ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నెలాఖరులో!
' 16వ తేదీన తేలనున్న స్థానికత!
' 20 నాటికి నోటిఫికేషన్ ... ఏర్పాట్లపై అధికారుల దృష్టి
' ‘స్థానికత’ ఆలస్యమైతే ఆపై మరోవారం ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: పన్నెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు మార్గం సుగమం అవుతోంది. ఈ నెల మూడోవారంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెలాఖరులో కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంలో స్థానికత నిర్ధారణ అంశం కూడా కొలిక్కి వస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, అధికారులు చాలాసార్లు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు.
స్థానికతకు ప్రామాణికంగా తీసుకోవాల్సిన కటాఫ్ సంవత్సరాలతో (1956 లేదా 1974) రెండు రకాల ప్రతిపాదనలకు మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిసింది. ఈనెల 16న జరిగే కేబినెట్ సమావేశంలో ఆ రెండింటిలో ఏదో ఒక దాన్ని స్థానికతకు ప్రామాణికంగా తీసుకుని విధాన నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రాసి, ప్రవేశాల కోసం దాదాపు 12 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితిపైనా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ అంశాన్ని తేల్చేందుకే ప్రయత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే సాంకేతికంగా, న్యాయపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిబంధనలను రూపొందించే క్రమంలోనే కొంత ఆలస్యం అవుతుందే తప్ప మరేమీ లేదని చెబుతున్నారు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రామాణికంగా తీసుకునే స్థానికత అంశంపై ఈనెల 16న ప్రకటన వెలువడిన వెంటనే ఇంజనీరింగ్ తదితర కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్లను జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఇందుకు తాత్కాలిక షెడ్యూలును కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. 16వ తేదీన స్థానికతపై ప్రకటన వెలువడితే ఏయే తేదీల్లో ఏమేం చేయాలనే వివరాలతో ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిసింది. ప్రకటన వెలువడిన వెంటనే 20వ తేదీ నాటికి ఇంజనీరింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటా భర్తీకి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లో ఇతర ప్రవేశాలపై నోటిఫికేషన్ జారీ చేస్తారు. నోటిఫికేషన్ జారీ తరువాత వారం రోజులు గడువు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ నెలాఖరుకు ప్రవేశాల కౌన్సెలింగ్ (సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆప్షన్ల నమోదు ప్రారంభం) ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ 16వ తేదీన కనుక స్థానికతపై ప్రకటన వెలువడకపోతే మరో వారం రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కొన్ని కోర్సుల్లో మిగిలింది సీట్ల కేటాయింపే..
ఇంజనీరింగ్ కోర్సులకు కౌన్సెలింగ్‌ను ప్రారంభించకపోయినా ఇతర కోర్సులకు సంబంధించిన కౌన్సెలింగ్ ఇప్పటికే పూర్తయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం తేలకపోవడంతో సీట్ల కేటాయింపును నిలిపివేశాయి. పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు జూన్ 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు గత నెల 20 నుంచి ఈనెల 5వ తేదీవరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక్కడా సీట్లను మాత్రం కేటాయించలేదు.
ఇక డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్‌సెట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎంసెట్ ఇంజనీరింగ్ రాసిన వారు 2,15,336 మంది, ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ రాసిన వారు 98,292 మంది ఉన్నారు. డైట్‌సెట్‌లో అర్హులు 2,25,000 మంది, ఎడ్‌సెట్‌లో 1,48,188 మంది, ఐసెట్‌లో 1,19,756 మంది, ఈసెట్‌లో 43,446 మంది, లాసెట్‌లో 18,085 మంది, పీజీలాసెట్‌లో 1,596 మంది, పీఈసెట్‌లో 15,236 మంది, పీజీఈసెట్‌లో 97,642 మంది, పాలీసెట్‌లో 1,67,360 మంది అర్హత సాధించినవారు ఉన్నారు.