శంషాబాద్.. పవర్‌ఫుల్! | Shamshabad .. Powerful! | Sakshi
Sakshi News home page

శంషాబాద్.. పవర్‌ఫుల్!

Published Tue, Aug 23 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

శంషాబాద్.. పవర్‌ఫుల్!

శంషాబాద్.. పవర్‌ఫుల్!

- పునర్విభజనలో శక్తివంతమైన జిల్లాగా ఏర్పాటు
- ఔటర్ రింగు రోడ్ ఆలంబనగా అభివృద్ధి
- పారిశ్రామిక, ఐటీ,ఎయిరోస్పేస్ రంగాలకు కేంద్రం
- విద్య, పర్యాటక, క్రీడా సౌకర్యాలకు నిలయం
 
 సాక్షి, హైదరాబాద్ :
జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఆవిర్భవిస్తున్న శంషాబాద్.. రాష్ట్రంలోనే సంపన్నమైన జిల్లాగా రూపొందనుంది. ఇన్నాళ్లూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసరాల్లో నూతన అభివృద్ధి కేంద్రాల్లో ఒకటిగా ఉన్న శంషాబాద్.. ఇకపై ఆర్థికంగా కీలకంగా మారబోతోంది. ముసాయిదాలో పేర్కొన్న ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ డివిజన్‌లతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా శంషాబాద్ జిల్లాలో అంతర్భాగంగా మారుతున్నాయి. ఈ ప్రాంతాలన్నీ రియల్‌ఎస్టేట్, ఐటీ, ఫార్మా, పారిశ్రామిక, విద్య, పర్యాటక రంగాల్లో ఇప్పటికే ప్రాధాన్యత పొంది ఉండడం గమనార్హం. ముచ్చర్ల ఫార్మాసిటీ, ఎయిరోస్పేస్ పార్కు, ఫ్యాబ్‌సిటీ, ఐటీ పార్కులు, ప్రముఖ విద్యా సంస్థలు వంటివి ఈ జిల్లాలోకే వస్తున్నాయి.

రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముకలాంటి రంగాలన్నీ ఈ జిల్లా పరిధిలో ఉండటం దీని ప్రత్యేకత. వాస్తవానికి అంతర్జాతీయ విమానాశ్రయంతో తెరపైకి వచ్చిన శంషాబాద్‌కు ఔటర్ రింగు రోడ్డు, బెంగళూరు, విజయవాడ, శ్రీశైలం రహదారులు ఆలంబనగా ఉన్నాయి. విజయవాడ జాతీయ రహదారి 65 నుంచి బెంగళూరు జాతీయ రహదారి 44 మీదుగా నూతన జిల్లా విస్తరించి ఉండటం ప్రధాన అనుకూలాంశం.  పర్యాటక ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలు నూతన జిల్లా పరిధిలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రంగా..
 కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కందుకూరు మండలంలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫార్మా రంగానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఎకరాల విస్తీర్ణంలో ముచ్చర్ల ఫార్మాసిటీని ప్రతిపాదించింది. ప్రస్తుతం భూసేకరణ జరుగుతుండగా.. ఫార్మాసిటీని శ్రీశైలం ప్రధాన రహదారితో అనుసంధానం చేయనున్నారు. ఇక మహేశ్వరం మండలంలోని ఫ్యాబ్‌సిటీ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీలకు కేంద్రంగా ఉండగా.. సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి.

ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో ఎయిరోస్పేస్ కంపెనీలు హెలికాప్టర్లు మొదలుకుని ఉపగ్రహాలకు అవసరమయ్యే పరికరాల దాకా తయారు చేస్తున్నాయి. ఈ సెజ్‌లో భూకేటాయింపులు పూర్తికావడంతో వెలిమినేడులో రెండో దశ ఎయిరోస్పేస్ పార్కు విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్ విస్తరణ ప్రణాళికలు చేపట్టగా.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎన్‌జీ) రీజినల్ సెంటర్, రాష్ట్ర యాంటీ టైస్టు వింగ్ ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్‌లు ఏర్పాటయ్యాయి. ఇక ఈ జిల్లా పరిధిలో ఉండనున్న కొత్తూరు, షాద్‌నగర్‌లు ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయి. ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ అమేజాన్, జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గాంబుల్ వంటి ప్రముఖ కంపెనీలు కొత్తూరు మండలంలో ఏర్పాటయ్యాయి.
 
 విద్య, పర్యాటక కేంద్రంగానూ...
 నూతనంగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లా విద్య, పర్యాటక, క్రీడా రంగంలోనూ ప్రముఖ పాత్ర పోషించనుంది. గచ్చిబౌలి క్రీడా మైదానం, హైదరాబాద్ యూనివర్సిటీ (శేరిలింగంపల్లి), సింబయాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (కొత్తూరు)తో పాటు పలు ఇంజనీరింగ్ కాలేజీలు... ఆసియాలోనే రెండో అతిపెద్ద ఉస్మానియా అబ్జర్వేటరీ (రంగాపూర్, మంచాల మండలం), పర్యాటక ప్రాధాన్యత కలిగిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు ఈ జిల్లాలోకి రానున్నాయి. జీయర్ ట్రస్టు ఆధ్వర్యంలో శంషాబాద్ పరిసరాల్లో 45 ఎకరాల విస్తీర్ణంలో 216 అడుగుల ఎత్తున్న రామానుజాచార్య విగ్రహం ఏర్పాటవుతోంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకమైన లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ (కొందుర్గు).. కొత్త జిల్లా సాగు, తాగునీటికి కీలకంగా మారనుంది. వంద అంతస్తుల రిలయన్స్ టవర్స్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గృహ నిర్మాణ ప్రాజెక్టులు శంషాబాద్ పరిధిలోనే ఉండటం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement