కడప కల్చరల్: మన దేశాన్ని పాలించేందుకు వచ్చిన బ్రిటీషు వారు ఈ ప్రాంతాలపై ఎనలేని మక్కువ పెంచుకున్నారు. పరిపాలనలో తమదైన ముద్ర వేయడమే కాకుండా వారి నివాస గృహాలు, ఇతర నిర్మాణాల్లో కూడా వారి శైలిని కనబరిచారు. వారు నిర్మించిన ప్రార్థన మందిరాలు, కార్యాలయాలు, ఇతర భవనాలు నేటికీ పటిష్టంగా ఉండి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి చారిత్రక నిర్మాణాలలో కడప నగరంలోని క్రై స్తవుల సమాధుల తోట (దొరల గోరీలు) ఒకటి. క్రిస్మస్ పండుగ రానున్న సందర్భంగా ఆ వివరాలు..
కడప నగరం మాసాపేట చివరన నిర్మల కాన్వెంట్ వద్ద క్రైస్తవుల సమాధులు ఉన్నాయి. దొరల గోరీలుగా పేరున్న ఇందులో 25కు పైగా బ్రిటీషు పాలనలో మరణించిన తెల్లదొరల సమాధులు ఉన్నాయి. దివంగతులైన తమ బంధుమిత్రుల సమాధుల వద్దకు తరచూ వెళ్లే సంప్రదాయం ఉండడంతో నాటి తెల్లదొరల బంధుమిత్రులు ఈ సమాధుల ప్రాంతాన్ని ఉద్యాన వనంగా తీర్చిదిద్దారు. పూలమొక్కలతోపాటు చెట్ల పెంపకం చేపట్టారు. ప్రత్యేకంగా తోట మాలీలను నియమించి ఆ ప్రాంతాన్ని పచ్చదనంతో, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు.
విశిష్టంగా..
దొరల గోరీలలో మన ప్రాంతంలో కనిపించే సమా«ధులకు భిన్నమైన సమాధుల నిర్మాణాలు కనిపిస్తాయి. ఒక్కో సమాధి చారిత్రక నిర్మాణ శైలితో భారీగా పలు ఆకర్శణీయమైన రూపాలలో కనిపిస్తుంది. నాటి నిర్మాణశైలికి ప్రతీకలుగా ఆ సమాధులు నేటికీ మనం చూడవచ్చు. ఇప్పుడు కూడా కడప నగరంలో క్రైస్తవ ప్రముఖులు ఎవరైనా మరణిస్తే సమాధుల తోటలోనే ఖననం చేస్తారు.
ప్రముఖుల సమాధులు: క్రైస్తవుల సమాధుల తోటలో పలువురు బ్రిటీషు అధికారుల సమాధులున్నాయి. వాటి వివరాలను కడప గెజిటీర్‌లో ప్రచురించారు. అప్పట్లో జరిగిన ఓ ఘర్షణను నివారించేందుకు వెళ్లిన ఆంగ్ల యువ అధికారి మెక్‌డొనాల్డ్ మరణించాడు. భర్త మరణ వార్త విన్న ఆయన భార్య వెంటనే స్పృహ కోల్పోయి కొద్దిరోజుల్లోనే మరణించింది. మెక్‌డొనాల్డ్‌తోపాటు ఆయన భార్య సమాధిని కూడా పక్కపక్కనే నిర్మించి ఆ రెంటిని కలిపి ఒకే సమాధిగా తీర్చిదిద్దారు. ఈ విశిష్టమైన ప్రేమ చిహ్నాన్ని నేటికీ మనం క్రైస్తవుల సమాధుల తోటలో చూడవచ్చు.
- క్రెస్తవుల సమా«ధుల తోటను 1800వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
- రాజంపేట సమీపంలోని గుండ్లూరు వద్ద 1807లో మరణించిన నాటి సివిల్ సర్వీసెస్ అధికారి వెబ్ థాకరె సమాధి కూడా ఈ ప్రాంగణంలో ఉంది. థాకరె ప్రసిద్ధ ఆంగ్ల రచయిత విలియం మెక్ పీస్‌కు మేనల్లుడు.
- అప్పట్లో జిల్లా పబ్లిక్ వర్క్స్‌శాఖలో అసిస్టెంట్ ఇంజినీరుగా పనిచేసిన చార్లెస్ (కాటన్ దొరకు మేనల్లుడు) సమాధి కూడా ఈ ప్రాంగణంలో ఉంది.
- ప్రతి సంవత్సరం పెద్దల సమాధుల దినోత్సవం (డూమ్స్ డే) నాడు నగరానికి చెందిన క్రైస్తవులు తమ బంధువుల సమాధులపై కొవ్వొత్తులు వెలిగించి వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేస్తారు.
- ఇక్కడి బ్రిటీషు దొరల సమాధులు 200 సంవత్సరాల క్రితం నాటివి. వంద సంవత్సరాలు దాటిన నిర్మాణాలను వారసత్వ సంపదగా పరిగణిస్తారు.సమాధుల తోటను కూడా వారసత్వ ప్రాంతంగా ప్రకటించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలని నగరానికి చెందిన క్రైస్తవ ప్రముఖులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment