ఇండస్ట్రీ రెడీ... బీ-స్కూల్స్ కరిక్యులమ్ | business schools syllabus curriculum is ready | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీ రెడీ... బీ-స్కూల్స్ కరిక్యులమ్

Published Thu, Aug 21 2014 11:59 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఇండస్ట్రీ రెడీ... బీ-స్కూల్స్ కరిక్యులమ్ - Sakshi

ఇండస్ట్రీ రెడీ... బీ-స్కూల్స్ కరిక్యులమ్

మేనేజ్‌మెంట్... ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఎవర్‌గ్రీన్ కోర్సు. సంప్రదాయ కోర్సుల నుంచి ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థుల వరకూ.. ఎంబీఏలో చేరడమే చాలామంది లక్ష్యం. కార్పొరేట్ కంపెనీలు మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుండడమే ఇందుకు కారణం.

మరోవైపు కంపెనీల అవసరాలకు అనుగుణంగా.. నైపుణ్యాలు అందించే విధంగా ప్రస్తుత బీ-స్కూల్స్ కరిక్యులమ్ ఉందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. పరిశ్రమ ఆశించిన విధంగా కరిక్యులమ్ ఉండకపోవడంతో కోర్సు-జాబ్ మధ్య అంతరం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని  సిలబస్‌ను ప్రస్తుత అవసరాలకనుగుణంగా  రూపొందించే ప్రక్రియకు సిటీలోని ఐఎస్‌బీ, ఐపీఈ, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ, ఐఎంటీ, ఎన్‌ఐఎంఎస్ తదితర బీ-స్కూల్స్ శ్రీకారం చుట్టాయి.
 
దేశంలోని అధిక శాతం బీ-స్కూల్స్ జాబ్ మార్కెట్ డిమాండ్ మేరకు తమ విద్యార్థుల్లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే దిశగా కోర్సుల్లో మార్పులు చేస్తున్నాయి. ఎంప్లాయర్స్‌తోపాటు మారిన పని సంస్కృతికనుగుణంగా (బిజినెస్ ఎన్విరాన్‌మెంట్) సరిగ్గా సరిపోయే కోర్సులను తిరిగి రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. 2015 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన సిలబస్‌ను అమల్లోకి తీసుకురానున్నాయి. ఇందులో ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంభాషణ చాతుర్యం.. గత కార్పొరేట్ వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకోవడం.. చైనా వంటి కీలక మార్కెట్లను అవగాహన చేసుకునే సామర్థ్యం.. స్టార్ట్‌అప్‌లను ప్రారంభించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించడం.. ఆర్థిక రంగంలో కొత్తగా వస్తున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం.. పెట్టుబడి దారుల ఆసక్తిని అధ్యయనం చేయడం.. సంస్థను సమర్థంగా నిర్వహించడం.. రిటెన్ కమ్యూనికేషన్‌పై పట్టు సాధించేందుకు దోహదపడే అంశాలకు చోటు కల్పిస్తున్నాయి. తద్వారా విద్యార్థి కోర్సు పూర్తయ్యే నాటికి ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ సొంతం చేసుకునేలా సిలబస్‌ను రూపొందిస్తున్నాయి.
 
సిటీ బీ స్కూల్స్‌లో...
హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ, ఐపీఈ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీల మేనేజ్‌మెంట్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. వీటిల్లో ఐఎస్‌బీ, ఐపీఈల్లో 2015 విద్యాసంవత్సరం నుంచి సిలబస్‌లో కొన్ని మార్పులు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల సిలబస్‌ను 2010 విద్యాసంవత్సరంలో మార్చారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మార్పులపై ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. యూజీసీ అనుమతితో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంతో కోర్సులను ఎలక్టివ్ సబ్జెక్టులుగా ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.
 
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)
మిగతా ఇన్‌స్టిట్యూట్‌లకు భిన్నంగా ఐఎస్‌బీ ఐదు సంవత్సరాలకోసారి కరిక్యులమ్‌లో మార్పులు చేస్తోంది. అవసరాలకనుగుణంగా ఎప్పటికప్పుడూ నూతన కోర్సులను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న 763 మంది విద్యార్థుల కోసం కొత్తగా రెస్పాన్సిబుల్ లీడర్‌షిప్ అనే నూతన కోర్సును రూపొందించింది. సందర్భానుసారంగా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా  బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవరచుకోవడం.. అవసరమైన సమయంలో కఠినంగా వ్యవహరించడం.. సమర్థవంతంగా నిర్వహణ వ్యవహారాలను నిర్వర్తించడం.. వంటి నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ కోర్సును ప్రవేశపెట్టింది.
 
ఈ ఇన్‌స్టిట్యూట్ ఏడాది వ్యవధి గల మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అంతేకాకుండా బిజినెస్ కమ్యూనికేషన్ కోర్సును కూడా నిర్వహిస్తోంది. వెర్బల్, రిటెన్ కమ్యూనికేషన్ పరంగా విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ కోర్సు దోహదం చేస్తుంది. మొత్తం మీద వ్యక్తిగత పనితీరును మెరుగుపరుచు కోవడంతోపాటు సహోద్యోగులతో ప్రభావవంతమైన సమన్వయం చేసుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ మరో వినూత్న ఆలోచన కూడా చేస్తోంది. కొత్త సబ్జెక్ట్‌లను బోధించడానికి విదేశీ ఫ్యాకల్టీలను నియమించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది.
 
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా
‘‘కరిక్యులమ్‌లో 24 అంశాలున్నాయి. గ్లోబల్ మార్కెటింగ్ అవసరాలకు తగినట్లుగా సిలబస్‌లో మార్పు చేశాం. పోటీ వాతావరణానికి  దీటుగా మార్కెట్ ఇంజనీరింగ్, సర్వీసెస్-గ్లోబల్ మార్కెటింగ్, రిటైల్ సెక్టార్ వంటి సబ్జెక్టులు ఇప్పటి మార్కెట్‌కు తగినట్లుగా రూపొందిస్తున్నాం’’ అని ఓయూ మేనేజ్‌మెంట్ డీన్ కృష్ణారెడ్డి చెప్పారు. స్వదేశీ, విదేశీ పెట్టుబడులు, బ్యాంకింగ్, ఫైనాన్స్, స్టాక్‌మార్కెట్ వంటి అంశాల్లో ఎప్పుడూ నూతనత్వం చోటుచేసుకుంటుంది. వ్యాపార లావాదేవీల్లో పెనుమార్పులుంటాయి. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ ఉన్నప్పుడే.. సబ్జెక్టు నిపుణులు బయటకు వస్తారు. కాబట్టి సిలబస్‌లో మార్పు చేయడం చాలా అవసరం అంటున్నారు కృష్ణారెడ్డి.  
 
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ)-హైదరాబాద్  
విద్యార్థుల ఆకాంక్షలను తీర్చేందుకు ఐఎంటీ-హైదరాబాద్ పీజీడీఎం ప్రోగ్రామ్స్‌లో భాగంగా వివిధ ఎలక్టివ్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఇష్టమైన ఐచ్ఛికాంశాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను విద్యార్థులకు కల్పించింది. ఒక విభాగంలో పూర్తి పట్టు సాధించాలనుకునేవారు దానికి సంబంధించి కనీసం ఐదు ఎలక్టివ్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగిలినవి ఏదైనా ఇతర విభాగంనుంచి ఎంచుకోవచ్చు. కనీసం 15 మంది విద్యార్థులు ముందుకొస్తే వారికి ఎలక్టివ్ కోర్సును ఆఫర్ చేస్తారు. ఐఎంటీ సంప్రదాయ ఫంక్షనల్ స్పెషలైజేషన్లతోపాటు బిజినెస్ ఎనలిటిక్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వంటి ప్రత్యేక విభాగాల్లో కెరీర్ ఓరియెంటెడ్ ఎలక్టివ్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి కెరీర్ ఓరియెంటెడ్ ఎలక్టివ్‌లను మరికొన్ని ప్రవేశపెట్టాలని ఐఎంటీ యోచిస్తోంది.
 
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-బెంగళూరు
దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌ల్లో ఒకటైన.. ఐఐఎం-బెంగళూరు  కొత్తగా పబ్లిక్ పాలసీ కోర్సును ప్రారంభించింది. హెల్త్ కేర్ ఎకనామిక్స్, బిజినెస్ చైన్స్ ఇందులోని ఐచ్ఛికాంశాలు (ఎలెక్టివ్స్). ఈ కోర్సు రెండో సంవత్సరంలో 23 ఐచ్ఛికాంశాలు ఉన్నాయి. ఫ్యాకల్టీ, విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలు ప్రతిపాదించిన స్పెషలైజేషన్స్‌కు ఈ 23 ఐచ్ఛికాంశాల్లో చోటు కల్పించడం ఈ కోర్సు ప్రత్యేకత.  కార్పొరేట్ వైఫల్యాలు, ఆర్థిక రంగంలో ఆసియా దేశాలు దూసుకుపోతున్న అంశాలను నేపథ్యంగా తీసుకుని పబ్లిక్ పాలసీ/కార్పొరేట్ స్ట్రాటజీ ప్రొఫెసర్లు ఈ కోర్సును బోధిస్తారు. అంతేకాకుండా ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రస్తుత సంవత్సరం నుంచి జర్మన్ లాంగ్వేజ్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది.  ఈ ఇన్‌స్టిట్యూట్ అందజేసే నాన్-క్రెడిట్ కోర్సులను ఐచ్ఛికాంశాలు (ఎలెక్టివ్స్)గా వ్యవహరిస్తారు. వీటిని ద్వితీయ సంవత్సరంలో స్పెషలైజేషన్స్‌లో భాగంగా ఆఫర్ చేస్తారు.
 
నైపుణ్యాలు పెంచుకోవాలి
సిలబస్‌లో కొత్తగా వచ్చే మార్పులు ఏవిధంగా ఉన్నా.. మేనేజ్‌మెంట్ కోర్సుల విషయంలో విద్యావేత్తల అభిప్రాయం మాత్రం మరోలా ఉంది.  కేస్ స్టడీస్ కంటే వాస్తవిక పరిస్థితులను అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తే ఈ కోర్సులు మరింత ప్రభావవంతంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో  విద్యార్థులు కూడా జాబ్ ఆఫర్ల గురించి ఆలోచించకుండా.. కార్పొరేట్ ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడే నిజ జీవిత నైపుణ్యాలను పెంచుకోవడం ఉత్తమమనే సలహా ఇస్తున్నారు.
 
వ్యాపార కళతో మేనేజ్‌మెంట్ విద్య
‘‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్(ఐపీఈ).. పీజీడీఎం కోర్సుల సిలబస్‌ను వ్యాపార రంగానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నాం. ఈ విద్యాసంవత్సరం బిజినెస్ ఎనలిటిక్స్, బిగ్ డేటా ఎనలిటిక్స్ వంటి  కోర్సులను ప్రవేశపెట్టాం.  బిజినెస్ ఎథిక్స్, పబ్లిక్ పాలసీ వంటి సబ్జెక్టులను కోర్ కోర్సుల్లో చేర్చాం. ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను సబ్జెక్టుగా చేర్చడం ద్వారా మార్కెట్‌లో నూతనత్వంతోనే వ్యాపారం వృద్ధి చెందుతుందనే తాజా ట్రెండ్‌పై అవగాహన కల్పించనున్నాం. అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ స్కూల్స్‌లో మాదిరిగా కాఫెతీరియా ప్రోగ్రాం ద్వారా క్యాంపస్‌లోకి రాగానే స్పెషల్ కోర్సులను ఎంచుకునే సౌలభ్యం కల్పిస్తున్నాం’’    -ప్రొఫెసర్ మిశ్రా, డెరైక్టర్, ఐపీఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement