సజావుగా ఎంసెట్
93 శాతం మంది హాజరు
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఎంసెట్ 2014 ప్రవేశ పరీక్షకు విశాఖ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 93 శాతం మంది విద్యార్థులు హాజరయినట్టు ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య కె.వెంకటసుబ్బయ్య తెలిపారు.
ఇంజినీరింగ్ విభాగంలో 36 కేంద్రాలలో 18,976 మంది దరఖాస్తు చేయగా 17,809 మంది పరీక్షకు హాజరయ్యారు. 1167 మంది గైర్హాజరయ్యారు. మెడిసిన్ విభాగంలో 13 కేంద్రాలలో 6379 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 5956 మంది హాజరయ్యారు.
423 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 93.85 శాతం మంది, మెడిసిన్ విభాగంలో 93.37 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు చెప్పడంతో ఉదయం 8 గంటల నుంచే పెద్దసంఖ్యలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థుల వెంట వచ్చినవారితో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
వర్సిటీలో అత్యధికంగా 10 కేంద్రాలలో ఇంజినీరింగ్, మెడిసిన్ పరీక్షలు జరగడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులతో వర్సిటీ పరిసరాలు నిండిపోయాయి. మెడిసిన్ విభాగం పరీక్ష మధ్యాహ్నం 2.30 ప్రారంభం కాగా మధ్యాహ్నం 12 గంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.