ఆస్పత్రి సిబ్బందికి నైపుణ్య కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల్లోని పలు రకాల సేవలకుగాను సిబ్బందికి నైపుణ్య కోర్సులను నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది. వైద్యులుగా, నర్సులుగా, టెక్నీషియన్లుగా పనిచేయాలంటే తప్పనిసరిగా ఆయా కోర్సులు చదవాలి. వైద్య, ఆరోగ్యశాఖలోని సంబంధిత విభాగాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ వీరి కంటే రెట్టింపు స్థాయిలో కింది స్థాయి సిబ్బంది పనిచేస్తుంటారు. ఆపరేషన్ థియేటర్ బాయ్‌లుగా, రోగులను వీల్‌చైర్‌పై తరలించే వర్కర్లుగా, వార్డుల్లో రోగులకు సహాయకులుగా, మరుగుదొడ్లు క్లీనర్లుగా రకరకాల పనిచేసే వారెవరికీ కోర్సులు, శిక్షణ, రిజిస్ట్రేషన్ ఉండటం లేదు. వారి ప్రవర్తన ఒక్కోసారి రోగులకు అశనిపాతంగా మారుతోంది. ఈ పరిస్థితిని సరిదిద్దాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆస్పత్రుల్లోని ఇటువంటి సిబ్బందికి, ఏడో తరగతి పాసైన నిరుద్యోగులక ు6 నెలల ఆస్పత్రి నిర్వహణపై శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. కొన్ని కోర్సులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మరికొన్నింటికి పారామెడికల్ అనుమతితో ప్రైవేటు సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది.
శిక్షణ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికే ఆస్ప త్రుల్లో ఆయా విభాగాల్లో పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారికి కూడా దీనిని తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు వెయ్యి చొప్పున ఉంటాయి. వాటిల్లోని కిందిస్థాయి సిబ్బంది ఎవరూ నిర్ణీత కోర్సుతో శిక్షణ పొంద లేదు. ఆస్పత్రుల్లోని పనులు, అక్కడి వ్యవహారాలపై సిలబస్ తయారు చేసి ఆరు నెలలపాటు శిక్షణ కల్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తే రాష్ట్రం నుంచి లక్ష మందికి దేశ విదేశాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆస్పత్రి రంగంపై శిక్షణ పొందినవారికి దేశ, విదేశాల్లో డిమాండ్ బాగానే ఉంది. కాస్త ఇంగ్గిష్ మాట్లాడగలిగితే దుబాయ్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ ఉపాధి అవకాశాలుంటాయని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం నిర్ణయం తర్వాత పారామెడికల్ విభాగం ద్వారా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.