‘అదనపు’ భారంతో అవస్థలు
ఇందూరు: జిల్లాలో అధికారుల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులకు అదనపు బాధ్యతలు తప్పడంలేదు. ఫలితంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి తమ ప్రాణం మీదకు తెస్తోందని వాపోతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల స్థానంలో రెగ్యులర్ అధికారులు రాకపోవడంతో ఉన్నతాధికారులు విధి లేక ఉన్నవారికే అదనపు విధులు అప్పగిస్తున్నారు. పని ఒత్తిడితో వారు మానసిక, శారీరక అరోగ్య సమస్యలకు గురవుతున్నారు. తమకు అదనపు భారం వద్దని, తొలగించాలని మొరపెట్టుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
విమలాదేవికి మూడు బాధ్యతలు.. ఎన్నో ఇబ్బందులు
బోధన్ బీసీ సహాయ సంక్షేమ అధికారి విమలాదేవి ఏకంగా మూడు శాఖల అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన ఉద్యోగాన్ని కలుపుకుని మొత్తం నాలుగు పో స్టులలో పని చేస్తూ భారం మోస్తున్నారు. ఏడాది క్రితం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజయ్య పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలను విమలాదేవికి అప్పగిం చారు. బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ విజయ్‌కుమార్ బదిలీ కావడంతో, ఆ బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించారు. తన సొంత ఉద్యోగంతోపాటు రెండు జిల్లాస్థాయి అధికారుల పోస్టులలో పనిచేయడం కష్టంగా మారి ఆమె ఇబ్బందులు పడుతుంటే, మరొక సమస్య వచ్చిపడింది.
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాములు మూడు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. దీంతో ఈ శాఖకు కూడా ఇన్‌చార్జి అధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. బలవంతంగా అదనపు బాధ్యతలు తీసుకున్న విమలాదేవి, నాలుగు దిక్కుల ఒకేరోజు పనిచేయడంతో తీవ్ర మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్నారు. రెండు మూడు సార్లు అనారోగ్యా నికి గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. నాలుగు బాధ్యతలు ఉండడంతో ఏ పోస్టుకూ న్యాయం చేయలేకపోతున్నారు. బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారనే పేరు ఉండడంతో విమలాదేవికి జిల్లా అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిసిందే.
మొర వినరేం
నాలుగు బాధ్యతలు నిర్వర్తించడం విమలాదేవికి తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో తనను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని గత కలెక్టర్ ప్రద్యుమ్నకు ఆమె మొరపెట్టుకున్నారు. జిల్లాస్థాయి అధికారుల కొరత తీవ్రంగా ఉందని, రెగ్యులర్ అధికారులు వచ్చే వరకు ఎలాగోలా నెట్టుకురావాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. దీంతో అసంతృప్తిగానే ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు.
బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. ప్రస్తుత కలెక్ట ర్ రొనాల్డ్ రోస్‌కు సైతం ఆమె విన్నవించారు. అయినా, ఫలితం లేకపోవడంతో గంటకో శాఖకు వెళ్లి కూర్చుంటున్నారు. లేదంటే ఫైళ్లు తనవద్దకు తెప్పించుకుంటూ శాఖలను నెట్టుకొస్తున్నారు. ఈమె ఒక్కరిదే కాదు ఈ పరిస్థితి, జిల్లాలో ముఖ్యమైన జిల్లాస్థాయి అధికారులు పోస్టులు ఖాళీగా ఉండటంతో పలువురు అధికారులు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.
వీరికి అదనపు బాధ్యతలు..
జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం జిల్లా ఇన్‌చార్జి ఏజేసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మెప్మా పీడీ సత్యనారాయణ జిల్లా బీసీ కార్పొరేషన్ ఇన్‌చార్జి అధికారిగా వ్యవహరిస్తున్నారు.
సాంఘీక సంక్షేమ శాఖ జేడీ ఖాలేబ్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జి అధికారిగా కొనసాగుతున్నారు.
ఐకేపీ పీడీ వెంకటేశం జిల్లా యువజన సంక్షేమ శాఖకు, సైనిక సంక్షేమ శాఖకు అదనపు బాధ్యతలు చూస్తున్నారు.
సహాయ సాంఘీక సంక్షేమాధికారి జగదీశ్వర్‌రెడ్డి ఇన్‌చార్జ్ జిల్లా సాంఘీక సంక్షేమాధికారిగా వ్యవహరిస్తున్నారు.
నిజామాబాద్ ఆర్‌డీఓ యాదిరెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో)గా బాధ్యతల్లో కొనసాగుతున్నారు.