అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకం | Most Is critical of The role of faculty | Sakshi
Sakshi News home page

అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకం

Published Sun, Nov 16 2014 11:50 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకం - Sakshi

అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకం

మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ఎంప్లాయబిలిటీ, జాబ్ రెడీ స్కిల్స్ అందించడంలో అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకం. ఫ్యాకల్టీ మార్గనిర్దేశానికి తోడు విద్యార్థులు కూడా అంకిత భావంతో శ్రమిస్తే విజయాలు సొంతమవుతాయి. అకడమిక్ కోర్సులనేవి అవకాశాలకు ఒక ప్లాట్‌ఫామ్ లాంటివి. ఆ సర్టిఫికెట్‌తోనే కెరీర్ సొంతమవ్వాలనే భావన వీడాలి అంటున్నారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- తిరుచిరాపల్లి (త్రిచీ) డెరైక్టర్ ప్రొఫెసర్ వై.ప్రఫుల్ల అగ్నిహోత్రి. మేనేజ్‌మెంట్ విభాగంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన   ఆయనకు పరిశ్రమలో, అకడమిక్స్‌లో 26 ఏళ్లకు పైగా అనుభవముంది. 2011 నుంచి ఐఐఎం- త్రిచీ డెరైక్టర్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ అగ్నిహోత్రితో ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
గెస్ట్ కాలమ్
ఇంటరాక్టివ్ మెథడ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి
ప్రస్తుతం మన మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ అధిక శాతం థియరీ బేస్డ్‌గా ఉంది. దీనికి బదులుగా ఇంటరాక్టివ్ మెథడ్స్‌ను అమలు చేయాలి. తద్వారా విద్యార్థులకు పుస్తకాల్లోని సిద్ధాంతాల పరిజ్ఞానంతోపాటు వాటిని ప్రాక్టికల్‌గా అన్వయించే స్కిల్స్ సొంతమవుతాయి. నేటి కార్పొరేట్ ప్రపంచంలో రాణించాలంటే.. విద్యార్థులకు జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే క్లిష్టమైన సంఘటనలకు ఎలాంటి పరిష్కారాలు కనుగొనాలనే విషయంలో అవగాహన అవసరం.
 
విదేశాలకు.. మనకు తేడా ఇదే

మనదేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్స్ సహా పలు బి-స్కూల్స్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తోంది. ఇవి విదేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లకు దీటుగా పోటీపడుతున్నాయి. కానీ వీటి సంఖ్య వేళ్ల మీద లెక్కించదగ్గ స్థాయిలోనే ఉంది. దేశంలో వందల సంఖ్యలో ఉన్న బి-స్కూల్స్ సైతం అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే.. ఇటు అధ్యాపకుల్లో, అటు విద్యార్థుల్లో రీసెర్చ్ ఓరియెంటేషన్ పెరగాలి. విదేశాల్లోని బి-స్కూల్స్‌కు, మన బి-స్కూల్స్‌కు మధ్య ప్రధాన తేడా రీసెర్‌‌చ విషయంలోనే! కాబట్టి మనం కూడా రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు పెద్దపీట వేస్తే మన బిజినెస్ స్కూల్స్ నాణ్యత కూడా మెరుగవుతుంది.
 
ఫ్యాకల్టీ సభ్యుల దృక్పథమూ మారాలి
నేటి మేనేజ్‌మెంట్ విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా రాణించాలంటే తరగతి గది నుంచే మార్పులు తీసుకురావాలి. ఈ క్రమంలో ముందుగా ఫ్యాకల్టీ దృక్పథంలో మార్పు రావాలి. గంట లేదా గంటన్నర సమయంలో ఉండే లెక్చర్‌ను ముగించడంతోనే తమ బాధ్యత పూర్తయిందని అధ్యాపకులు భావించకూడదు. విద్యార్థులకు సిలబస్ అంశాలను బోధించడంతోపాటు వారికి ఆదర్శంగా ఉండాలి. మెంటార్‌గా వ్యవహరించాలి. తరగతిలో విద్యార్థులకు వారి బలాలు- బలహీనతల ఆధారంగా వారు రాణించాల్సిన అంశాలు, పొందాల్సిన నైపుణ్యాలపై అవగాహన కల్పించాలి.
 
ఐఐఎంల విస్తరణ.. పరిగణించాల్సిన అంశాలు
దేశంలో ఐఐఎంలు, ఐఐటీలను విస్తరించాలనే నిర్ణయం మంచిదే. కొత్త క్యాంపస్ ఏర్పాటు- మనుగడ విషయంలో అత్యంత ప్రధానమైన అంశం క్యాంపస్‌ను ఏర్పాటు చేయదలచుకున్న ప్రదేశం లేదా ప్రాంతం. ఆ ప్రాంతంలో లభించే మౌలిక సదుపాయాలు, సామాజిక పరిస్థితులు, ఆ ప్రాంతానికున్న గుర్తింపు వంటి అంశాలను కూడా పరిశీలించాలి. అప్పుడే అత్యున్నత స్థాయి ఇన్‌స్టిట్యూట్ రూపకల్పన సాధ్యమవుతుంది. కొత్త ఫ్యాకల్టీ ఆసక్తి చూపడంలోనూ క్యాంపస్ భౌగోళిక స్వరూపం ఎంతో కీలకం. కేవలం భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎందరో ఫ్యాకల్టీ వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి.
 
బోధన విధానంలోనూ మార్పులు రావాలి

బోధన పరంగానూ ఫ్యాకల్టీ సభ్యులు కొత్త మార్పులు, విధానాలు అమలు చేయాలి. ప్రస్తుత అవసరాలు, వాస్తవ పరిస్థితుల కోణంలో విశ్లేషిస్తే.. బోధనలో ఎంక్వైరీ మెథడాలజీని ప్రవేశ పెట్టాలి. దీనివల్ల విద్యార్థుల్లో గ్రాహణ శక్తి, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగవుతాయి. దాంతోపాటు కేస్ స్టడీస్, సిమ్యులేషన్ గేమ్స్, ప్రాజెక్ట్స్ తదితర బోధన పద్ధతులు పాటిస్తే విద్యార్థులకు నిజమైన పరిజ్ఞానం లభిస్తుంది.
 
ఇండస్ట్రీ- అకడమిక్ కొలాబరేషన్‌కు మార్గాలు

ఇటీవల కాలంలో చాలామంది విద్యావేత్తలు అత్యంత ఆవశ్యకంగా పేర్కొంటున్న అంశం.. ఇండస్ట్రీ- అకడమిక్ కొలాబరేషన్. దీనివల్ల విద్యార్థులకు మరింత నైపుణ్యం లభిస్తుందనే మాట వాస్తవం. అయితే, వీటిపై ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌కు అవగాహన ఉన్నప్ప టికీ.. మరెన్నో విద్యాసంస్థలకు సరైన మార్గం తెలియడం లేదు. పరిశ్రమ నిపుణులను గెస్ట్ ఫ్యాకల్టీగా పిలవడం.. కరిక్యులం రూపకల్పనలో వారిని సంప్రదించడం.. సంయుక్తంగా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం.. తదితర మార్గాల ద్వారా ఇండస్ట్రీ- అకడమిక్ కొలాబరేషన్‌ను బలోపేతం చేసుకోవచ్చు. అదే విధంగా అకడమిక్ కోణంలో ఇతర ఇన్‌స్టిట్యూట్‌లతో ఎక్స్ఛేంజ్ ఒప్పందా లు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులతోపాటు ఫ్యాకల్టీకి కూడా తాజా పరిణామాలపై విస్తృత అవగాహన లభిస్తుంది.
 
ఆలోచనలతోపాటు.. తపన కూడా ఉండాలి
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. ఇటీవల కాలంలో విస్తృత ప్రచారం పొందు తోంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఔత్సాహికులు లక్ష్యం చేరుకునేందుకు అకడమిక్ స్థాయి నుంచే ఎన్నో మార్గాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలదొక్కుకోవాలంటే.. మంచి బిజినెస్ ఐడియాతోపాటు సాధించాలనే తపన, సవాళ్లను స్వీకరించే మానసిక సంసిద్ధత అవసరం.
 
ఇది ఒక ప్లాట్‌ఫామ్ అనే భావించాలి

భవిష్యత్తు అవకాశాల కోణంలో మేనేజ్‌మెంట్ కోర్సులను.. కేవలం ప్లాట్‌ఫామ్‌లుగా, మార్గాలుగానే భావించాలి. కోర్సులో చేరగానే కార్పొరేట్ కొలువు సొంతం అవుతుందనుకోకూడదు. సబ్జెక్ట్ నాలెడ్జ్‌కు కష్టించేతత్వం, అంకితభావం, సానుకూల దృక్పథం వంటివి ఉంటే చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. వృత్తి జీవితంలో వివిధ దశల్లో విజయాలు సాధించేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే క్లాస్ రూం నుంచే వీటిని అందిపుచ్చుకునేలా కృషి చేయా లి. విద్యార్థులకైనా, ఔత్సాహికులకైనా ఇదే నా సలహా!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement