ఇన్‌చార్జీల పాలన | The governance of charge | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జీల పాలన

Published Wed, Jan 25 2017 10:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

ఇన్‌చార్జీల పాలన

ఇన్‌చార్జీల పాలన

ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌) : జిల్లాల పునర్విభజనకు ముందే ఉమ్మడి జిల్లాలోని ప్రధాన శాఖల్లో జిల్లా అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జి అధికారులతో ఆయా శాఖలను నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి విడిపోయి జిల్లాగా అవతరించిన అనంతరం నిజామాబాద్‌ జిల్లా పరిస్థితి మరీ దారుణంగా మారింది. సిబ్బంది, అధికారుల కొరతతో కార్యాలయాలు కళ తప్పాయి. ముందే అధికారులు, సిబ్బంది కొరత ఉందంటే పదవీ విరమణ కారణాలతో ఖాళీల సంఖ్య ఎక్కువైంది. నిజామాబాద్‌ ఆర్డీవో పోస్టు నెల రోజులకు పైబడి ఖాళీగా ఉంది. గతంలో ఆర్డీవోగా పనిచేసిన యాదిరెడ్డి డీఆర్వోగా పదోన్నతిపై వేరే జిల్లాకు వెళ్లారు. ప్రభుత్వం రెగ్యులర్‌ అధికారిని పంపడంలో జాప్యం చేస్తోంది.

రెవెన్యూ డివిజన్లలో పెద్దదైన నిజామాబాద్‌ డివిజన్‌కు ఆర్డీవోను నియమించక పోవడంతో రెవెన్యూ పరిపాలన చతికిల పడింది. ఇన్‌చార్జి ఆర్డీవోగా ప్రస్తుత డీఆర్వో పద్మాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే, జిల్లాకు రెండో గుండెకాయ వంటి జిల్లా పరిషత్‌ కార్యాలయానికి రెగ్యులర్‌ సీఈవో లేరు. మొన్నటివరకు సీఈవోగా పని చేసిన మోహన్‌లాల్‌ డీఆర్వోగా పదోన్నతిపై వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో గోవింద్‌కు ఇన్‌చార్జీగా బాధ్యతలు అప్పగించారు. నెల రోజులు గడిచినా ఆ పోస్టుకు రెగ్యులర్‌ అధికారిని నియమించలేదు.

గిరిజన సంక్షేమ శాఖలోనూ అంతే..
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయానికొస్తే డీటీడబ్ల్యూవోగా మొన్నటివరకు పని చేసిన విజయ్‌కుమార్‌ గత డిసెంబర్‌లో పదవీ విరమణ పొందారు. రెగ్యులర్‌ అధికారిని నియమించక పోవడంతో బీసీ సంక్షేమాధికారి విమలాదేవికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎస్సీ సంక్షేమ శాఖ, కార్పొరేషన్‌కు రెగ్యులర్‌ అధికారులు లేరు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ శాఖకు జగదీశ్వర్‌ను, ఎస్సీ కార్పొరేషన్‌ బాధ్యతలను మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి కిషన్‌కు అప్పగించారు. అలాగే, జిల్లా ట్రెజరీ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టు సెప్టెంబర్‌ నుంచి ఖాళీగా ఉంది. అప్పటి నుంచి కొందరు అధికారులు ఇన్‌చార్జీలుగా వ్యవహరించగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏటీవో మోహన్‌రెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) ప్రాజెక్టు డైరెక్టర్‌ గత డిసెంబర్‌లో పదవీ విరమణ పొందడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. దీంతో నిజామాబాద్‌ రూరల్‌ ప్రాజెక్టు సీడీపీవో ఝాన్సీరాణికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్‌ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. జాతీయ బాల కార్మిక నిర్మూలన సంస్థ (ఎన్‌ఎల్‌పీ) ప్రాజెక్టు డైరెక్టర్‌ సుధాకర్‌రావు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే సస్పెండ్‌ అయ్యారు. ఈ పోస్టులో మరో అధికారిని నియమించలేదు.

నెలాఖరున జేపీ, కలెక్టరేట్‌ ఏవోల పదవీ విరమణ..
ఓ వైపు జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా మారి ఇన్‌చార్జీల పాలన కొనసాగుతుంటే, ఈ నెలాఖరున మరో రెండు కీలక పోస్టులు ఖాళీ కాబోతున్నాయి. జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. కలెక్టరేట్‌ పరిపాలన విభాగం (ఏవో) అధికారిగా పని చేస్తున్న గంగాధర్‌ కూడా ఇదే నెలలో రిటైర్డ్‌ కానున్నారు. ఇన్‌చార్జి ఏవోగా సీనియర్‌ తహసీల్దార్‌కు బాధ్యతలు అప్పగించడానికి కలెక్టరేట్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జేసీ సహా కీలక పోస్టులన్నీ ఖాళీ కావడంతో పరిపాలనకు మరింత ఇబ్బందులు వచ్చి పడే అవకాశాలున్నాయి.

డివిజన్, మండల స్థాయి పోస్టులూ అంతే..
ఇక, డివిజన్, మండల స్థాయి పోస్టులు కూడా చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. డివిజన్‌ స్థాయిలో నిజామాబాద్‌ ఆర్డీవో పోస్టు ఒకటి కాగా, ఎస్సీ సంక్షేమ శాఖలో బోధన్, ఆర్మూర్‌ సహాయ సంక్షేమాధికారుల పోస్టులకు రెగ్యులర్‌ అధికారులు లేరు. దీంతో హాస్టళ్లను పర్యవేక్షించే వారే కరువయ్యారు.

అలాగే కొన్ని మండలాల్లో రెగ్యులర్‌ తహసీల్దార్లు లేరు. ఇందల్వాయి, రుద్రూర్, ఏర్గట్ల, ముప్కాల్, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల్లో ఇన్‌చార్జిలతోనే కథ నడిపిస్తున్నారు. మోర్తాడ్, బాల్కొండ, రెంజల్, భీమ్‌గల్‌ మండలాలకు ఎంపీడీవోలు లేరు. అక్కడ ఈవోపీఆర్డీలే ఇన్‌చార్జి ఎంపీడీవోలుగా వ్యవహరిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement