అంపశయ్యపై నేత బతుకులు | Since the leader of Results | Sakshi
Sakshi News home page

అంపశయ్యపై నేత బతుకులు

Published Mon, May 12 2014 3:13 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Since the leader of Results

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/వెంకటగిరి టౌన్, న్యూస్‌లైన్: వెంకటగిరి చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో అమర్చగల 8 గజాల చీరను  తయారు చేశారనేది చరిత్రపుటల్లో ఓ అద్బుత సంఘటన.  వెంకటగిరి, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, పాటూరు, డక్కిలి, బాలాయపల్లి, చెన్నూరు ప్రాంతాలతో పాటు జిల్లాలోని 133 గ్రామాల్లో  సుమారు 1500 కుటుంబాలు నేత వృత్తిని నమ్ముకుని బతుకుతున్నాయి. వీరి ద్వారా పరోక్షంగా మరో 1500 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ లెక్కన ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 15 వేల మంది చేనేత వృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు.
 
 ఇలాంటి వారిలో కేవలం 1200 మందికి మాత్రమే బ్యాంకు రుణాలు అందాయి. వీరిలో 600 మందికి రుణమాఫీ ఖరారు అయింది. వ్యక్తిగత రుణమాఫీకింద రూ.1,89,97,926 , సహకార సంఘ రుణ మాఫీ కింద రూ.1,61,67400 రుణమాఫీ అందింది.  జిల్లాలో 55 చేనేత సహకార సంఘాలు ఉండగా అందులో 29 సహకార సంఘాలకే ఈ రుణమాఫీ వర్తించింది. బతకడమే కష్టం కావడంతో జిల్లాలోని 10 చేనేత సహకార సంఘాలు మూతపడ్డాయి. ఈ సంఘాల ద్వారా సుమారు  రూ.2 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదన పుణ్యమా అని 2011-2012లో రూ.312 కోట్లను చేనేత బడ్జెట్‌గా నిర్ధారించారు.
 
 ఆయన  మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.286 కోట్లు మాత్రమే విడుదల చేసింది. చేనేత కార్మికులకు మెటీరియల్ కొనుగోలుపై నేషనల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సహకార సంఘాలకు 10 శాతం, వ్యక్తిగతంగా కార్మికులకు 30 శాతం సబ్సిడీ రుణాలను అందించాల్సి ఉంది. ఇందుకోసం గుర్తింపు కార్డును కూడా చేనేత కార్మికులు పొందాల్సి ఉంది. పట్టు పరిశ్రమద్వారా మెటీరియల్ కొనుగోలుపై ఒక్కో చేనేత కార్మికుడికి వ్యక్తిగతంగా రూ.600ను ఆదాయం కల్పించాలనే ఓ రాయితీ ఉంది. అయితే ఈ పథకాలు ఏవీ చేనేత కార్మికుల దరిచేరడంలేదు.
 
  ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు ప్రభుత్వం రూ.2లక్షల మేర వైద్యసేవలను సమకూరుస్తోంది. చేనేత కార్మికుడి కుటుంబ సభ్యులందరికీ కేవలం రూ.15 వేలు మాత్రమే వైద్యసేవలు అందిస్తోంది. కార్మికులకు ఇచ్చిన హెల్త్ కార్డులో  కేవలం కళ్లవ్యాధులకే ప్రాధాన్యం ఇచ్చారు. మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ మినహా ప్రస్తుత హెల్త్‌కార్డులు ఏవీ చేనేత కార్మికులకు ఆరోగ్యరక్షణ కల్పించలేకపోతున్నాయి.
 
 బాబు హయాంలో ఆత్మహత్యలు
 చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో చేనేత కార్మికులు దుర్భర బతుకులు గడిపారు. కరెంటు కోతలు, మద్దతు ధర లేకపోవడం, బ్యాంకు రుణాలు అందకపోవడంతో కుటుంబ పోషణే బరువై అనేక మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పలువరు ఈ వృత్తిని వదిలేసి ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లారు. చేనేత కార్మికుల పింఛన్ల గురించి కూడా చంద్రబాబు మానవతా హృదయంతో ఆలోచించలేక పోయారు.
 
 పట్టించుకోని కిరణ్
 చేనేత కార్మికులను ఆదుకోవడానికి మహానేత వైఎస్సార్ సబ్సిడీలు, రుణాలు పెద్ద ఎత్తున ఇచ్చి ఆదుకుంటే కిరణ్ కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక వాటిని సక్రమంగా అమలు పరచలేదు. బ్యాంకు రుణాలు అందక చేనేత కార్మికులు అవస్థలు పడ్డారు.
 
 మనసున్న మారాజు
 వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక కష్టాల్లో ఉన్న చేనేత కార్మికులను మనసుతో ఆలోచించి ఆదుకున్నారు. పట్టు, ఇతర ముడి సరుకుల కొనుగోలు మీద సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారు. బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు అందించే ఏర్పాటు చేశారు. ఆయన మరణం తర్వాత ముడిసరుకు సక్రమంగా అందడం లేదు.
 
 ఈయన పేరు యాళ్ల కాంతారావు. నివాసం వెంకటగిరిలోని బంగారుపేట. వృత్తి చేనేత. పెట్టుబడులు పెట్టుకోలేక మాస్టర్‌వీవర్ల సాయం కోరలేక ఆయన నేరుగా బ్యాంకర్లను ఆశ్రయించారు. బంగారుపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ శాఖ నుంచి 2011 ఫిబ్రవరి 26వ తేదీన రూ.90 వేలు  రుణంగా పొందారు. కొన్ని వాయిదాలను బ్యాంక్‌కు చెల్లిస్తూ వచ్చారు. ఇంతలో అప్పటి ప్రభుత్వం  చేనేత రుణమాఫీ పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో రుణమాఫీ కోసం ఆశపడ్డారు. కారణం ్ఛఏదోగానీ ఆయన ఆశలు అడియాసలయ్యాయి. చేనేతకు జీవం పోసింది వైఎస్సార్ అని, నేటి ప్రభుత్వం ఆ రుణమాఫీ పథకాన్ని తుంగలో తొక్కిందంటూ ఆయన ఆవేదన వెలిబుచ్చారు.
 
 కొడవలి మునస్వామి (47) చిన్ననాటి నుంచి చేనేత వృత్తే జీవనం. తాతముత్తాతల కాలం నుంచి వంశపారంపర్యంగా అందిపుచ్చుకున్న వృత్తి. వెంకటగిరిలోని రాణిపేటలో అద్దెఇంట్లో నివాసం. కొడుకు, కూతురుతోపాటు భార్య సైతం చేయూతగా వున్నారు. ఐటీఐ వరకూ చదువుకున్న కుమారుడు, చాలీచాలని జీతంతో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్న 19 ఏళ్ల కుమార్తె వివాహం చేయాలనేది మునస్వామి ప్రణాళిక. ఏడు రోజులు మగ్గం పనులు చేస్తే ఓ సాపు తయారవుతుంది. ప్రతిఫలం రూ.2000. నెలసరి ఆదా యం రూ.8000. కుటుంబాన్ని నెట్టుకురావడం గగనమనేది ఆయన వేదన. బ్యాంక్‌లు లోను ఇచ్చిన దాఖలాలు లేవు. దుర్భర జీవితం  గడుపుతున్నామంటున్నారు.
 
 తంబర గంగాధరం (42) 13 ఏళ్ల నుంచి చేనేత మగ్గంపైనే జీవనం. మామిడిగుంట నుంచి వలస వచ్చి వెంకటగిరిలో స్థిర నివాసం. ఇద్దరు కొడుకులు. ఒకరు పదో తరగతి, మరొకరు సీఏ చదువుతున్నారు. భార్యాభర్తకు చేనేత పనే ప్రధాన వృత్తి. మూడేళ్లక్రితం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి రూ.50 వేలు సాధారణ రుణం లభించింది. నెలకు రూ.1400  బ్యాంక్‌కు చెల్లించాలి. నెల సరి రాబడి రూ.12 వేలు. బ్యాంకు వాయిదాకు పోగా రూ.10 వేలు. సబ్సిడీ రుణాలు కళ్లచూసే భాగ్యమే లేదు. ఐదు నుంచి 10 మగ్గాలను ఓ చోట చేర్చుకుంటే సబ్సిడీ రుణాలు ఇస్తామంటున్నారు బ్యాంకు వాళ్లు. మా లాంటి వాళ్లకు అది సాధ్యమయ్యే పని కానందున సబ్సిడీలు అందుకోలేక పోతున్నామని వాపోయారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement