సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా సమీకృత గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. రూ.2,500 కోట్లతో ఈ ఏడాది రాష్ట్రంలో 100 ఎస్సీ, బీసీ, మైనారిటీల గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపడుతు న్నామని, ఒక్కో భవనానికి రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. సచివాలయంలో గురుకుల పాఠశాలల భవన నిర్మాణాలపై విద్య, సంక్షేమ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీల గురుకుల పాఠశాలల భవనాలను సమీకృతంగా ఒకేచోట నిర్మిస్తుండటంతో స్థల సమస్య తీరుతుందని, క్రీడా మైదానాలు వంటి ఉమ్మడి సదుపాయాలను అన్ని గురుకులాల విద్యార్థులు వాడుకోవచ్చన్నారు.
మధిరలో పైలట్ ప్రాజెక్టు
సమీకృత గురుకుల పాఠశాలల భవన నిర్మాణానికి మధిర నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. చింతకాని మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం సమీపంలోని 10 ఎకరాల్లో నిర్మిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థలాల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భవనాల నిర్మాణం సత్వరంగా పూర్తి చేయడానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి అహమ్మద్ నదీమ్‌ను ఆదేశించారు. దేశంలో తాము నిర్మించిన ఇంటర్నేషనల్ మోడల్ పాఠశాలలపై బెంగళూరు ఆర్కిటెక్ట్ సంస్థ సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
నాలెడ్జ్ కేంద్రాల ఏర్పాటు
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు శిక్షణ కోసం నియోజకవర్గ కేంద్రాల వారీగా నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు భట్టి తెలిపారు. త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల నిరుద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి వీటిని ప్రారంభిస్తున్నామన్నారు. జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ క్షేత్రంగా నియోజకవర్గాల్లోని నాలెడ్జ్ సెంటర్లకు వచ్చే నిరుద్యోగులకు నేరుగా ఆన్‌లైన్ కోచింగ్ ఇప్పించే ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment