పదిలమైన కెరీర్‌కు పునాది.. ఏపీ గురుకులాలు | Professional courses Intermediate. Engineering, Medicine | Sakshi
Sakshi News home page

పదిలమైన కెరీర్‌కు పునాది.. ఏపీ గురుకులాలు

Published Wed, Apr 9 2014 11:46 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

పదిలమైన కెరీర్‌కు పునాది.. ఏపీ గురుకులాలు - Sakshi

పదిలమైన కెరీర్‌కు పునాది.. ఏపీ గురుకులాలు

 కెరీర్ అనే మైలురాయికి తొలి అడుగు పదో తరగతి.. ఎన్నో అవకాశాలను అందుకునే దిశగా కెరీర్ ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది.. ఏ కోర్సులో చేరాలన్నా.. ఏ ఇన్‌స్టిట్యూట్‌ను ఎంచుకోవాలన్నా.. విస్తృత స్థాయిలో ప్రత్యామ్నాయాలు అవగాహనలోకి వస్తుంటాయి.. ఆ సమయంలోనే తీసుకునే నిర్ణయం.. వేసే అడుగే పదిలమైన భవిష్యత్‌కు పునాదిగా నిలుస్తోంది.. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు చక్కని వేదికలుగా భాసిల్లుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (ఏపీఆర్‌జేసీ)లు.. ఈ కాలేజీల్లో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే ఏపీఆర్‌జేసీ-కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌జేసీసెట్- 2014కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
 
 పదో తరగతి తర్వాత అత్యధిక మంది విద్యార్థులు ఎంచుకుంటున్న కోర్సుల్లో ఇంటర్మీడియెట్ ఒకటి. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరడానికి అర్హతగా నిలిచే ఇంటర్మీడియెట్ విద్యనభ్యసించడానికి చక్కని ఇన్‌స్టిట్యూట్‌లు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు. నాణ్యమైన ఇంటర్మీడియెట్ విద్యను ఉచితంగా అందించడంతోపాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నాయి ఈ గురుకులాలు. ఇంటర్మీడియెట్ విద్య ఖరీదైన వ్యవహారంగా మారిన ప్రస్తుత తరుణంలో పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు చక్కని ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి ఈ విద్యా సంస్థలు.
 
  15 1465
  కాలేజీలు సీట్లు
 
 రాష్ట్ర వ్యాప్తంగా 15 ఏపీ రెసిడెన్షియల్ 
 కాలేజీలు, 1465 సీట్లు వాటి వివరాలు..
 జనరల్ బాయ్స్ 5
 జనరల్ గర్ల్స్ 3
 జనరల్ (కో-ఎడ్యుకేషన్) 2
 మైనార్టీ బాయ్స్ 4
 మైనార్టీ గర్ల్స్ 1
 ఆఫర్ చేస్తున్న గ్రూపులు:
 ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ. ఒకేషనల్ కోర్సులు: ఈఈటీ సీజీడీటీ (కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు కాలేజీ మాత్రమే ఈ కోర్సులను ఆఫర్ చేస్తుంది)
 
 ప్రవేశం: 
 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఎంచుకున్న గ్రూపును బట్టి మూడు సబ్జెక్ట్‌లలో పరీక్షను నిర్వహిస్తారు.  మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. 
 
 వివరాలు..
 ఎంపీసీ ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్
 బైపీసీ ఇంగ్లిష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్
 సీఈసీ/
 ఎంఈసీ ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్
 ఈఈటీ ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్
 సీజీడీటీ ఇంగ్లిష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్
 ప్రతి సబ్జెక్ట్‌కు 50 ప్రశ్నలు 50 మార్కులు
 ప్రతి పేపర్‌కు సమయం: రెండున్నర గంటలు
 ప్రతి పేపర్‌కు మార్కులు: 150
 
 ఉన్నతంగా తీర్చిదిద్దే:
 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు నాణ్యమైన లేబొరేటరీలు, చక్కటి లైబ్రరీలు, విశాలమైన రీడింగ్ రూమ్‌లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అన్ని వసతులతో కూడిన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కూడా ఉంటుంది. విద్యార్థులను కేవలం ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌కే పరిమితం చేయకుండా.. వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా మరెన్నో అనుబంధ కోర్సుల్లో శిక్షణ కూడా లభిస్తుంది. వాటిలో.. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంసెట్, జేఈఈ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు తొలిరోజు నుంచే సిద్ధం చేస్తారు. అదేవిధంగా ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులను సీఏ, ఐసీడబ్ల్యూఏ వంటి కోర్సుల్లో రాణించే తరహాలో శిక్షణనిస్తారు. ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు సీపీటీ (ఇ్కఖీ) మాదిరి పరీక్షలను కూడా నిర్వహిస్తారు.
 
 లోకో పేరెంట్:
 నిరంతర పర్యవేక్షణ కోసం కార్పొరేట్ తరహాలో ప్రతి అధ్యాపకుడి (లోకో పేరెంట్‌గా వ్యవహరిస్తారు)కీ 15-20 మంది విద్యార్థులను కేటాయిస్తారు. వారి చదువు, క్రమశిక్షణ, వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించడం, అసైన్‌మెంట్లు, మూల్యాంకనం, స్టడీ మెటీరియల్ అందించడం ఇవన్నీ ఆ అధ్యాపకుడే చూసుకుంటారు. ప్రతిరోజూ నిర్దేశిత సమయాల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి అధ్యాపకులు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఫిజికల్, స్పోర్ట్స్ యాక్టివిటీస్‌కు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలను కూడా నిర్వహిస్తారు.
 
 
 కొత్తగా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్
  ఏపీఆర్‌జేసీ సెట్-
 2014లో ప్రధాన మార్పు నాగార్జున సాగర్ కేంద్రంగా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో మరో కొత్త రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భవిష్యత్తులో అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధులుగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు రూపకల్పన చేయడం జరిగింది. కో-ఎడ్యుకేషన్ విధానంలో మొత్తం 150 మంది విద్యార్థులను (వంద మంది బాలురు, 50 మంది బాలికలు) వారు రాష్ట్ర స్థాయిలో సాధించిన ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తాం. అయితే ఔత్సాహిక అభ్యర్థులు తమ దరఖాస్తు ప్రక్రియ సమయంలోనే ఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రాథమ్యంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా గత ఏడాది వరకు స్టేట్ వైడ్ ఇన్‌స్టిట్యూట్స్‌గా పరిగణించే నాగార్జున సాగర్, కొడిగినహళ్లి, నిమ్మకూరు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉండేది. ఈ ఏడాది నుంచి మిగతా అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం బోధన తప్పనిసరి చేశాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ కళాశాలలు(5), కో-ఎడ్యుకేషన్ కళాశాలలు(2), మహిళా కళాశాలలు(3), బాలుర కళాశాలలు(5), కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ మొత్తం 15 కళాశాలల్లో 1465 సీట్లకు ఏపీఆర్‌జేసీ ఎంట్రన్స్ నిర్వహించనున్నాం. 
 - పి.జగన్మోహన్ రెడ్డి,
 కన్వీనర్, ఏపీఆర్‌జేసీ సెట్-2014. 
 
 ప్రిపరేషన్ 
 ఇంగ్లిష్
 కీలకమైన సబ్జెక్ట్ ఇంగ్లిష్. ఎందుకంటే అన్ని గ్రూపులకు నిర్వహించే పరీక్షల్లో ఇంగ్లిష్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్‌లో సాధించే మార్కులే కీలకపాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా పది అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి.. Parts of Speech(5 మార్కులు), Prepositions (5 మార్కులు),  Articles  (1 మార్కు), Idioms and their Meanings(5 మార్కులు),One word Substitutes (5 మార్కులు), Synonyms  (5 మార్కులు),Antonyms(5 మార్కులు),  Finding out the Error part in the sentence (5మార్కులు), Comprehension passage (5 మార్కులు), Transformation of Sentences (9 మార్కులు). ఈ అంశాలన్నింటినీ ఇది వరకే చదివి ఉంటారు. దాంతో చాలా మంది సులువు అనే ఉద్దేశంతో నిర్లక్ష్యం వహిస్తారు. కానీ అది సరికాదు. విపరీతమైన పోటీ ఉండే ఈ పరీక్షలో ప్రతి మార్కూ కీలకమే. కాబట్టి ఏదో కొత్త విభాగాన్ని చదువుతున్నామనే భావనతో ప్రిపే ర్ కావాలి. అన్ని టాపిక్స్‌ను ఒకేసారి చదవొద్దు. రోజుకో టాపిక్‌ను నేర్చుకోవడం ప్రయోజనకరం. ఆ తర్వాత ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో వాటిలో మెరుగయ్యే విధంగా బిట్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. చివరి 15 రోజులు పూర్తిగా మోడల్ పేపర్లను సాధించడం ఉత్తమం.
 
 బయాలజీ 
 జీవశాస్త్రంలో ఆరు అధ్యాయాలు ఉన్నాయి. అవి.. జీవన విధానాలు, నియంత్రణ-సమన్వయం, ప్రత్యుత్పత్తి, హెచ్‌ఐవీ-ఎయిడ్స్, పోషణ, పర్యావరణ విద్య. ఈ అధ్యాయాలను క్షుణ్నంగా చదవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కేవలం సిలబస్ ఆధారంగా మాత్రమే ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సిలబస్‌ను, గత పదేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ ప్రిపేర్ కావడం మంచిది. ప్రతి పాఠ్యాంశం చివర్లో ఉన్న ముఖ్యాంశాలు, ఖాళీలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో పొందుపరుచుకోవడం ప్రయోజనకరం.
 
 సోషల్ స్టడీస్
 సాంఘిక శాస్త్రంలో విభాగాల వారీగా పరిశీలిస్తే.. చరిత్ర నుంచి 18-20 ప్రశ్నలు, భూగోళశాస్త్రం నుంచి 12 -14 ప్రశ్నలు, పౌరశాస్త్రం నుంచి 8-10 ప్రశ్నలు, ఆర్థికశాస్త్రం నుంచి 6-8 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. చరిత్రలో జాతీయవాద ఉద్యమాలు, సామ్రాజ్యవాదం, సమకాలీన ప్రపంచం, రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం- తర్వాత ప్రపంచం, భారతదేశ సాంస్కృతిక వారసత్వం, భారత స్వాతంత్య్రోద్యమం చాప్టర్లను బాగా చదవాలి. ప్రధానంగా చివరి రెండు చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు. అంతేకాకుండా ఈ విభాగంలో సంవత్సరాలు, కాలక్రమాలను గుర్తుంచుకోవాలి. అధిక శాతం ప్రశ్నలు సంవత్సరాలపైనే ఉండొచ్చు. చరిత్ర తర్వాత ఎక్కువ ప్రశ్నలు భూగోళశాస్త్రంలో రావచ్చు. ఇందులో భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక, భౌతిక రూపురేఖలు, నిమ్నోన్నతాలు, శీతోష్ణస్థితి, మృత్తికలు, నీటిపారుదల వ్యవస్థ, వ్యవసాయం, పరిశ్రమలు, ఖనిజాలు, రవాణా సమచార సాధనాలు, ఓడరేవులు వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఇండియా మ్యాప్‌ను అనుసరిస్తూ ఈ పాఠ్యాంశాలను ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. పౌరశాస్త్రంలోని అంశాలపై తేలిగ్గా అవగాహన చేసుకోవచ్చు. ఇందులో భారత ప్రజాస్వామ్యం, నేడు మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, భారతదేశం-ఐక్యరాజ్యసమితి-ప్రపంచ సమస్యలు పాఠాలపై దృష్టి సారించాలి. ఇందులో చివరి పాఠం నుంచి 4 నుంచి 6 ప్రశ్నలు రావచ్చు. ఆర్థికశాస్త్రంలో చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం-లక్షణాలు-సమస్యలు, ప్రణాళికలు విజయాలు-వైఫల్యాలు వంటి అంశాలను బాగా చదవాలి. ఇందులో ప్రతి చాప్టర్ నుంచి రెండు ప్రశ్నలు రావొచ్చు.
 
 మ్యాథమెటిక్స్
 మ్యాథమెటిక్స్‌లో పదో తరగతి సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయి. ప్రతి పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు రావొచ్చు. కాబట్టి అన్ని పాఠాలను క్షుణ్నంగా చదవాలి. ప్రమేయాలు, శ్రేఢులు, వైశ్లేషిక రేఖాగణితం, త్రికోణమితి పాఠ్యాంశాలను సమగ్రంగా ప్రిపేర్ కావాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సాధ్యమైనన్నీ షార్ట్‌కట్ మెథడ్స్, ఎలిమినేషన్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. సాధారణ స్థాయి మొదలుకొని కఠిన స్థాయి ప్రశ్నలను సాధన చేయాలి. వీలైనన్ని మోడల్ పేపర్లను సమయాన్ని నిర్దేశించుకుని ప్రాక్టీస్ చేయడం ప్రయోజనకరం.
 
 ఫిజికల్ సైన్స్
 ఫిజిక్స్, కెమిస్ట్రీలలోని మొత్తం 21 అధ్యాయాలు ముఖ్యమైనవే. ఇందులో రెండు కంటే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న అంశాలు..అయస్కాంతత్వం, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్, పరమాణు నిర్మాణం, ద్రావణాలు, కర్బన సమ్మేళనాల రసాయనశాస్త్రం, రసాయనశాస్త్రం-పరిశ్రమలు. ద్రావణాలలోని సమస్యలు, ఆమ్లాలు-క్షారాలలోని పీహెచ్ విలువలు కీలకమైనవి. మనవిశ్వం, శుద్ధ గతికశాస్త్రం, గతిశాస్త్రం, ధ్వని, అయస్కాంతత్వం, తదితర అధ్యాయాల్లోని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పోల్చితే ఈ పరీక్షకు కొంత విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. కాబట్టి ముందుగా ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. వివిధ భావనలకు సూత్రాలను అన్వయించి సమస్యలను సాధించడం నేర్చుకోవాలి. ప్రతి అధ్యాయంలోని సూత్రాలు, స్థిరాంకాలు, ముఖ్య రసాయన ఫార్ములాలను ఒక చోట చేర్చుకొని నిత్యం చదవడం ప్రయోజనకరం. పాఠ్యపుస్తకంలో ఉన్న వివిధ పట్ట్టికలను పరిశీలించాలి.
 
 నోటిఫికేషన్ సమాచారం: 
  అర్హత: ఈ ఏడాది మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించిన పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశించిన విధంగా జీపీఏ సాధించాలి. ఈ క్రమంలో ఓసీ-6, బీసీ/ఎస్సీ/ఎస్టీ-5. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో విధిగా జీపీఏ 4 సాధించి ఉండాలి.
  పరీక్ష ఫీజు: రూ. 150
  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 17, 2014
  రాత పరీక్ష తేదీ: మే 12, 2014 
  వివరాలకు: http://aprjdc.cgg.gov.in
 
  డి.హనుమంత రావు (ఇంగ్లిష్),
  కట్టా కవిత (మ్యాథమెటిక్స్), 
  ఇన్‌పుట్స్: నాగ రాజశేఖర్ (ఫిజికల్ సైన్స్), 
  సత్యనారాయణ (బయాలజీ), 
  బి.శ్రీనివాస్ (సోషల్ స్టడీస్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement