ఉద్యోగ ఆధారిత కోర్సులకు శ్రీకారం
వచ్చే జూన్ కల్లా 250 కొత్త గురుకులాల ప్రారంభం
వీటి ఏర్పాటుకు మొత్తం రూ.5,500 కోట్ల వ్యయం
డిగ్రీ నుంచే పోటీ పరీక్షలకు శిక్షణ: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ బీఏ, బీఎస్సీ, బీకాం వంటి డిగ్రీ కోర్సులకు భిన్నంగా కాలేజీల నుంచి విద్యార్థులు బయటకు రాగానే ఏదో ఒక ఉద్యోగం, ఉపాధి లభించేలా సంక్షేమ గురుకుల డిగ్రీ కోర్సుల సిలబస్‌కు తుదిరూపునిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్, పరిశ్రమల్లో సిబ్బంది, ఉద్యోగులు, సదుపాయాల కల్పనకు ఉత్పన్నమయ్యే అవసరాలకు తగ్గట్లుగా సిలబస్‌ను రూపొందిస్తున్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో అనుసంధానం చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయా పరిశ్రమల ప్రతినిధులతో చర్చలప్రక్రియను ప్రారంభించారు. ఆంగ్లం, కంప్యూటర్ వినియోగంలో విద్యార్థులు పైచేయిని సాధించేలా శిక్షణను ఇవ్వనున్నారు. ప్రవేశ పరీక్షను నిర్వహించడం ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీలను పెద్ద పట్టణాలు, నగరాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
జూన్‌కల్లా కొత్త గురుకుల పాఠశాలలు ఏర్పాటు..
వచ్చే జూన్ చివరికల్లా రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అవసరమైన బడ్జెట్, మౌలిక సదుపాయాలు, టీచర్లు, సిబ్బంది, భవనాల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా శాఖలు వెల్లడించాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల సొసైటీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.
250 గురుకులాల ఏర్పాటుకు రూ.5,500 కోట్లు..
కొత్తగా ఏర్పాటు చేయనున్న 250 గురుకుల విద్యాలయాల ద్వారా 1.6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటి ఏర్పాటుకు రూ. 5,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనావేస్తున్నారు. ఒక్కో రె సిడెన్షియల్ స్కూల్‌కు 7 ఎకరాల స్థలంతో పాటు రూ.22 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు తేల్చారు. ఈ విద్యాసంవత్సరం (2016-17) నుంచే ఎస్సీ విద్యార్థుల కోసం వంద రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనారిటీ విద్యార్థుల కోసం 70 గురుకులాలు, ఎస్టీ విద్యార్థులకు 50 రెసిడెన్షియల్ స్కూళ్లు, మహిళల కోసం 25, అబ్బాయిల కోసం 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫ్రెంచ్, స్పానిష్‌నూ బోధిస్తాం..
‘‘ డిగ్రీ నుంచే సివిల్స్, కేంద్ర, రాష్ట్ర, కార్పొరేట్ రంగాల్లోని పోటీ పరీక్షలకు అవసరమైన లాంగ్‌టర్మ్ శిక్షణను అందిస్తాం. దేశంలో ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిలో సింహభాగం తెలంగాణ వారికే దక్కేలా చూడాలన్నది ప్రభుత్వ ధ్యేయం. డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలోనే. ఫ్రెంచ్, స్పానిష్ వంటి భాషలను బోధిస్తాం. సెల్ఫ్ డెవలప్‌మెంట్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఫ్రీలాన్సింగ్‌లో విద్యార్థులు ఆరితేరేలా తరగతులుంటాయి. బయట జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నాం. వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణనిచ్చి, స్కూల్ నుంచి బయటకు రాగానే ఉపాధి దొరికేలా సశక్తులను చేస్తాం. మ్యూజిక్, ఆర్ట్, డాన్స్‌లలో శిక్షణనిచ్చేలా రూపొందిస్తున్నాం.’’
- ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి