వికటించిన ఐరన్ మాత్రలు
280 మంది విద్యార్థులకు అస్వస్థత
వరంగల్ జిల్లా గీసుకొండలో ఘటన
హన్మకొండ: ఐరన్ టాబ్లెట్లు వేసుకునే ముందు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో వరంగల్ జిల్లాలో 280 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య సిబ్బంది అదే మండలం ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం స్వైన్‌ఫ్లూపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ ట్యాబ్లెట్లు ఇచ్చి, వేసుకోవాల్సిందిగా సూచించారు. సదస్సు అనంతరం విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వెళ్లి సదరు మాత్రలు వేసుకున్నారు. తిరిగి తరగతులు ప్రారంభమయ్యే సమయంలో కొందరు విద్యార్థులు కళ్లు తిరగడం, కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాల కనిపించడంతో ఉపాధ్యాయులను సంప్రదించారు. వీరిని స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే ఇవే లక్షణాలతో మరికొంతమంది విద్యార్థుల ఇబ్బందిపడ్డారు. స్థానికులు 108 వాహనాలు, ప్రైవేటు స్కూలు బస్సులో 300 మంది విద్యార్థులను హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రి వైద్యులు వీరికి వెంటనే వైద్య సహాయం అందించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో రాత్రి 9 గంటల సమయంలో చాలా మందిని డిశ్చార్జ్ చేశారు. మరో 67 మంది విద్యార్థులు ఇంకా చికిత్స పొందుతున్నారు.
అవగాహన లేకుండా: సాధారణంగా ఐరన్ ట్యాబెట్లు రాత్రి సమయాల్లో వేసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తారు. పగటి సమయంలో వేసుకోవాల్సి వస్తే ఆహారం తీసుకున్న తర్వాతే ఈ ట్యాబెట్లు వేసుకోవాలని సూచిస్తారు. ఈ జాగ్రత్తలు పాటించకుండా ఐరన్ ట్యాబెట్లలో మింగితే దీనితో ఉండే ఫై సల్ఫేట్ మూలకం కారణంగా వాంతులు, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పాఠశాలకు వచ్చిన వైద్యసిబ్బంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారు.
సీఎం కేసీఆర్ ఆరా...
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్ దగ్గరుండి వైద్యులను విద్యార్థుల వద్దకు తీసుకెళ్లారు.