గీసుకొండలో కలెక్టరేట్‌ ? | Collectorate in gisukonda? | Sakshi
Sakshi News home page

గీసుకొండలో కలెక్టరేట్‌ ?

Published Wed, Mar 1 2017 1:41 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

Collectorate in gisukonda?

ప్రాథమికంగా  నిర్ధారించిన అధికారులు
ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పనుల్లో వేగం
స్థల సేకరణ బాధ్యత రెండు మండలాల తహసీల్దార్లకు అప్పగింత
మండలాల్లోనూ ల్యాండ్‌బ్యాంకు కోసం రెవెన్యూ శాఖ కసరత్తు


హన్మకొండ : తెలంగాణలో జిల్లాల పునర్విభజన తరువాత పాలనా కేంద్రాలైన కలెక్టరేట్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులు తాజాగా రూ.1,032 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారుచేశారు. ఈమేరకు వరంగల్‌ రూరల్‌ జిల్లాకు కలెక్టరేట్‌ ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అధికారులు దానిని వేగవంతం చేశారు. జిల్లాలోని 15 మండలాల ప్రజలు వచ్చి, వెళ్లేందుకు గీసుకొండ మండలం అనువుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించడంతో పాటు స్థల సేకరణపై దృష్టి సారించారు.

‘డబుల్‌’ కసరత్తు
రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిస్థితి విభిన్నంగా ఉంది. జిల్లా కార్యాలయాలన్నీ ప్రస్తుతం వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని హన్మకొండలో కొనసాగుతున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా కేంద్రం సాంకేతికంగా జిల్లా రెవెన్యూ పరిధిలో లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతో ఈ జిల్లాకు సంబంధించి అధికారులు మరింత కసరత్తు చేయాల్సి వస్తోంది. ఇక్కడ కలెక్టరేట్‌ భవనాల సముదాయానికి రంగం సిద్ధం చేయాలంటే అసలు జిల్లా కేంద్రం ఎక్కడ అనే విషయాన్ని నిర్ణయించాల్సి ఉంది. దీంతో జిల్లా యంత్రాంగానికి డబుల్‌ కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా వరంగల్‌ నగరం చుట్టూ విస్తరించి ఉండడంతో జిల్లా పరిధిలో ఉన్న 15మండలాలకు అనువుగా ఉండేలా జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. నగరాన్ని అనుకుని ఉన్న గీసుకొండ మండలం అనువుగా ఉండడంతో ఈ మండల పరిధిలోని పలుచోట్ల అనువైన స్థలం కోసం రెవెన్యూ యంత్రాంగం అన్వేషిస్తోంది. గీసుకొండ మండలంలోని కోనాయమాకుల, గొర్రెకుంట, ధర్మారం, సంగెం మండలంలోని శాయంపేట గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే స్థలాల అన్వేషణ, సేకరణ బాధ్యతలను గీసుకొండ, సంగెం తహసిల్దార్లకు అప్పగించారు. కాగా, ప్రభుత్వం కలెక్టరేట్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించిన నేపథ్యంలో స్థల గుర్తింపు పనులు వేగిరం కానున్నాయి.

తొలుత మూడు అంతస్తులు..
కలెక్టరేట్ల భవనాలను తొలిదశలో మూడు అంతస్తుల్లో నిర్మించేలా ఉన్నతాధికారులు అంచనాలు రూపొందించారు. అయితే, భవిష్యత్‌లో అవసరాన్ని బట్టి మరో రెండు అంతస్తులు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్‌ చివరిలోగా కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని ప్రారంభించి ఏడాదిన్నరలో మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ నేపథ్యంలో వరంగల్‌ రూరల్‌ జిల్లాలో అధికారులు స్థల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement