
నేను డెలివరీ అయి వారం రోజులు అవుతుంది. కాన్పులో రక్తస్రావం ఎక్కువ అయింది అని ఐరన్ టాబ్లెట్స్ రోజుకి రెండు వేసుకోమన్నారు. అవి నాకు పడటం లేదు. ఏదైనా వేరే మార్గం ఉంటే చెప్పండి?
– లలిత, గుంటూరు.
ఐవీ ఐరన్ ఇన్‌ఫ్యూజన్ థెరపీ అనేది మీకు ఉత్తమ మార్గం. ఐరన్ మాత్రలు పడనివారికి, ఐరన్ మాత్రలతో వాంతులు, వాంతి వచ్చినట్టు ఉబ్బరం ఉన్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఐవీ లైన్ పెట్టి గ్లూకోజ్‌లో వేసి ఇన్‌ఫ్యూజ్ చేస్తారు. ఇది డే కేర్ పద్ధతిలో ఇస్తారు. మీ హీమోగ్లోబిన్ లెవెల్, మీ బరువును బట్టి ఎంత మోతాదు, ఎన్ని సార్లు ఇవ్వాలి అనేది డాక్టర్ పరిశీలించి ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ప్రెగ్నెన్సీ లేదా కాన్పు జరిగిన తరువాత కూడా రక్తహీనతను నయం చేయడానికి ఇస్తాం. బ్రెస్ట్ ఫీడింగ్‌లో కూడా సేఫ్‌గా తీసుకోవచ్చు.
ఈ ఇంజెక్షన్ తీసుకునే రోజు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోకూడదు. రెండు నుంచి నాలుగు డోసులు దాకా ఇస్తాం. రెండు నుంచి మూడు రోజుల గ్యాప్‌లో తీసుకోవాలి. కొంతమందికి ఇంజెక్షన్‌లోని రసాయనాలకు రియాక్షన్స్ రావచ్చు. దద్దుర్లు, ఆయాసం, దురదలు ఉంటాయి. అందుకే, టెస్ట్ డోస్ ఇచ్చి మీకు ఓకే అయితేనే ఫుల్ డోస్ ఇస్తాం. అన్నీ డోసులు పూర్తి అయిన నాలుగు వారాల తరువాత హీమోగ్లోబిన్ ఎంత పెరిగిందో చెక్ చేస్తాం. ఈ ఇంజెక్షన్స్ ఏ సమయంలో అయినా, ఆసుపత్రిలో డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి.
కొంతమందికి ఇంకేదైనా కారణంతో రక్తహీనత ఉంటే, అది హీమోగ్లోబినోపతీ క్యారియర్– సికిల్ సెల్, థలసీమియా ఉన్నా ఈ ఇంజెక్షన్స్ తీసుకోకూడదు. ఐరన్ ఓవర్‌లోడ్ శరీరానికి ప్రమాదకరం అవుతుంది. చిన్న అసౌకర్యం, ఉబ్బసం, ఆయాసం మొదట కాస్త ఉన్నా వెంటనే తగ్గిపోతాయి. అందుకే, రక్తం తక్కువ ఉండి, సరిగ్గా ఆహారం తీసుకోలేని వారు, మాత్రలు పడనివారు, రక్తమార్తిడి వద్దనుకునేవారు, ఈ ఐవీ ఐరన్ థెరపీని తీసుకోవటం మంచిది. అవి నాకు పడటం లేదు.
డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment