‘మహా’ ఇబ్బంది!
- హెచ్‌ఎండీఏలో కుర్చీలు ఖాళీ
- కీలక స్థానాల్లో అధికారుల కొరత
- అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో:హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో కీలక పోస్టులు భర్తీ కాకపోవడంతో ‘మహా’ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు దిశా నిర్దేశం చేయాల్సిన ప్రాజెక్టు డెరైక్టర్, పరిపాలనాపరంగా కీలకమైన సెక్రటరీ పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఆ బాధ్యతలను ప్రస్తుతం మెంబర్ ఎస్టేట్ (ఎంఈ)కు అప్పగించారు. హెచ్‌ఎండీఏ భూముల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు, లీజ్‌లు, కోర్టు వ్యవహారాలు వంటి బాధ్యతలతో నిత్యం బిజీగా ఉండే ఆయనకు రోజువారీ అత్యవసర ఫైళ్లను క్లియర్ చే సేందుకే సమయం సరిపోతోంది.
కొత్త ప్రాజెక్టుల అధ్యయనానికి, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌కు అవకాశం లేకపోతోంది. సంస్థకు ఆదాయాన్నితెచ్చిపెట్టే ఆర్‌అండ్ డీఓ కుర్చీ కూడా ఖాళీగా ఉంది. ఈ బాధ్యతను రేడియల్ రోడ్స్ విభాగంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఓ అధికారికి అప్పగించారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్‌డీ బాధ్యతలను అర్బన్ ఫారెస్ట్రీ డెరైక్టర్‌కు అదనంగా అప్పగించడంతో ఆయన రెండు పడవలపై ప్రయాణించాల్సి వస్తోంది. కీలక విభాగాల్లో ‘బాస్’లు లేకపోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బందిపై నియంత్రణ కరవవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
‘ఔటర్’ అగమ్యగోచరం
ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో కీలకమైన ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) పోస్టులు చాలాకాలంగా ఖాళీగా ఉండటంతో దీని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓఆర్‌ఆర్‌లో అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ (ఏపీడీ), ప్రాజెక్టు మేనేజర్ (పీఎం), అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (ఏపీఎం), చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) స్థానాలు దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్టు మేనేజర్ బాధ్యతలను చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (సీఏఓ)కు అప్పగించారు. సీజీఎం పోస్టు కూడా ఖాళీగా ఉంది. జీఎం ఆనంద్‌మోహన్‌కు ఈ బాధ్యతలు అప్పగించి పనులు మమ అనిపిస్తున్నారు. పదోన్నతులు కల్పించకుండా, అదనపు సిబ్బందిని ఇవ్వకుండా ఉన్న వారిపైనే భారం మోపుతుండటంతో ఆ ప్రభావం ఔటర్ నిర్మాణంపై పడుతోంది.
అందని సేవలు
హెచ్‌ఎండీఏలో మొత్తం 600 పోస్టులకు గాను ప్రస్తుతం 390 మంది సిబ్బంది ఉన్నారు. వివిధ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు సత్వర సేవలందించడంలో హెచ్‌ఎండీఏ ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటికే ప్లానింగ్ విభాగంలో పర్యవేక్షణ లేక ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ దరఖాస్తులు మట్టికొట్టుకు పోతున్నాయి. ప్రభుత్వ అనుమతి లేదన్న కారణంతో క్రమబద్ధీకరణ ఫైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కేంద్ర కార్యాలయంలో డీఏఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లు, భూ వినియోగ మార్పిడికి సంబంధించిన వివరాలు ఇచ్చే నాథుడే లేడు.
పీఆర్‌ఓ సెక్షన్‌లో డీఏఓ, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్న కొందరు అధికారులు ఇన్‌స్పెక్షన్లు, సమీక్ష సమావేశాలకు వెళుతుండటంతో ఆ సెక్షన్లలో సమాధానం చెప్పేవారే కరవయ్యారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన కె.ప్రదీప్ చంద్ర సత్వరం చర్యలు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దాలని వివిధ వర్గాల వారు కోరుతున్నారు.