ఈ ఊరిలో కుటుంబానికి ఒక సమాధి మాత్రమే ఉంటుంది. ఆయా కుటుంబాల్లో ఎవరైనా కన్నుమూస్తే సమాధి సిద్ధంగా ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామంలో నిర్మల హృదయవనం ఏర్పాటు చేసుకున్నారు. అర ఎకరం స్థలంలో గత 30 సంవత్సరాలక్రితం హృదయవనం నిర్మించుకున్నారు. తమ కుటుంబంలో ఎవరైనా చనిపోతే అందులోనే వారిని సమాధి చేస్తారు... కొత్తగా సమాధి కట్టరు. అదేంటో చూద్దాం... గీసుకొండ మండలంలోని మరియాపురం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
ఈ గ్రామంలో 100 కుటుంబాల వారు నివసిస్తున్నారు. వారిలో ఉన్న క్రైస్తవ కుటుంబాలు తమ వారెవ్వరైనా చనిపోతే హృదయవనంలో నిర్మించుకున్న సమాధిలో ఖననం చేసేలా అంతస్తుల మాదిరిగా సమాధులను నిర్మించుకున్నారు. ఇంతకీ ఎందుకిలా అంటే... సమాధుల కోసం స్థలాన్ని వృథా చేయడం ఇష్టం లేక అట.15 అడుగుల లోతులో దీర్ఘచతురస్రాకారంలో సమాధిని నిర్మిస్తారు. కిందిభాగంలో గచ్చు చేసి భూమి ఉపరితలంపై 2 లేదా 3 అంగుళాలు ఎత్తు వరకు గోడను కడతారు. సమాధి పైన బరువైన ఇనుప రేకును మూతలాంటిది ఏర్పాటు చేస్తారు. ఇది తలుపులా ఉండి అవసరమైనప్పుడు తెరిచే వీలుంటుంది.
ఇలా చేస్తారు
కుటుంబాల్లో మొదటగా చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కిందిభాగంలో ఖననం చేసి, దానిపై ఉప్పు, సుగంధద్రవ్యాలు చల్లుతారు. పైన నాలుగు షాబాదు బండలు అమర్చి మూసి వేస్తారు. ఆ తర్వాత మూతను బిగిస్తారు. అదే కుటుంబంలో మరో వ్యక్తి చనిపోయినప్పుడు అదే పద్ధతిలో ఖననం చేస్తారు. ఒకవేళ కుటుంబంలో ఎక్కువమంది చనిపోతే సమాధిలో ఖాళీ లేనప్పుడు అంతకుముందు సమాధి చేసిన వారి కపాలం, ఎముకలను అందులోనుంచి తీసేసి లోపలి గోడల పక్కనున్న స్థలంలో వాటిలో భద్రపరుస్తారు. అనంతరం అప్పుడే చనిపోయిన వారి మృతదేహాన్ని అందులో ఖననం చేస్తారు.
ప్రపంచవ్యాప్త పండుగ రోజు
నవంబర్ 2న క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఆత్మల పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా తమ పూర్వీకుల సమాధులను శుభ్రం చేయడం వాటి రంగులు వేయడం, పూలతో అలంకరించడం చేస్తారు. సమాధుల వద్దకు వెళ్లి తమ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థిస్తారు. చిన్న తప్పులు చేసిన వారు స్వర్గానికి, నరకానికి మధ్యలో ఉండిపోతారని, అటువంటి వారి ఆత్మలు దైవసన్నిధికి చేరడానికి సంవత్సరంలో వారు మృతి చెందిన దినోత్సవం జరుపుకోవడాన్ని సమాధుల పండుగ అని అంటారు. ఈ సందర్భంగా సమాధుల వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, దానధర్మాలు చేస్తారు.
– గజవెల్లి షణ్ముఖరాజు,
సాక్షి వరంగల్ రూరల్ ఫోటోలు: పెద్దపల్లి వరప్రసాద్
►మా గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఒక సమాధి ఉంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా అందులోనే ఖననం చేస్తాం. చనిపోయిన తరువాత అందరం ఒకేదగ్గర ఉంటామని, సమాధులు నిర్మించేందుకు స్థలం ఇబ్బంది లేకుండా ఉండేందుకు. గత కొన్నిసంవత్సరాలుగా ఇదేవిధంగా పాటిస్తున్నాం. ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పద్ధతిలో పలు గ్రామాల్లో చేస్తున్నారని తెలుస్తుంది.
– అల్లం బాలిరెడ్డి,
సర్పంచ్, మరియపురం
Comments
Please login to add a commentAdd a comment