
పత్తి సాగుకు స్వస్తి చెప్పి ఆరేళ్ల క్రితం నుంచి సిరిధాన్యాలు సాగు చేస్తున్న కౌలు రైతు
32 ఎకరాల్లో 5 రకాల సిరిధాన్యాలతో పాటు అంతర పంటగా కంది సాగు
సొంతంగానే ప్రాసెసింగ్.. ప్రజలకు నేరుగా సిరిధాన్యాల బియ్యం అమ్మకం..
కలెక్టరేట్‌లో సిరిధాన్యాల ఫుడ్ కోర్ట్ నిర్వహణ
క్వింటా సిరిధాన్యాల ధర రూ.4 వేలకు తగ్గితే రైతుకు గిట్టుబాటు కాదంటున్న అభ్యుదయ రైతు వేణుబాబు
ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి సాగులో, అందునా విత్తనోత్పత్తిలో నైపుణ్యం సాధించిన సీనియర్ రైతు కందిమళ్ల వేణుబాబు(52) ఆరేళ్ల క్రితం తన దృష్టిని సిరిధాన్యాల వైపు మళ్లించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వేణుబాబు మూడు దశాబ్దాల క్రితం కర్నూలు జిల్లాకు వలస వచ్చి స్థానికంగా దేవాలయ భూములను కౌలుకు తీసుకొని విత్తనోత్పత్తి లక్ష్యంగా పత్తి సాగు చేస్తుండేవారు.
మరో 8 మంది రైతులతో కలసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘాన్నిప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన తల్లికి కేన్సర్ వ్యాధి సోకటంతో ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాల గురించి ఆలోచించారు. కర్నూలులో డాక్టర్ ఖాదర్‌వలి సభకు హాజరై సిరిధాన్యాల ఆహారంలో ఔషధ గుణాల గురించి తెలుసుకున్నారు. అప్పటికే పత్తి విత్తన రంగంలో ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా పత్తి సాగుకు స్వస్తి చెప్పి సిరిధాన్యాల సాగు వైపు పూర్తిగా దృష్టి మళ్లించారు.
32 ఎకరాల్లో సిరిధాన్యాల సాగు
2019లో తొలిసారి ఏడు ఎకరాల్లో కొర్రలు, అండుకొర్రల సాగుకు శ్రీకారం చుట్టారు. క్రమంగా సాగు విస్తీర్ణాన్ని పెంచారు. కల్లూరు మండలం పందిపాడు గ్రామంలోఒకే చోట 25 ఎకరాల దేవాలయ భూములను కౌలుకు తీసుకొని వర్షాధారంగా ఖరీఫ్‌లో సిరిధాన్యాలతో పాటు అంతర పంటగా కంది సాగు చేస్తున్నారు. నీటి సదుపాయం గల మరో 7 ఎకరాల్లో ఖరీఫ్‌లో అండుకొర్ర పండిస్తున్నారు. రెండో పంటగా కంది, దోస సాగు చేస్తున్నారు.
నల్లరేగడి నేలలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేస్తారు. వేస్ట్ డీ కంపోజర్‌ను 4 సార్లు, పుల్ల మజ్జిగను రెండు సార్లు ట్రాక్టర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేయిస్తారు. 8 క్వింటాళ్ల కొర్రలతో పాటు ఎకరానికి 5 క్వింటాళ్ల కంది దిగుబడి పొందుతున్నారు. కందులతో పాటు ఎకరానికి అరికలైతే 7 క్వింటాళ్లు, సామలు 3 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తోందని వేణుబాబు తెలిపారు. మిషన్‌తో పంట కోయిస్తే ఎకరానికి రూ. 10 వేలు, కూలీలతో కోయిస్తే రూ. 15 వేల వరకు సాగు ఖర్చవుతుందని ఆయన తెలిపారు.
సొంతప్రాసెసింగ్ సొంతప్రాసెసింగ్ యూనిట్‌యూనిట్
సిరిధాన్యాలను పండించి టోకుగా అమ్మటం కన్నా బియ్యంగా మార్చి రిటైల్‌గా అమ్మటం ద్వారా అధికాదాయం వస్తుందని తొలిదశలోనే గుర్తించిన వేణుబాబు రూ. 15 లక్షలతో సొంతప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాను పండించిన సిరిధాన్యాలతో పాటు ఇతర రైతులు పండించినవి కూడా కొని, మరపట్టించి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
పురుగుల బెడద లేకుండా వ్యాక్యూమ్ ΄్యాకింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. సుమారు 3 వేల మందికి నేరుగా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అమ్ముతున్నారు. సాగు చేసి అమ్మటమే కాదు కుటుంబ సభ్యులంతా చిరుధాన్యాల ఆహారమే తీసుకుంటుండటం విశేషం. ఈ ఆహారంతో తాను బరువు తగ్గి చాలా ఆరోగ్యంగా ఉన్నానని వేణుబాబు సంతోషిస్తున్నారు. వినియోగ దారుల ఆదరాభి మానాలు పొందాలంటే రాళ్లు, ఇసుక రాకుండా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అందించటం చాలా ముఖ్యమన్నారు.
కలెక్టరేట్‌లో మిల్లెట్ కేఫ్
చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సృజన కలెక్టరేట్ ఆవరణలో మిల్లెట్ కేఫ్‌ప్రారంభానికి వేణుబాబుకు అవకాశం ఇచ్చారు. సిరిధాన్యాల భోజనంతో పాటు జావ, లడ్డూలు, మురుకులు, బ్రెడ్ తదితర ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తమ వద్ద రోజువారీగా సిరిధాన్యాల ఆహారం తినే వారిలో 60% మంది యువతేనని ఆయన చెబుతున్నారు.
క్వింటా రూ.4 వేలకు ప్రభుత్వం కొనాలి
సిరిధాన్యాలకు గత ఏడాది మంచి ధర రావటంతో సాగు ఈ ఏడాది 50% పెరిగింది. గత సంవత్సరం కొర్ర ధాన్యం క్వింటా రూ. 5–6 వేలు పలికితే, ఈ ఏడాది 2,500కి పడిపోయింది. అండుకొర్రలు గత ఏడాది క్వింటా రూ. 8 వేలు పలికితే ఈ ఏడాది రూ.3,500కి పడిపోయింది. ఏ రకం సిరిధాన్యమైనా క్వింటా రూ. 4 వేలైతేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. సిరిధాన్యాల సాగు విస్తీర్ణం స్థిరంగా పెరగాలంటే ప్రభుత్వం రూ. 4 వేల చొప్పున కొనాలిæలేదా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. దీంతో పాటు.. మినీ హార్వెస్టర్లను రైతులకు సబ్సిడీపై అందించాలి. వీటితో రైతులే స్వయంగా పంట కోసుకోవచ్చు. మహిళలు కూడా వీటిని ఉపయోగించగలుగుతారు. సిరిధాన్యాల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. మా దగ్గర ఇద్దరు ఆయుర్వేద వైద్యులు రోగులకు విధిగా సిరిధాన్యాల ఆహారాన్నే సూచిస్తున్నారు. వారి కోసం అర కేజీ ΄్యాకెట్ల కిట్లను అందిస్తున్నాం. సిరిధాన్యాల సాగుకు పెట్టుబడి తక్కువ.. నికరాదాయం ఎక్కువ. పూర్తి సంతృప్తి ఉంది. మా ఇంట్లోనూ సిరిధాన్యాలనే తింటూ ఆరోగ్యంగా ఉన్నాం.
– కందిమళ్ల వేణుబాబు (94408 61443), చిరుధాన్యాల రైతు, కర్నూలు
– గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment