ఎంసెట్ ప్రశాంతం | EAMCET - 2014 | Sakshi
Sakshi News home page

ఎంసెట్ ప్రశాంతం

Published Fri, May 23 2014 2:55 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఎంసెట్ ప్రశాంతం - Sakshi

ఎంసెట్ ప్రశాంతం

  •      ఇంజినీరింగ్‌లో 95.86శాతం అభ్యర్థులు..
  •      మెడిసిన్, అగ్రికల్చర్‌కు 94.87శాతం అభ్యర్థుల హాజరు
  •      నిమిషం నిబంధనతో ఉరుకులు పరుగులతో పరీక్షా కేంద్రాలకు..
  •  కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నిర్వహించిన ఎంసెట్- 2014 వరంగల్ రీజియన్‌లో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన ఇంజి నీరింగ్ ప్రవేశ పరీక్షకు 14,321 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 13,728మంది అభ్యర్థులు(95.86శాతం) హాజరయ్యారు.

    593మంది గైర్హాజరయ్యారు. మొత్తం 23 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 36మంది అబ్జర్వర్లుగా విధులు నిర్వర్తించారు. మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పది పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన మెడిసిన్, అగ్రికల్చర్  కోర్సు ప్రవేశ పరీక్షకు మొత్తం 6,664 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 6,322మంది (94.87శాతం)హాజరయ్యారు. 342మంది గైర్హాజరయ్యారు. పరీక్షకు 18మంది అబ్జర్వర్లుగా విధులు నిర్వర్తించారు.
     
    ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో చాలామంది అభ్యర్థులు సమయానికంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మరికొందరు అభ్యర్థులు ఉరుకులు పరుగులతో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. హాల్‌టికెట్లతోపాటు అప్లికేషన్‌ను కూడా డౌన్‌లోడు చేసుకుని ఫోటో పెట్టుకుని రావాలని కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు చెప్పడంతో కొందరు అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. చివరికి  హాల్‌టికెట్‌తోనే అభ్యర్థులను అనుమతించారు.

    కుల ధ్రువీకరణ పత్రాలను కూడా తీసుకున్నారు. వీటిని వెంట తీసుకురాని అభ్యర్థులు ఆ తర్వాత ఎంసెట్ కన్వీనర్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కాలేజీ పరీక్షా కేంద్రంలో కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు, ఎంసెట్ రీజనల్ కోఆర్డినేటర్ కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. వీరివెంట ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.భద్రునాయక్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామానుజరావు ఉన్నారు.

    ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సాయిలు మాట్లాడుతూ ఎంసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపినట్టు చెప్పారు. ఉదయం, మధ్యాహ్నం వివిధ పరీక్షా కేంద్రాలను ప్రత్యేక అబ్జర్వర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, కలెక్టర్ జి. కిషన్ పర్యవేక్షించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement