సీన్ రివర్స్!
- సంప్రదాయ కోర్సులకు విశేష ఆదరణ
- ప్రొఫెషనల్ కోర్సుల్లో మిగిలిపోతున్న సీట్లు
యూనివర్సిటీక్యాంపస్ : ఒకప్పుడు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు మొగ్గు చూపేవారు. బీటెక్, ఎంసీఏ, ఏంబీఏ, బీఈడీ, ఎంఈడీ, ఫార్మసీ, మెడిసిన్, వెటర్నరీ, డిప్లొమా తదితర ప్రొఫెషనల్ కోర్సులకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. పైకోర్సుల్లో మెడిసిన్, వెటర్నరీ తప్ప మిగిలిన కోర్సులకు ఆదరణ తగ్గిపోయింది. ఈ ఏడాది నిర్వహించిన వివిధ ప్రవేశపరీక్షల ద్వారా కోర్సుల్లో చేరిన విద్యార్థుల వివరాలు పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతున్నాయి.
ఈసెట్ ద్వారా జరిపిన అడ్మిషన్లలో బీటెక్, ఫార్మసీ కోర్సుల్లో కేవలం 22,744 మంది చేరగా 63,320 సీట్లు మిగిలిపోయాయి. ఎడ్‌సెట్ ద్వారా నిర్వహించిన బీఈడీ అడ్మిషన్లలో 6,770 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 19 వేల సీట్లు మిగిలిపోయాయి. పాలిసెట్ ద్వారా జరిపిన డిప్లొమో కోర్సుల్లో 85,500 సీట్లు ఉండగా 42,400 సీట్లు భర్తీ అయ్యాయి. 42,800 సీట్లు మిగిలిపోయాయి. ఎంసెట్ ద్వారా నిర్వహించిన బీటెక్ అడ్మిషన్లలో 36,324 సీట్లు మిగిలిపోయాయి. 304 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా 50 కళాశాలల్లో ఒక్కరూ చేరలేదు. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఇంకా జరగాల్సివుంది. ఇది ఏడాది ప్రొఫెషనల్ కోర్సులపై విద్యార్థులు చూపుతున్న నిరాదారణకు ఇది నిదర్శనం.
పీజీ కోర్సులు ఫుల్
ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల సీట్లు ఈ ఏడాది పూర్తిగా నిండిపోయాయి. కొన్ని ప్రైవేటు కళాశాలలు మినహా క్యాంపస్ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయి, స్పాన్సర్డ్ కోటాలో ఎక్కువ మంది అడ్మిషన్లు పొందారు. మహిళా వర్సిటీలో గత ఏడాది కంటే ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఎస్వీయూలో కూడా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. క్యాంపస్‌లో 1605 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో 1485 సీట్లు రెగ్యులర్‌గా కాగా మిగిలిన సీట్లల్లో విద్యార్థులు ఎక్కువ మొత్తం ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందారు.
సోషియాలజీ, సోషల్‌వర్క్, లైబ్రరీ సైన్స్ కోర్సులు కూడా విద్యార్థులతో నిండిపోయాయి. ఆదరణ లేని హిస్టరీ, సీప్‌స్టడీస్ కోర్సుల్లో కూడా సీట్లు నిండాయి. గత ఏడాది కన్నా 20 శాతం మేరకు అడ్మిషన్లు పెరగడం విశేషం. డిగ్రీస్థాయిలో కూడా బీకాం, బీఎస్సీ కోర్సులకు ఆదరణ పెరిగింది. డిగ్రీ చదివిన విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి కంపెనీలు ప్లేస్‌మెంట్ ఇస్తున్నాయి. పైగా ప్రొఫెషనల్ కోర్సులతో పోల్చితే వీటికి ఫీజుల భారం తక్కువే. అందువల్ల విద్యార్థులు సాధారణ సంప్రదాయ కోర్సులపైనే మొగ్గు చూపుతున్నారు.