reorganization of the districts
-
గీసుకొండలో కలెక్టరేట్ ?
ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పనుల్లో వేగం స్థల సేకరణ బాధ్యత రెండు మండలాల తహసీల్దార్లకు అప్పగింత మండలాల్లోనూ ల్యాండ్‌బ్యాంకు కోసం రెవెన్యూ శాఖ కసరత్తు హన్మకొండ : తెలంగాణలో జిల్లాల పునర్విభజన తరువాత పాలనా కేంద్రాలైన కలెక్టరేట్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులు తాజాగా రూ.1,032 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారుచేశారు. ఈమేరకు వరంగల్ రూరల్ జిల్లాకు కలెక్టరేట్ ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అధికారులు దానిని వేగవంతం చేశారు. జిల్లాలోని 15 మండలాల ప్రజలు వచ్చి, వెళ్లేందుకు గీసుకొండ మండలం అనువుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించడంతో పాటు స్థల సేకరణపై దృష్టి సారించారు. ‘డబుల్’ కసరత్తు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే వరంగల్ రూరల్ జిల్లా పరిస్థితి విభిన్నంగా ఉంది. జిల్లా కార్యాలయాలన్నీ ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని హన్మకొండలో కొనసాగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం సాంకేతికంగా జిల్లా రెవెన్యూ పరిధిలో లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతో ఈ జిల్లాకు సంబంధించి అధికారులు మరింత కసరత్తు చేయాల్సి వస్తోంది. ఇక్కడ కలెక్టరేట్ భవనాల సముదాయానికి రంగం సిద్ధం చేయాలంటే అసలు జిల్లా కేంద్రం ఎక్కడ అనే విషయాన్ని నిర్ణయించాల్సి ఉంది. దీంతో జిల్లా యంత్రాంగానికి డబుల్ కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్ రూరల్ జిల్లా వరంగల్ నగరం చుట్టూ విస్తరించి ఉండడంతో జిల్లా పరిధిలో ఉన్న 15మండలాలకు అనువుగా ఉండేలా జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. నగరాన్ని అనుకుని ఉన్న గీసుకొండ మండలం అనువుగా ఉండడంతో ఈ మండల పరిధిలోని పలుచోట్ల అనువైన స్థలం కోసం రెవెన్యూ యంత్రాంగం అన్వేషిస్తోంది. గీసుకొండ మండలంలోని కోనాయమాకుల, గొర్రెకుంట, ధర్మారం, సంగెం మండలంలోని శాయంపేట గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే స్థలాల అన్వేషణ, సేకరణ బాధ్యతలను గీసుకొండ, సంగెం తహసిల్దార్లకు అప్పగించారు. కాగా, ప్రభుత్వం కలెక్టరేట్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించిన నేపథ్యంలో స్థల గుర్తింపు పనులు వేగిరం కానున్నాయి. తొలుత మూడు అంతస్తులు.. కలెక్టరేట్ల భవనాలను తొలిదశలో మూడు అంతస్తుల్లో నిర్మించేలా ఉన్నతాధికారులు అంచనాలు రూపొందించారు. అయితే, భవిష్యత్‌లో అవసరాన్ని బట్టి మరో రెండు అంతస్తులు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ చివరిలోగా కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ప్రారంభించి ఏడాదిన్నరలో మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లాలో అధికారులు స్థల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. -
ఇన్చార్జీల పాలన
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : జిల్లాల పునర్విభజనకు ముందే ఉమ్మడి జిల్లాలోని ప్రధాన శాఖల్లో జిల్లా అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జి అధికారులతో ఆయా శాఖలను నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి విడిపోయి జిల్లాగా అవతరించిన అనంతరం నిజామాబాద్ జిల్లా పరిస్థితి మరీ దారుణంగా మారింది. సిబ్బంది, అధికారుల కొరతతో కార్యాలయాలు కళ తప్పాయి. ముందే అధికారులు, సిబ్బంది కొరత ఉందంటే పదవీ విరమణ కారణాలతో ఖాళీల సంఖ్య ఎక్కువైంది. నిజామాబాద్ ఆర్డీవో పోస్టు నెల రోజులకు పైబడి ఖాళీగా ఉంది. గతంలో ఆర్డీవోగా పనిచేసిన యాదిరెడ్డి డీఆర్వోగా పదోన్నతిపై వేరే జిల్లాకు వెళ్లారు. ప్రభుత్వం రెగ్యులర్ అధికారిని పంపడంలో జాప్యం చేస్తోంది. రెవెన్యూ డివిజన్లలో పెద్దదైన నిజామాబాద్ డివిజన్‌కు ఆర్డీవోను నియమించక పోవడంతో రెవెన్యూ పరిపాలన చతికిల పడింది. ఇన్చార్జి ఆర్డీవోగా ప్రస్తుత డీఆర్వో పద్మాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే, జిల్లాకు రెండో గుండెకాయ వంటి జిల్లా పరిషత్ కార్యాలయానికి రెగ్యులర్ సీఈవో లేరు. మొన్నటివరకు సీఈవోగా పని చేసిన మోహన్‌లాల్ డీఆర్వోగా పదోన్నతిపై వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో గోవింద్‌కు ఇన్‌చార్జీగా బాధ్యతలు అప్పగించారు. నెల రోజులు గడిచినా ఆ పోస్టుకు రెగ్యులర్ అధికారిని నియమించలేదు. గిరిజన సంక్షేమ శాఖలోనూ అంతే.. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయానికొస్తే డీటీడబ్ల్యూవోగా మొన్నటివరకు పని చేసిన విజయ్‌కుమార్ గత డిసెంబర్లో పదవీ విరమణ పొందారు. రెగ్యులర్ అధికారిని నియమించక పోవడంతో బీసీ సంక్షేమాధికారి విమలాదేవికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎస్సీ సంక్షేమ శాఖ, కార్పొరేషన్‌కు రెగ్యులర్ అధికారులు లేరు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ శాఖకు జగదీశ్వర్‌ను, ఎస్సీ కార్పొరేషన్ బాధ్యతలను మైనార్టీ వెల్ఫేర్ అధికారి కిషన్‌కు అప్పగించారు. అలాగే, జిల్లా ట్రెజరీ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ పోస్టు సెప్టెంబర్ నుంచి ఖాళీగా ఉంది. అప్పటి నుంచి కొందరు అధికారులు ఇన్‌చార్జీలుగా వ్యవహరించగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏటీవో మోహన్‌రెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రాజెక్టు డైరెక్టర్ గత డిసెంబర్లో పదవీ విరమణ పొందడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. దీంతో నిజామాబాద్ రూరల్ ప్రాజెక్టు సీడీపీవో ఝాన్సీరాణికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. జాతీయ బాల కార్మిక నిర్మూలన సంస్థ (ఎన్ఎల్పీ) ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్‌రావు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే సస్పెండ్ అయ్యారు. ఈ పోస్టులో మరో అధికారిని నియమించలేదు. నెలాఖరున జేపీ, కలెక్టరేట్ ఏవోల పదవీ విరమణ.. ఓ వైపు జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా మారి ఇన్చార్జీల పాలన కొనసాగుతుంటే, ఈ నెలాఖరున మరో రెండు కీలక పోస్టులు ఖాళీ కాబోతున్నాయి. జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. కలెక్టరేట్ పరిపాలన విభాగం (ఏవో) అధికారిగా పని చేస్తున్న గంగాధర్ కూడా ఇదే నెలలో రిటైర్డ్ కానున్నారు. ఇన్చార్జి ఏవోగా సీనియర్ తహసీల్దార్‌కు బాధ్యతలు అప్పగించడానికి కలెక్టరేట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జేసీ సహా కీలక పోస్టులన్నీ ఖాళీ కావడంతో పరిపాలనకు మరింత ఇబ్బందులు వచ్చి పడే అవకాశాలున్నాయి. డివిజన్, మండల స్థాయి పోస్టులూ అంతే.. ఇక, డివిజన్, మండల స్థాయి పోస్టులు కూడా చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. డివిజన్ స్థాయిలో నిజామాబాద్ ఆర్డీవో పోస్టు ఒకటి కాగా, ఎస్సీ సంక్షేమ శాఖలో బోధన్, ఆర్మూర్ సహాయ సంక్షేమాధికారుల పోస్టులకు రెగ్యులర్ అధికారులు లేరు. దీంతో హాస్టళ్లను పర్యవేక్షించే వారే కరువయ్యారు. అలాగే కొన్ని మండలాల్లో రెగ్యులర్ తహసీల్దార్లు లేరు. ఇందల్వాయి, రుద్రూర్, ఏర్గట్ల, ముప్కాల్, నిజామాబాద్ రూరల్ మండలాల్లో ఇన్‌చార్జిలతోనే కథ నడిపిస్తున్నారు. మోర్తాడ్, బాల్కొండ, రెంజల్, భీమ్‌గల్ మండలాలకు ఎంపీడీవోలు లేరు. అక్కడ ఈవోపీఆర్డీలే ఇన్చార్జి ఎంపీడీవోలుగా వ్యవహరిస్తున్నారు. -
‘కొత్త’ లెసైన్స్ కార్డులొచ్చాయ్..!
ఖిలావరంగల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదు జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో వాహన రిజిస్టేషన్, డ్రైవింగ్ లెసైన్స్ సాఫ్ట్వేర్ సమస్యలను అధిగమించి ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చారుు. పెండింగ్ కార్డులతో వాహనదారుల ఇబ్బందులపై ఈనెల 1వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘కార్డులు ఇంకెన్నడు..!’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. వాహనదారుల ఇబ్బందులను గుర్తించిన ఐదు జిల్లాల పర్యవేక్షణాధికారి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కొత్త జిల్లాల లోగోతో కూడిన కార్డులను గురువారం పూర్తిస్థారుులో విడుదల చేశారు. జిల్లాకు సుమారు ఐదువేల కార్డుల చొప్పున అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న కార్డులను వేగంగా ఆయా జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో ముద్రణ పూర్తి చేసి స్పీడ్పోస్ట్కు అందజేశారు. ప్రతి వినియోగదారుడు మరో రెండు రోజుల్లో రిజస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్సకార్డులను అందుకోనున్నారు. -
పాఠ్య పుస్తకాల్లో మార్పులు
కొత్త జిల్లాల నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) కసరత్తు చేస్తోంది. ప్రాథమిక మార్పులపై చర్చించిన ఉన్నతాధికారులు.. లోతైన అధ్యయనానికి త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సాంఘిక శాస్త్రం, పర్యావరణ అధ్యయన పుస్తకాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. సాంఘిక శాస్త్రా ల్లో వివిధ జిల్లాల భౌగోళిక నైసర్గిక స్వరూపాలకు సంబంధించిన చిత్రపటాలను మార్పునకు చర్య లు చేపడుతోంది. తెలుగు పాఠ్యపుస్తకాల్లో మార్పులపై పరిశీలన జరపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది పాఠ్య పుస్తకాల ముద్రణకు ముందే మార్పులను ఖరారు చేయాలని నిర్ణయించింది. లింగ భేదం, వివక్ష వంటి అంశాలపైనా పాఠ్యాంశాలు పెట్టాలని ఎస్సీఈఆర్టీ నిర్ణయిం చింది. 6 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల్లో ఈ పాఠాలు అందుబాటులోకి తేనుంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్: ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, మానవహక్కులు వంటి అంశాలను పాఠ్యాం శాలుగా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పాఠాలు పాఠశాల నుంచి ఉన్నత విద్య కోర్సుల వరకు ఉండాల్సిందేనని రిజర్వు బ్యాంకు ఇటీవల ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, అకౌంట్స్ తదితర అంశాలపై పాఠ్యాంశాలు రూపొందించేందుకు ప్రభుత్వ ఆమోదం తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధం అవుతోంది. -
శంషాబాద్.. పవర్ఫుల్!
- పునర్విభజనలో శక్తివంతమైన జిల్లాగా ఏర్పాటు - ఔటర్ రింగు రోడ్ ఆలంబనగా అభివృద్ధి - పారిశ్రామిక, ఐటీ,ఎయిరోస్పేస్ రంగాలకు కేంద్రం - విద్య, పర్యాటక, క్రీడా సౌకర్యాలకు నిలయం సాక్షి, హైదరాబాద్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఆవిర్భవిస్తున్న శంషాబాద్.. రాష్ట్రంలోనే సంపన్నమైన జిల్లాగా రూపొందనుంది. ఇన్నాళ్లూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసరాల్లో నూతన అభివృద్ధి కేంద్రాల్లో ఒకటిగా ఉన్న శంషాబాద్.. ఇకపై ఆర్థికంగా కీలకంగా మారబోతోంది. ముసాయిదాలో పేర్కొన్న ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ డివిజన్లతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా శంషాబాద్ జిల్లాలో అంతర్భాగంగా మారుతున్నాయి. ఈ ప్రాంతాలన్నీ రియల్ఎస్టేట్, ఐటీ, ఫార్మా, పారిశ్రామిక, విద్య, పర్యాటక రంగాల్లో ఇప్పటికే ప్రాధాన్యత పొంది ఉండడం గమనార్హం. ముచ్చర్ల ఫార్మాసిటీ, ఎయిరోస్పేస్ పార్కు, ఫ్యాబ్‌సిటీ, ఐటీ పార్కులు, ప్రముఖ విద్యా సంస్థలు వంటివి ఈ జిల్లాలోకే వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముకలాంటి రంగాలన్నీ ఈ జిల్లా పరిధిలో ఉండటం దీని ప్రత్యేకత. వాస్తవానికి అంతర్జాతీయ విమానాశ్రయంతో తెరపైకి వచ్చిన శంషాబాద్‌కు ఔటర్ రింగు రోడ్డు, బెంగళూరు, విజయవాడ, శ్రీశైలం రహదారులు ఆలంబనగా ఉన్నాయి. విజయవాడ జాతీయ రహదారి 65 నుంచి బెంగళూరు జాతీయ రహదారి 44 మీదుగా నూతన జిల్లా విస్తరించి ఉండటం ప్రధాన అనుకూలాంశం. పర్యాటక ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలు నూతన జిల్లా పరిధిలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రంగా.. కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కందుకూరు మండలంలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫార్మా రంగానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఎకరాల విస్తీర్ణంలో ముచ్చర్ల ఫార్మాసిటీని ప్రతిపాదించింది. ప్రస్తుతం భూసేకరణ జరుగుతుండగా.. ఫార్మాసిటీని శ్రీశైలం ప్రధాన రహదారితో అనుసంధానం చేయనున్నారు. ఇక మహేశ్వరం మండలంలోని ఫ్యాబ్‌సిటీ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీలకు కేంద్రంగా ఉండగా.. సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో ఎయిరోస్పేస్ కంపెనీలు హెలికాప్టర్లు మొదలుకుని ఉపగ్రహాలకు అవసరమయ్యే పరికరాల దాకా తయారు చేస్తున్నాయి. ఈ సెజ్‌లో భూకేటాయింపులు పూర్తికావడంతో వెలిమినేడులో రెండో దశ ఎయిరోస్పేస్ పార్కు విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్ విస్తరణ ప్రణాళికలు చేపట్టగా.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎన్జీ) రీజినల్ సెంటర్, రాష్ట్ర యాంటీ టైస్టు వింగ్ ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇక ఈ జిల్లా పరిధిలో ఉండనున్న కొత్తూరు, షాద్‌నగర్‌లు ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయి. ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ అమేజాన్, జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గాంబుల్ వంటి ప్రముఖ కంపెనీలు కొత్తూరు మండలంలో ఏర్పాటయ్యాయి. విద్య, పర్యాటక కేంద్రంగానూ... నూతనంగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లా విద్య, పర్యాటక, క్రీడా రంగంలోనూ ప్రముఖ పాత్ర పోషించనుంది. గచ్చిబౌలి క్రీడా మైదానం, హైదరాబాద్ యూనివర్సిటీ (శేరిలింగంపల్లి), సింబయాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (కొత్తూరు)తో పాటు పలు ఇంజనీరింగ్ కాలేజీలు... ఆసియాలోనే రెండో అతిపెద్ద ఉస్మానియా అబ్జర్వేటరీ (రంగాపూర్, మంచాల మండలం), పర్యాటక ప్రాధాన్యత కలిగిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు ఈ జిల్లాలోకి రానున్నాయి. జీయర్ ట్రస్టు ఆధ్వర్యంలో శంషాబాద్ పరిసరాల్లో 45 ఎకరాల విస్తీర్ణంలో 216 అడుగుల ఎత్తున్న రామానుజాచార్య విగ్రహం ఏర్పాటవుతోంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకమైన లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ (కొందుర్గు).. కొత్త జిల్లా సాగు, తాగునీటికి కీలకంగా మారనుంది. వంద అంతస్తుల రిలయన్స్ టవర్స్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గృహ నిర్మాణ ప్రాజెక్టులు శంషాబాద్ పరిధిలోనే ఉండటం గమనార్హం.