యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
Published Tue, Aug 9 2016 12:15 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(పొగతోట) : కార్మిక శాఖ చట్టాలను ఉల్లంఘించిన యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రెప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకుడు జె.జనార్దన్ డిమాండ్‌చేశారు. రెప్రజెంటేటివ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెప్‌లకు కనీస వేతనాలు కూడా ఇవ్వడంలేదని దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి గుర్తింపుకార్డులు మంజూరు చేయాలన్నారు. మహిళా రెప్స్‌కు ఆరు నెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. టార్గెట్ల పేరుతో పనిభారాన్ని పెంచుతున్నారని, దీంతో రెప్‌లపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందన్నారు. ఒత్తిడి తగ్గించాలని, వేజ్ బోర్డును వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వీరికి ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, సీఐటీయూ నాయకులు కత్తి శ్రీనివాసులు, మోహన్‌రావులు మద్దతు తెలిపారు.
Advertisement