Shortage of officers
-
ఇన్చార్జీల పాలన
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : జిల్లాల పునర్విభజనకు ముందే ఉమ్మడి జిల్లాలోని ప్రధాన శాఖల్లో జిల్లా అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జి అధికారులతో ఆయా శాఖలను నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి విడిపోయి జిల్లాగా అవతరించిన అనంతరం నిజామాబాద్ జిల్లా పరిస్థితి మరీ దారుణంగా మారింది. సిబ్బంది, అధికారుల కొరతతో కార్యాలయాలు కళ తప్పాయి. ముందే అధికారులు, సిబ్బంది కొరత ఉందంటే పదవీ విరమణ కారణాలతో ఖాళీల సంఖ్య ఎక్కువైంది. నిజామాబాద్ ఆర్డీవో పోస్టు నెల రోజులకు పైబడి ఖాళీగా ఉంది. గతంలో ఆర్డీవోగా పనిచేసిన యాదిరెడ్డి డీఆర్వోగా పదోన్నతిపై వేరే జిల్లాకు వెళ్లారు. ప్రభుత్వం రెగ్యులర్ అధికారిని పంపడంలో జాప్యం చేస్తోంది. రెవెన్యూ డివిజన్లలో పెద్దదైన నిజామాబాద్ డివిజన్‌కు ఆర్డీవోను నియమించక పోవడంతో రెవెన్యూ పరిపాలన చతికిల పడింది. ఇన్చార్జి ఆర్డీవోగా ప్రస్తుత డీఆర్వో పద్మాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే, జిల్లాకు రెండో గుండెకాయ వంటి జిల్లా పరిషత్ కార్యాలయానికి రెగ్యులర్ సీఈవో లేరు. మొన్నటివరకు సీఈవోగా పని చేసిన మోహన్‌లాల్ డీఆర్వోగా పదోన్నతిపై వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో గోవింద్‌కు ఇన్‌చార్జీగా బాధ్యతలు అప్పగించారు. నెల రోజులు గడిచినా ఆ పోస్టుకు రెగ్యులర్ అధికారిని నియమించలేదు. గిరిజన సంక్షేమ శాఖలోనూ అంతే.. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయానికొస్తే డీటీడబ్ల్యూవోగా మొన్నటివరకు పని చేసిన విజయ్‌కుమార్ గత డిసెంబర్లో పదవీ విరమణ పొందారు. రెగ్యులర్ అధికారిని నియమించక పోవడంతో బీసీ సంక్షేమాధికారి విమలాదేవికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎస్సీ సంక్షేమ శాఖ, కార్పొరేషన్‌కు రెగ్యులర్ అధికారులు లేరు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ శాఖకు జగదీశ్వర్‌ను, ఎస్సీ కార్పొరేషన్ బాధ్యతలను మైనార్టీ వెల్ఫేర్ అధికారి కిషన్‌కు అప్పగించారు. అలాగే, జిల్లా ట్రెజరీ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ పోస్టు సెప్టెంబర్ నుంచి ఖాళీగా ఉంది. అప్పటి నుంచి కొందరు అధికారులు ఇన్‌చార్జీలుగా వ్యవహరించగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏటీవో మోహన్‌రెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రాజెక్టు డైరెక్టర్ గత డిసెంబర్లో పదవీ విరమణ పొందడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. దీంతో నిజామాబాద్ రూరల్ ప్రాజెక్టు సీడీపీవో ఝాన్సీరాణికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. జాతీయ బాల కార్మిక నిర్మూలన సంస్థ (ఎన్ఎల్పీ) ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్‌రావు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే సస్పెండ్ అయ్యారు. ఈ పోస్టులో మరో అధికారిని నియమించలేదు. నెలాఖరున జేపీ, కలెక్టరేట్ ఏవోల పదవీ విరమణ.. ఓ వైపు జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా మారి ఇన్చార్జీల పాలన కొనసాగుతుంటే, ఈ నెలాఖరున మరో రెండు కీలక పోస్టులు ఖాళీ కాబోతున్నాయి. జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. కలెక్టరేట్ పరిపాలన విభాగం (ఏవో) అధికారిగా పని చేస్తున్న గంగాధర్ కూడా ఇదే నెలలో రిటైర్డ్ కానున్నారు. ఇన్చార్జి ఏవోగా సీనియర్ తహసీల్దార్‌కు బాధ్యతలు అప్పగించడానికి కలెక్టరేట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జేసీ సహా కీలక పోస్టులన్నీ ఖాళీ కావడంతో పరిపాలనకు మరింత ఇబ్బందులు వచ్చి పడే అవకాశాలున్నాయి. డివిజన్, మండల స్థాయి పోస్టులూ అంతే.. ఇక, డివిజన్, మండల స్థాయి పోస్టులు కూడా చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. డివిజన్ స్థాయిలో నిజామాబాద్ ఆర్డీవో పోస్టు ఒకటి కాగా, ఎస్సీ సంక్షేమ శాఖలో బోధన్, ఆర్మూర్ సహాయ సంక్షేమాధికారుల పోస్టులకు రెగ్యులర్ అధికారులు లేరు. దీంతో హాస్టళ్లను పర్యవేక్షించే వారే కరువయ్యారు. అలాగే కొన్ని మండలాల్లో రెగ్యులర్ తహసీల్దార్లు లేరు. ఇందల్వాయి, రుద్రూర్, ఏర్గట్ల, ముప్కాల్, నిజామాబాద్ రూరల్ మండలాల్లో ఇన్‌చార్జిలతోనే కథ నడిపిస్తున్నారు. మోర్తాడ్, బాల్కొండ, రెంజల్, భీమ్‌గల్ మండలాలకు ఎంపీడీవోలు లేరు. అక్కడ ఈవోపీఆర్డీలే ఇన్చార్జి ఎంపీడీవోలుగా వ్యవహరిస్తున్నారు. -
‘మహా’ ఇబ్బంది!
- హెచ్ఎండీఏలో కుర్చీలు ఖాళీ - కీలక స్థానాల్లో అధికారుల కొరత - అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం సాక్షి, సిటీబ్యూరో:హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో కీలక పోస్టులు భర్తీ కాకపోవడంతో ‘మహా’ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు దిశా నిర్దేశం చేయాల్సిన ప్రాజెక్టు డెరైక్టర్, పరిపాలనాపరంగా కీలకమైన సెక్రటరీ పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఆ బాధ్యతలను ప్రస్తుతం మెంబర్ ఎస్టేట్ (ఎంఈ)కు అప్పగించారు. హెచ్ఎండీఏ భూముల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు, లీజ్‌లు, కోర్టు వ్యవహారాలు వంటి బాధ్యతలతో నిత్యం బిజీగా ఉండే ఆయనకు రోజువారీ అత్యవసర ఫైళ్లను క్లియర్ చే సేందుకే సమయం సరిపోతోంది. కొత్త ప్రాజెక్టుల అధ్యయనానికి, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌కు అవకాశం లేకపోతోంది. సంస్థకు ఆదాయాన్నితెచ్చిపెట్టే ఆర్అండ్ డీఓ కుర్చీ కూడా ఖాళీగా ఉంది. ఈ బాధ్యతను రేడియల్ రోడ్స్ విభాగంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఓ అధికారికి అప్పగించారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ బాధ్యతలను అర్బన్ ఫారెస్ట్రీ డెరైక్టర్‌కు అదనంగా అప్పగించడంతో ఆయన రెండు పడవలపై ప్రయాణించాల్సి వస్తోంది. కీలక విభాగాల్లో ‘బాస్’లు లేకపోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బందిపై నియంత్రణ కరవవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఔటర్’ అగమ్యగోచరం ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో కీలకమైన ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) పోస్టులు చాలాకాలంగా ఖాళీగా ఉండటంతో దీని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓఆర్ఆర్లో అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ (ఏపీడీ), ప్రాజెక్టు మేనేజర్ (పీఎం), అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (ఏపీఎం), చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) స్థానాలు దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్టు మేనేజర్ బాధ్యతలను చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (సీఏఓ)కు అప్పగించారు. సీజీఎం పోస్టు కూడా ఖాళీగా ఉంది. జీఎం ఆనంద్‌మోహన్‌కు ఈ బాధ్యతలు అప్పగించి పనులు మమ అనిపిస్తున్నారు. పదోన్నతులు కల్పించకుండా, అదనపు సిబ్బందిని ఇవ్వకుండా ఉన్న వారిపైనే భారం మోపుతుండటంతో ఆ ప్రభావం ఔటర్ నిర్మాణంపై పడుతోంది. అందని సేవలు హెచ్ఎండీఏలో మొత్తం 600 పోస్టులకు గాను ప్రస్తుతం 390 మంది సిబ్బంది ఉన్నారు. వివిధ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు సత్వర సేవలందించడంలో హెచ్ఎండీఏ ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటికే ప్లానింగ్ విభాగంలో పర్యవేక్షణ లేక ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులు మట్టికొట్టుకు పోతున్నాయి. ప్రభుత్వ అనుమతి లేదన్న కారణంతో క్రమబద్ధీకరణ ఫైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కేంద్ర కార్యాలయంలో డీఏఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లు, భూ వినియోగ మార్పిడికి సంబంధించిన వివరాలు ఇచ్చే నాథుడే లేడు. పీఆర్ఓ సెక్షన్లో డీఏఓ, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్న కొందరు అధికారులు ఇన్స్పెక్షన్లు, సమీక్ష సమావేశాలకు వెళుతుండటంతో ఆ సెక్షన్లలో సమాధానం చెప్పేవారే కరవయ్యారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన కె.ప్రదీప్ చంద్ర సత్వరం చర్యలు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దాలని వివిధ వర్గాల వారు కోరుతున్నారు. -
‘అదనపు’ భారంతో అవస్థలు
ఇందూరు: జిల్లాలో అధికారుల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులకు అదనపు బాధ్యతలు తప్పడంలేదు. ఫలితంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి తమ ప్రాణం మీదకు తెస్తోందని వాపోతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల స్థానంలో రెగ్యులర్ అధికారులు రాకపోవడంతో ఉన్నతాధికారులు విధి లేక ఉన్నవారికే అదనపు విధులు అప్పగిస్తున్నారు. పని ఒత్తిడితో వారు మానసిక, శారీరక అరోగ్య సమస్యలకు గురవుతున్నారు. తమకు అదనపు భారం వద్దని, తొలగించాలని మొరపెట్టుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. విమలాదేవికి మూడు బాధ్యతలు.. ఎన్నో ఇబ్బందులు బోధన్ బీసీ సహాయ సంక్షేమ అధికారి విమలాదేవి ఏకంగా మూడు శాఖల అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన ఉద్యోగాన్ని కలుపుకుని మొత్తం నాలుగు పో స్టులలో పని చేస్తూ భారం మోస్తున్నారు. ఏడాది క్రితం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజయ్య పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలను విమలాదేవికి అప్పగిం చారు. బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ విజయ్‌కుమార్ బదిలీ కావడంతో, ఆ బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించారు. తన సొంత ఉద్యోగంతోపాటు రెండు జిల్లాస్థాయి అధికారుల పోస్టులలో పనిచేయడం కష్టంగా మారి ఆమె ఇబ్బందులు పడుతుంటే, మరొక సమస్య వచ్చిపడింది. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాములు మూడు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. దీంతో ఈ శాఖకు కూడా ఇన్చార్జి అధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. బలవంతంగా అదనపు బాధ్యతలు తీసుకున్న విమలాదేవి, నాలుగు దిక్కుల ఒకేరోజు పనిచేయడంతో తీవ్ర మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్నారు. రెండు మూడు సార్లు అనారోగ్యా నికి గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. నాలుగు బాధ్యతలు ఉండడంతో ఏ పోస్టుకూ న్యాయం చేయలేకపోతున్నారు. బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారనే పేరు ఉండడంతో విమలాదేవికి జిల్లా అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిసిందే. మొర వినరేం నాలుగు బాధ్యతలు నిర్వర్తించడం విమలాదేవికి తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో తనను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని గత కలెక్టర్ ప్రద్యుమ్నకు ఆమె మొరపెట్టుకున్నారు. జిల్లాస్థాయి అధికారుల కొరత తీవ్రంగా ఉందని, రెగ్యులర్ అధికారులు వచ్చే వరకు ఎలాగోలా నెట్టుకురావాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. దీంతో అసంతృప్తిగానే ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. ప్రస్తుత కలెక్ట ర్ రొనాల్డ్ రోస్కు సైతం ఆమె విన్నవించారు. అయినా, ఫలితం లేకపోవడంతో గంటకో శాఖకు వెళ్లి కూర్చుంటున్నారు. లేదంటే ఫైళ్లు తనవద్దకు తెప్పించుకుంటూ శాఖలను నెట్టుకొస్తున్నారు. ఈమె ఒక్కరిదే కాదు ఈ పరిస్థితి, జిల్లాలో ముఖ్యమైన జిల్లాస్థాయి అధికారులు పోస్టులు ఖాళీగా ఉండటంతో పలువురు అధికారులు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వీరికి అదనపు బాధ్యతలు.. జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం జిల్లా ఇన్చార్జి ఏజేసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మెప్మా పీడీ సత్యనారాయణ జిల్లా బీసీ కార్పొరేషన్ ఇన్చార్జి అధికారిగా వ్యవహరిస్తున్నారు. సాంఘీక సంక్షేమ శాఖ జేడీ ఖాలేబ్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి అధికారిగా కొనసాగుతున్నారు. ఐకేపీ పీడీ వెంకటేశం జిల్లా యువజన సంక్షేమ శాఖకు, సైనిక సంక్షేమ శాఖకు అదనపు బాధ్యతలు చూస్తున్నారు. సహాయ సాంఘీక సంక్షేమాధికారి జగదీశ్వర్‌రెడ్డి ఇన్చార్జ్ జిల్లా సాంఘీక సంక్షేమాధికారిగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ ఆర్డీఓ యాదిరెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా బాధ్యతల్లో కొనసాగుతున్నారు.