Gisukonda
-
కుటుంబానికి ఒకే చోటు
ఈ ఊరిలో కుటుంబానికి ఒక సమాధి మాత్రమే ఉంటుంది. ఆయా కుటుంబాల్లో ఎవరైనా కన్నుమూస్తే సమాధి సిద్ధంగా ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామంలో నిర్మల హృదయవనం ఏర్పాటు చేసుకున్నారు. అర ఎకరం స్థలంలో గత 30 సంవత్సరాలక్రితం హృదయవనం నిర్మించుకున్నారు. తమ కుటుంబంలో ఎవరైనా చనిపోతే అందులోనే వారిని సమాధి చేస్తారు... కొత్తగా సమాధి కట్టరు. అదేంటో చూద్దాం... గీసుకొండ మండలంలోని మరియాపురం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో 100 కుటుంబాల వారు నివసిస్తున్నారు. వారిలో ఉన్న క్రైస్తవ కుటుంబాలు తమ వారెవ్వరైనా చనిపోతే హృదయవనంలో నిర్మించుకున్న సమాధిలో ఖననం చేసేలా అంతస్తుల మాదిరిగా సమాధులను నిర్మించుకున్నారు. ఇంతకీ ఎందుకిలా అంటే... సమాధుల కోసం స్థలాన్ని వృథా చేయడం ఇష్టం లేక అట.15 అడుగుల లోతులో దీర్ఘచతురస్రాకారంలో సమాధిని నిర్మిస్తారు. కిందిభాగంలో గచ్చు చేసి భూమి ఉపరితలంపై 2 లేదా 3 అంగుళాలు ఎత్తు వరకు గోడను కడతారు. సమాధి పైన బరువైన ఇనుప రేకును మూతలాంటిది ఏర్పాటు చేస్తారు. ఇది తలుపులా ఉండి అవసరమైనప్పుడు తెరిచే వీలుంటుంది. ఇలా చేస్తారు కుటుంబాల్లో మొదటగా చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కిందిభాగంలో ఖననం చేసి, దానిపై ఉప్పు, సుగంధద్రవ్యాలు చల్లుతారు. పైన నాలుగు షాబాదు బండలు అమర్చి మూసి వేస్తారు. ఆ తర్వాత మూతను బిగిస్తారు. అదే కుటుంబంలో మరో వ్యక్తి చనిపోయినప్పుడు అదే పద్ధతిలో ఖననం చేస్తారు. ఒకవేళ కుటుంబంలో ఎక్కువమంది చనిపోతే సమాధిలో ఖాళీ లేనప్పుడు అంతకుముందు సమాధి చేసిన వారి కపాలం, ఎముకలను అందులోనుంచి తీసేసి లోపలి గోడల పక్కనున్న స్థలంలో వాటిలో భద్రపరుస్తారు. అనంతరం అప్పుడే చనిపోయిన వారి మృతదేహాన్ని అందులో ఖననం చేస్తారు. ప్రపంచవ్యాప్త పండుగ రోజు నవంబర్ 2న క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఆత్మల పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా తమ పూర్వీకుల సమాధులను శుభ్రం చేయడం వాటి రంగులు వేయడం, పూలతో అలంకరించడం చేస్తారు. సమాధుల వద్దకు వెళ్లి తమ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థిస్తారు. చిన్న తప్పులు చేసిన వారు స్వర్గానికి, నరకానికి మధ్యలో ఉండిపోతారని, అటువంటి వారి ఆత్మలు దైవసన్నిధికి చేరడానికి సంవత్సరంలో వారు మృతి చెందిన దినోత్సవం జరుపుకోవడాన్ని సమాధుల పండుగ అని అంటారు. ఈ సందర్భంగా సమాధుల వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, దానధర్మాలు చేస్తారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి వరంగల్ రూరల్ ఫోటోలు: పెద్దపల్లి వరప్రసాద్ ►మా గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఒక సమాధి ఉంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా అందులోనే ఖననం చేస్తాం. చనిపోయిన తరువాత అందరం ఒకేదగ్గర ఉంటామని, సమాధులు నిర్మించేందుకు స్థలం ఇబ్బంది లేకుండా ఉండేందుకు. గత కొన్నిసంవత్సరాలుగా ఇదేవిధంగా పాటిస్తున్నాం. ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పద్ధతిలో పలు గ్రామాల్లో చేస్తున్నారని తెలుస్తుంది. – అల్లం బాలిరెడ్డి, సర్పంచ్, మరియపురం -
గీసుకొండలో కలెక్టరేట్ ?
ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పనుల్లో వేగం స్థల సేకరణ బాధ్యత రెండు మండలాల తహసీల్దార్లకు అప్పగింత మండలాల్లోనూ ల్యాండ్‌బ్యాంకు కోసం రెవెన్యూ శాఖ కసరత్తు హన్మకొండ : తెలంగాణలో జిల్లాల పునర్విభజన తరువాత పాలనా కేంద్రాలైన కలెక్టరేట్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులు తాజాగా రూ.1,032 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారుచేశారు. ఈమేరకు వరంగల్ రూరల్ జిల్లాకు కలెక్టరేట్ ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అధికారులు దానిని వేగవంతం చేశారు. జిల్లాలోని 15 మండలాల ప్రజలు వచ్చి, వెళ్లేందుకు గీసుకొండ మండలం అనువుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించడంతో పాటు స్థల సేకరణపై దృష్టి సారించారు. ‘డబుల్’ కసరత్తు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే వరంగల్ రూరల్ జిల్లా పరిస్థితి విభిన్నంగా ఉంది. జిల్లా కార్యాలయాలన్నీ ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని హన్మకొండలో కొనసాగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం సాంకేతికంగా జిల్లా రెవెన్యూ పరిధిలో లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతో ఈ జిల్లాకు సంబంధించి అధికారులు మరింత కసరత్తు చేయాల్సి వస్తోంది. ఇక్కడ కలెక్టరేట్ భవనాల సముదాయానికి రంగం సిద్ధం చేయాలంటే అసలు జిల్లా కేంద్రం ఎక్కడ అనే విషయాన్ని నిర్ణయించాల్సి ఉంది. దీంతో జిల్లా యంత్రాంగానికి డబుల్ కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్ రూరల్ జిల్లా వరంగల్ నగరం చుట్టూ విస్తరించి ఉండడంతో జిల్లా పరిధిలో ఉన్న 15మండలాలకు అనువుగా ఉండేలా జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. నగరాన్ని అనుకుని ఉన్న గీసుకొండ మండలం అనువుగా ఉండడంతో ఈ మండల పరిధిలోని పలుచోట్ల అనువైన స్థలం కోసం రెవెన్యూ యంత్రాంగం అన్వేషిస్తోంది. గీసుకొండ మండలంలోని కోనాయమాకుల, గొర్రెకుంట, ధర్మారం, సంగెం మండలంలోని శాయంపేట గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే స్థలాల అన్వేషణ, సేకరణ బాధ్యతలను గీసుకొండ, సంగెం తహసిల్దార్లకు అప్పగించారు. కాగా, ప్రభుత్వం కలెక్టరేట్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించిన నేపథ్యంలో స్థల గుర్తింపు పనులు వేగిరం కానున్నాయి. తొలుత మూడు అంతస్తులు.. కలెక్టరేట్ల భవనాలను తొలిదశలో మూడు అంతస్తుల్లో నిర్మించేలా ఉన్నతాధికారులు అంచనాలు రూపొందించారు. అయితే, భవిష్యత్‌లో అవసరాన్ని బట్టి మరో రెండు అంతస్తులు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ చివరిలోగా కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ప్రారంభించి ఏడాదిన్నరలో మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లాలో అధికారులు స్థల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. -
గీసుకొండ జాతర ప్రారంభం
నేడు రేపు ప్రత్యేక పూజలు బౌద్ధం వర్ధిల్లినట్లుగా చారిత్రక ఆధారాలు గీసుకొండ(పరకాల): మండల కేంద్రమైన గీసుకొండ గ్రామ శివారులోని గుట్టపై స్వయంభువగా వెలసిన లక్ష్మినర్సింహస్వామి జాతర శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 10న స్వామి వారిని గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆల యం నుంచి గుట్టపైకి తీసుకు వచ్చారు. గురువారం రాత్రి నుంచి జాత ర ప్రారంభమైందని, శుక్ర, శనివారాల్లో కొనసాగుతుందని నిర్వహణ కమిటీ బాధ్యులు తెలిపారు. శనివారం సాయంత్రం స్వామివారిని గ్రామానికి తోడ్కొని వెళ్లనున్నారు. స్వామివారి గుట్టకు చారిత్రక ప్రాధాన్యం.. స్వామివారు వెలసిన నల్లని కొండను గీసుకొండ గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట నలుపు రంగులో ఉండటంతో ‘గీసు అనగా నలుపు అని, నల్లని కొండ శివారులో వెలసిన గ్రా మం కావడంతో గీసుకొండ అని పేరు వచ్చిందని చెబుతా రు. అలాగే ఆదిమానవులు శిలాయుగంలో గుట్ట ప్రాంత ంలో జీవించేవారిని, వారి తర్వాత శాతవాహనుల వరకు నాగరికత వెలసినట్లు, బౌద్ధం ఇక్కడ వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయల్ప డ్డాయి. గుట్ట వద్ద పురావస్తుశాఖ వారు చేపట్టిన తవ్వకాల్లో బయల్పడ్డ టెర్రాకోట బొమ్మలు, బుద్దుడి ప్రతిమ, రాతి ఆయుధాలను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వెనకవైపు ఉన్న పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరిచారు. ఆది మానువులు తమ రాతి ఆయుధాలను పదును చేయడానికి గుట్టపై నూరా(గీశా) రని, అందుకే ఈ కొండకు ‘గీసుడుకొండ’అని పేరు వచ్చిందని ఆ పేరుతోనే గ్రామానికి గీసుకొండ అని పేరు పెట్టి ఉంటారనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులేవీ కేటాయించకపోవడం, ప్రచారం కొరవడటంతో ప్రాశస్త్యం మరుగున పడుతోంది. -
కొంగొత్త ఆవిష్కరణలు
‘స్టార్టప్ ఇండియా’ దిశగా విద్యార్థుల సమాయత్తం పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఫిబ్రవరి 28 వరకు నామినేషన్ల స్వీకరణ గీసుకొండ ప్రధాని నరేంద్రమోదీ కలల ప్రాజెక్టు ’స్థార్టప్ ఇండియా’ దిశగా సమాయత్తం చేసేందుకు.. పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాలు, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనల వైపు విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ‘ఇన్స్పైర్ అవార్డ్స్–మనాక్’ పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇప్పటి వరకు ‘ఇన్స్పైర్’ పేరిట కొనసాగుతున్న కార్యక్రమంలో కొన్ని మార్పులు చేసి దీనిని రూపొందించింది. రూ.5వేల చొప్పున.. దేశవ్యాప్తంగా ఐదు లక్షల పాఠశాలల్లో ‘ఇన్స్పైర్ అవార్డ్స్–మనాక్’ కార్యక్రమాన్ని చేపడుతుండగా తద్వారా పది లక్షల ఆవిష్కరణలు చేయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలా ఎంపికైన లక్ష ప్రాజెక్టుల నుంచి కొన్నింటిని ఎంపిక చేసి వాటిని రూపొందించిన విద్యార్థులకు రూ.5 వేల చొప్పున ఖర్చుల కింద ఇస్తారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి 10 నుంచి 15 ఏళ్ల వయస్సు.. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల విద్యార్థులు అర్హులు. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆసక్తి గల విద్యార్థుల తమ పేర్లు, ప్రాజెక్టు వివరాలను ’డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్–జీఎస్టీ.జీఓవీ.ఇన్’ ద్వారా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.. ఇప్పటి వరకు వన్‌టైం(ఓటీఆర్) రిజిస్ట్రేషన్ కాని యుపీఎస్, హైస్కూళ్ల హెచ్ఎంలు వెంటనే చేయించుకుని జిల్లా అధికారులకు సమాచారం చేరవేయాలని వరంగల్ రూరల్ జిల్లా విద్యాశాధికారి నారాయణరెడ్డి సూచించారు. ఓటీఆర్ చేసిన 48 గంటల లోపు రిజిస్టర్ చేసిన ఈ మెయిల్ ఐడీకి యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుందని, వీటి ద్వారా వెబ్సైట్లోకి లాగిన్ అయి విద్యార్థుల నామినేషన్లు అప్లోడ్ చేయాలని తెలిపారు. ’ఇన్స్పైర్ అవార్డ్స్–మనాక్’కు సంబంధించి సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారి కె.శ్రీనివాస్(98488 78455), సైన్స్ టీచర్ పి.ఆనంద్(99480 99462)ను సంప్రదించాలని సూచించారు. -
వికటించిన ఐరన్ మాత్రలు
280 మంది విద్యార్థులకు అస్వస్థత వరంగల్ జిల్లా గీసుకొండలో ఘటన హన్మకొండ: ఐరన్ టాబ్లెట్లు వేసుకునే ముందు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో వరంగల్ జిల్లాలో 280 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య సిబ్బంది అదే మండలం ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం స్వైన్‌ఫ్లూపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ ట్యాబ్లెట్లు ఇచ్చి, వేసుకోవాల్సిందిగా సూచించారు. సదస్సు అనంతరం విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వెళ్లి సదరు మాత్రలు వేసుకున్నారు. తిరిగి తరగతులు ప్రారంభమయ్యే సమయంలో కొందరు విద్యార్థులు కళ్లు తిరగడం, కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాల కనిపించడంతో ఉపాధ్యాయులను సంప్రదించారు. వీరిని స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే ఇవే లక్షణాలతో మరికొంతమంది విద్యార్థుల ఇబ్బందిపడ్డారు. స్థానికులు 108 వాహనాలు, ప్రైవేటు స్కూలు బస్సులో 300 మంది విద్యార్థులను హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రి వైద్యులు వీరికి వెంటనే వైద్య సహాయం అందించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో రాత్రి 9 గంటల సమయంలో చాలా మందిని డిశ్చార్జ్ చేశారు. మరో 67 మంది విద్యార్థులు ఇంకా చికిత్స పొందుతున్నారు. అవగాహన లేకుండా: సాధారణంగా ఐరన్ ట్యాబెట్లు రాత్రి సమయాల్లో వేసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తారు. పగటి సమయంలో వేసుకోవాల్సి వస్తే ఆహారం తీసుకున్న తర్వాతే ఈ ట్యాబెట్లు వేసుకోవాలని సూచిస్తారు. ఈ జాగ్రత్తలు పాటించకుండా ఐరన్ ట్యాబెట్లలో మింగితే దీనితో ఉండే ఫై సల్ఫేట్ మూలకం కారణంగా వాంతులు, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పాఠశాలకు వచ్చిన వైద్యసిబ్బంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారు. సీఎం కేసీఆర్ ఆరా... విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్ దగ్గరుండి వైద్యులను విద్యార్థుల వద్దకు తీసుకెళ్లారు.