డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఆవరణలో నిరసన
ఒంగోలు టౌన్: రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ డీవైఎఫ్‌ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో నిరసన చేపట్టారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న రైల్వే, సివిల్ పోలీసులు ఆందోళనకారుల నుంచి దిష్టిబొమ్మను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో డీవైఎఫ్‌ఐ నాయకులు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగాయి. అంతకు ముందు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామన్న మాట్లాడుతూ రైల్వే శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులనే నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత నష్టపోతోందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను నయవంచనకు గురిచేస్తున్నాయని విమర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రకటించాయని, అయితే నాలుగేళ్లు అవుతున్నా వందల సంఖ్యలో కూడా ఉద్యోగాలను భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఇంతవరకు పట్టాలెక్కలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో పొందుపరచిన వాటిని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించగా, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే నోటిఫికేషన్లు జారీచేసి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని రామన్న హెచ్చరించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కేఎఫ్ బాబు, కార్యదర్శి పి. కిరణ్, కె. సురేష్, యూ శ్రీను, పి. ప్రవీణ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్, కార్యదర్శి సీహెచ్ సుధాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment