సాక్షి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లా శంభునిపేటలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. పాఠశాలలో గత సోమవారం ఆరోగ్య శిబిరం నిర్వహించిన వైద్యఆరోగ్యశాఖ విద్యార్థులకు ఐరన్ మాత్రలు పంపిణీచేశారు. వాటిని మధ్యాహ్నం, రాత్రి అన్నం తిన్న తర్వాత తీసుకోవాలని సూచించారు.
అయితే గురువారం ఉదయం టిఫిన్ చేశాక కొందరు విద్యార్థులు ఐరన్ మాత్రలు వేసుకున్నారు. అవి వికటించి వాంతులు కావడంతో అప్రమత్తమైన సిబ్బంది బాధిత విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఐరన్ మాత్రలు వికటించడంవల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గురువారం ఉదయం అల్పాహారంలో వడ చేశారని. వడ తిన్నందువల్లే తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల తల్లిదంత్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే సమీప ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తమ పిల్లల ఆరోగ్య గురించి వాకబుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment