాల, బోధనాస్పత్రి వరకు అన్ని స్థాయిల్లో వైద్య శాఖలో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చింది. కేవలం నియామకాల కోసమే ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఏపీఎంఎస్‌ఆర్‌బీ)ను ఏర్పాటు చేస్తోంది. ప్రతి నెలా 20న ఖాళీల గుర్తింపు ఏపీఎంఎస్‌ఆర్‌బీ ద్వారా వైద్య శాఖలో ఖాళీల గుర్తింపు, వాటిని ఆన్లైన్ విధానంలో భర్తీ చేయడానికి ప్రత్యేకంగా కాంప్రహెన్సివ్ హెచ్ఆర్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోర్టల్‌లో వేతన చెల్లింపుల సమాచారం ఆధారంగా ప్రతి నెలా 20వ తేదీన ఆస్పత్రుల్లో మంజూరైన పోస్టులు, ఇన్ పొజిషన్, ఖాళీల వివరాలను పీహెచ్సీ డీడీవో, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీసీహెచ్ఎస్, డీఎంహెచ్‌వోల లాగిన్‌కు సీఎఫ్ఎంస్ నుంచి ఆన్లైన్లో వెళతాయి. వీరు ఖాళీలను ధ్రువీకరించిన అనంతరం రాష్ట్ర స్థాయిలో ఆయా విభాగాధిపతులు పరిశీలిస్తారు. విభాగాధిపతులు కూడా ధ్రువీకరించిన అనంతరం 25వ తేదీన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏపీఎంఎస్‌ఆర్‌బీ ఆన్లైన్ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. మరుసటి నెల 7వ తేదీలోగా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తుంది. నియామకాల్లో భర్తీ అయిన పోస్టులు, భర్తీ కాకుండా మిగిలిపోయిన, కొత్తగా ఏర్పడిన ఖాళీలు మళ్లీ తిరిగి 20వ తేదీన గుర్తిస్తారు. ఇలా సైక్లింగ్ విధానంలో ప్రతి నెలా ఖాళీల గుర్తింపు, వాటి నియామక ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అంతా ఆన్లైన్ లోనే వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను గుర్తించడం మొదలు భర్తీ చేయడం వరకు మొత్తం ఆన్లైన్లోనే చేపట్టేలా ప్రత్యేక పోర్టల్‌ను రూపొందిస్తున్నాం. బదిలీల ప్రక్రియను కూడా ఈ పోర్టల్ ద్వారానే చేపడతాం. పోర్టల్ ద్వారా ప్రతి నెలా 20న ఖాళీలు గుర్తిస్తాం. మరుసటి నెల 7వ తేదీలోగా పోస్టుల భర్తీ పూర్తి చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిన వెంటనే కార్యాచరణ మొదలుపెడతాం. – జి.ఎస్. నవీన్ కుమార్, కార్యదర్శి (ఎఫ్ఏసీ), వైద్య ఆరోగ్య శాఖ -
అకౌంటెంట్ పరీక్షలో అందరూ ఫెయిలే..
పణజి: ఏ పరీక్షలోనైన పాస్, ఫెయిల్ అనేవి సర్వ సాధారణం కానీ, ఈ పరీక్షలో మాత్రం అందరూ ఫెయిలే. ఈ ఘటన గోవాలో జరిగింది. బుధవారం అకౌంటెంట్ పరీక్ష ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన 8 వేల మంది అభ్యర్థులూ ఫెయిలయ్యారని పేర్కొంది. గోవా ప్రభుత్వం 80 అకౌంటెంట్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ ఏడాది జనవరి 7న పరీక్ష నిర్వహి ంచింది. మొత్తం 100 మార్కుల పేపర్‌కు 5గంటల సమయం కేటాయించారు. దీంట్లో ఉత్తీర్ణత సాధించా లంటే కనీసం 50 మార్కులు రావాలి. ఏ ఒక్క అభ్య ర్థికీ 50 మార్కులు రాకపోవడం, వీరంతా గ్రాడ్యు యేట్ విద్యార్థులే కావడం గమనార్హం. గోవా యూని వర్సిటీ, కామర్స్ కాలేజీలు విద్యార్థులను ఇలా చేయడం సిగ్గుచేటని శివసేన దుయ్యబట్టారు. -
రైల్వేలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
ఒంగోలు టౌన్: రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ డీవైఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో నిరసన చేపట్టారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న రైల్వే, సివిల్ పోలీసులు ఆందోళనకారుల నుంచి దిష్టిబొమ్మను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో డీవైఎఫ్ఐ నాయకులు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగాయి. అంతకు ముందు డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామన్న మాట్లాడుతూ రైల్వే శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులనే నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత నష్టపోతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను నయవంచనకు గురిచేస్తున్నాయని విమర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రకటించాయని, అయితే నాలుగేళ్లు అవుతున్నా వందల సంఖ్యలో కూడా ఉద్యోగాలను భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఇంతవరకు పట్టాలెక్కలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో పొందుపరచిన వాటిని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించగా, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే నోటిఫికేషన్లు జారీచేసి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని రామన్న హెచ్చరించారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేఎఫ్ బాబు, కార్యదర్శి పి. కిరణ్, కె. సురేష్, యూ శ్రీను, పి. ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్, కార్యదర్శి సీహెచ్ సుధాకర్ పాల్గొన్నారు. -
‘మహా’ ఇబ్బంది!
- హెచ్ఎండీఏలో కుర్చీలు ఖాళీ - కీలక స్థానాల్లో అధికారుల కొరత - అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం సాక్షి, సిటీబ్యూరో:హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో కీలక పోస్టులు భర్తీ కాకపోవడంతో ‘మహా’ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు దిశా నిర్దేశం చేయాల్సిన ప్రాజెక్టు డెరైక్టర్, పరిపాలనాపరంగా కీలకమైన సెక్రటరీ పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఆ బాధ్యతలను ప్రస్తుతం మెంబర్ ఎస్టేట్ (ఎంఈ)కు అప్పగించారు. హెచ్ఎండీఏ భూముల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు, లీజ్‌లు, కోర్టు వ్యవహారాలు వంటి బాధ్యతలతో నిత్యం బిజీగా ఉండే ఆయనకు రోజువారీ అత్యవసర ఫైళ్లను క్లియర్ చే సేందుకే సమయం సరిపోతోంది. కొత్త ప్రాజెక్టుల అధ్యయనానికి, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌కు అవకాశం లేకపోతోంది. సంస్థకు ఆదాయాన్నితెచ్చిపెట్టే ఆర్అండ్ డీఓ కుర్చీ కూడా ఖాళీగా ఉంది. ఈ బాధ్యతను రేడియల్ రోడ్స్ విభాగంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఓ అధికారికి అప్పగించారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ బాధ్యతలను అర్బన్ ఫారెస్ట్రీ డెరైక్టర్‌కు అదనంగా అప్పగించడంతో ఆయన రెండు పడవలపై ప్రయాణించాల్సి వస్తోంది. కీలక విభాగాల్లో ‘బాస్’లు లేకపోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బందిపై నియంత్రణ కరవవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఔటర్’ అగమ్యగోచరం ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో కీలకమైన ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) పోస్టులు చాలాకాలంగా ఖాళీగా ఉండటంతో దీని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓఆర్ఆర్లో అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ (ఏపీడీ), ప్రాజెక్టు మేనేజర్ (పీఎం), అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (ఏపీఎం), చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) స్థానాలు దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్టు మేనేజర్ బాధ్యతలను చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (సీఏఓ)కు అప్పగించారు. సీజీఎం పోస్టు కూడా ఖాళీగా ఉంది. జీఎం ఆనంద్‌మోహన్‌కు ఈ బాధ్యతలు అప్పగించి పనులు మమ అనిపిస్తున్నారు. పదోన్నతులు కల్పించకుండా, అదనపు సిబ్బందిని ఇవ్వకుండా ఉన్న వారిపైనే భారం మోపుతుండటంతో ఆ ప్రభావం ఔటర్ నిర్మాణంపై పడుతోంది. అందని సేవలు హెచ్ఎండీఏలో మొత్తం 600 పోస్టులకు గాను ప్రస్తుతం 390 మంది సిబ్బంది ఉన్నారు. వివిధ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు సత్వర సేవలందించడంలో హెచ్ఎండీఏ ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటికే ప్లానింగ్ విభాగంలో పర్యవేక్షణ లేక ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులు మట్టికొట్టుకు పోతున్నాయి. ప్రభుత్వ అనుమతి లేదన్న కారణంతో క్రమబద్ధీకరణ ఫైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కేంద్ర కార్యాలయంలో డీఏఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లు, భూ వినియోగ మార్పిడికి సంబంధించిన వివరాలు ఇచ్చే నాథుడే లేడు. పీఆర్ఓ సెక్షన్లో డీఏఓ, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్న కొందరు అధికారులు ఇన్స్పెక్షన్లు, సమీక్ష సమావేశాలకు వెళుతుండటంతో ఆ సెక్షన్లలో సమాధానం చెప్పేవారే కరవయ్యారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన కె.ప్రదీప్ చంద్ర సత్వరం చర్యలు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దాలని వివిధ వర్గాల వారు కోరుతున్నారు.