పల్నాడు.. పౌరుషగడ్డ. పల్నాడు అంటే.. రాజ్యాల మధ్య కాలుదువ్విన కోడిపుంజులు కనిపిస్తాయి. వెయ్యేళ్ల కిందట అధికారం, ఆధిపత్యం కోసం సాగిన యుద్ధభేరీ వినిపిస్తుంది. వీరులకు గుడికట్టిన సంప్రదాయం కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు చరిత్ర. కానీ.. కృష్ణానది ఒడ్డున పల్నాట క్రీస్తుపూర్వం 3 వేల ఏళ్లనాడే గొప్ప మానవ నాగరికత విలసిల్లింది. కిలోమీటర్ల మేర బృహత్ శిలాయుగపు (మెగాలిథిక్) సమాధుల రూపంలో నిక్షిప్తమైంది. మాచర్ల, వెల్దుర్ది మండలాల్లో పురావస్తు అధికారులు, పరిశోధకుల వెలికితీతతో ఆదిమ మానవ జీవనం ప్రపంచానికి పరిచయం అవుతోంది.
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండా అటవీ ప్రాంతంలో కృష్ణాతీరం వెంబడి ఆదిమ మానవ సంస్కృతి విస్తరించింది. ఇక్కడ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర 300 నుంచి 400 వరకు సమాధులు బయటపడ్డాయి. ఇంత పెద్ద ఎత్తున వరుసక్రమంలో ప్రాచీన కాలపు సమాధులు దేశంలో ఎక్కడా లేవు. ఇక్కడ అత్యధిక సంఖ్యలో గృహ సమాధి (డాల్మెన్), గూడు సమా«ధులు (సిస్ట్ బరియల్) ఉన్నాయి. ఈ సమాధుల నిర్మాణంలో వాస్తుశా్రస్తాన్ని పాటించడం విశేషం. అన్నింటిని దక్షిణం వైపు ద్వారం ఉండేలా నిరి్మంచారు. ప్రతి సమాధి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కృష్ణానది పరీవాహక ప్రాంతంలోనే ఉన్నాయి.
దీంతో అప్పటి ప్రజలు కృష్ణానది ఎగువభాగంలో నివసించినట్టు తెలుస్తోంది. వ్యవసాయంతోపాటు పశువులపై ఆధారపడి జీవనం సాగించారని, ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, కందులు పండించారని లభ్యమైన ఆధారాలను బట్టి తెలుస్తోంది. పూసలు, ప్రత్యేకమైన ఎరుపు, నలుపు రంగు మట్టిపాత్రల అవశేషాలను బట్టి అప్పటి ప్రజలు అలంకార ప్రియులుగా భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మొదటగా బృహత్ శిలాయుగంలో ఇనుమును వినియోగించినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతంలో ముడి ఇనుము అధికంగా లభ్యమవడంతో ప్రజలు ఇక్కడ నివసించేవారని తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర, గోదావరి, పెన్నానది తీరాల్లో వీటి ఆనవాళ్లు తరచు బయటపడుతున్నాయి.
ప్రత్యేక నిర్మాణ శైలిలో సమాధులు
ప్రాచీన శిలాయుగంలో మానవుడు మృతదేహాలను ప్రకృతికే వదిలేశాడు. నవీన శిలాయుగానికి వచ్చేసరికి మృతదేహాన్ని క్రమపద్ధతిలో పాతిపెట్టడం నేర్చుకున్నాడు. బృహత్ శిలాయుగంలో మానవ మృతదేహాన్ని జంతువులు పీక్కుతినకుండా, ఖనన సామగ్రిని పాడుచేయకుండా పెద్దపెద్ద శిలలతో సమాధులు నిరి్మంచారు. వీటిలో మృతుడు ఉపయోగించిన యుద్ధ, వ్యవసాయ సామగ్రి, మట్టిపాత్రలు, పెంపుడు జంతువులను కూడా సమాధి చేసేవారు. ఈ సమాధుల చుట్టూ పెద్ద బండరాళ్లను పేర్చేవారు. ఇవే రాక్షసగూళ్లు. వీటి ఆనవాళ్లు ప్రపంచం అంతటా ఉన్నాయి.
ముఖ్యంగా ఐరోపా, ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోను బృహత్ శిలాయుగపు సమాధులు బయటపడ్డాయి. చదునైన బండరాళ్లతో నలువైపులా స్వస్తిక్ ఆకారంలో పేర్చి గది మాదిరి తయారు చేశారు. ఇందులో భూమి లోపల కొంత, భూ ఉపరితలంపై కొంతభాగం కనబడే విధంగా నిర్మించారు. ఈ సమాధులు పెద్ద బండరాళ్లతో ఉండటం, అక్కడ లభించిన మట్టిపాత్రలు, అస్థి పంజరాలను బట్టి ఇవి సామాన్య మానవులకు ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతో.. వీటిని రాక్షసుల స్థావరంగా నమ్మి రాక్షసగూళ్లుగా పిలిచేవారు. ఇలాంటి రాక్షసగూళ్లు అచ్చమ్మకుంటలో భారీగా ఉన్నాయి. వీటిలో కొన్ని అప్పటికప్పుడు నిర్మించినవైతే.. మరికొన్ని ముందే నిర్మించుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో కొన్ని సామూహిక సమాధులున్నాయి. వీటిలో రెండురకాలున్నాయి. మృతదేహాన్ని ఖననం చేసినవి ప్ర«థమశ్రేణి సమాధులుగా, మృతదేహాన్ని దహనం చేయగా మిగిలిన అవశేషాలను పూడ్చిపెట్టినవి ద్వితీయశ్రేణి సమాధులుగా వర్గీకరించారు.
ముగ్గుదిన్నె కాలువకు ఇరువైపులా..
వెల్దుర్తి మండలం గంగలకుంటలోని కృష్ణానది కుడిగట్టుపైన.. ముగ్గుదిన్నె కాలువకు ఇరువైపులా దాదాపు మూడుచదరపు కిలోమీటర్లమేర వెయ్యికిపైగా ఇనుపయుగపు స్మారక కట్టడాలున్నాయి. ఇక్కడ 5–10 మీటర్ల వ్యాసార్థంతో, 1–2 మీటర్ల ఎత్తులో స్థానిక నాపరాళ్లను గుండ్రంగా పేర్చి, గులకరాళ్లతో ఉబ్బెత్తుగా అమర్చిన సమాధులు కనిపిస్తాయి. ఈ సమాధులకు ఉత్తరాన 10–25 అడుగుల ఎత్తు, 3–5 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంతో చనిపోయినవారికి గుర్తుగా రాళ్లను నిలువుగా ఏర్పాటు చేశారు. వాటిపై ఇనుపయుగపు అంత్యక్రియ పద్ధతులను తెలిపే ఎద్దు, చదరం, గండ్రం, ముగ్గును పోలిన రేఖాచిత్రాలున్నాయి.
‘గంగలకుంటలో గతంలో వందలాది నిలువురాళ్లు, రాకాసిగుళ్లు ఉండేవి. ఇప్పుడు పదో, పదిహేనో మిగిలాయని స్థానికులు ద్వారా తెలుసుకున్నాం. రైతులు నీళ్లగొట్టాలు వేసినప్పుడు, మైనింగ్ కారణంగా దాదాపు 500 సమాధులు, 700 నిలువురాళ్లు ధ్వంసమయ్యాయి. ఇక్కడ లభ్యమైన 25 అడుగుల నిలువురాయి (మెన్‌హిర్) రాష్ట్రంలోనే అతి పెద్దది. ఇంతటి మానవచరిత్రను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..’ అని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటికీ చెక్కు చెదరలేదు
నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇంతటి గొప్ప నాగరికత విలసిల్లిందంటే సంతోషంగా ఉంది. నా పరిశోధనలో బృహత్ శిలాయుగపు సమాధులు కనుగొన్నప్పుడు వాటిని చూసి ఆశ్చర్యపోయాను. సమాధులు 10–15 కిలోమీటర్ల మేర విస్తరించినట్టు అంచనా వేస్తున్నాం. స్థానికులు వీటిని బండరాళ్లుగా భావించి కొన్ని చెదరగొట్టారు. మిగిలిన సమాధులు చెక్కు చెదరలేదు. ఈ సమాధులకు పక్కనే ఎండిపోయిన నదీపాయ ఉండటంతో అప్పటి ప్రజలు దిగువన సువిశాల ప్రాతంలో వ్యవసాయం చేసుకుని జీవించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఆ ప్రాంతం సాగులో ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిగితే ఆ నాటి ప్రజల సాంస్కృతిక, సామాజిక జీవనం, వర్తకవాణిజ్య వివరాలు వెలుగులోకొస్తాయి.
– ఎం.స్వామినాయక్, ఏపీ పురావస్తు, ప్రదర్శనశాలల అసిస్టెంట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment