international schools
-
‘ఇంటర్నేషనల్’ గురుకుల భవనాలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా సమీకృత గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. రూ.2,500 కోట్లతో ఈ ఏడాది రాష్ట్రంలో 100 ఎస్సీ, బీసీ, మైనారిటీల గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపడుతు న్నామని, ఒక్కో భవనానికి రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. సచివాలయంలో గురుకుల పాఠశాలల భవన నిర్మాణాలపై విద్య, సంక్షేమ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీల గురుకుల పాఠశాలల భవనాలను సమీకృతంగా ఒకేచోట నిర్మిస్తుండటంతో స్థల సమస్య తీరుతుందని, క్రీడా మైదానాలు వంటి ఉమ్మడి సదుపాయాలను అన్ని గురుకులాల విద్యార్థులు వాడుకోవచ్చన్నారు. మధిరలో పైలట్ ప్రాజెక్టు సమీకృత గురుకుల పాఠశాలల భవన నిర్మాణానికి మధిర నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. చింతకాని మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం సమీపంలోని 10 ఎకరాల్లో నిర్మిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థలాల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భవనాల నిర్మాణం సత్వరంగా పూర్తి చేయడానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి అహమ్మద్ నదీమ్‌ను ఆదేశించారు. దేశంలో తాము నిర్మించిన ఇంటర్నేషనల్ మోడల్ పాఠశాలలపై బెంగళూరు ఆర్కిటెక్ట్ సంస్థ సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నాలెడ్జ్ కేంద్రాల ఏర్పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు శిక్షణ కోసం నియోజకవర్గ కేంద్రాల వారీగా నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు భట్టి తెలిపారు. త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల నిరుద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి వీటిని ప్రారంభిస్తున్నామన్నారు. జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ క్షేత్రంగా నియోజకవర్గాల్లోని నాలెడ్జ్ సెంటర్లకు వచ్చే నిరుద్యోగులకు నేరుగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పించే ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. -
HYD: ఈ-సిగరెట్ల కలకలం.. విద్యార్థులే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈ-సిగరెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. రాయదుర్గం పరిధిలో ఎస్వోటీ(Special Operation Team) భారీగా ఈ-సిగరెట్లను పట్టుకుంది. వాటిని అమ్ముతున్న, కొంటున్న విద్యార్థులనూ అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఇంటర్నేషన్ స్కూల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు కేటుగాళ్లు. అందులోని నికోటిక్‌కు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా ఈ-సిగరెట్ల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ గుర్తించింది. నిఘా వేసి.. భారీగా ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుంది. వీటి విలువ సుమారు మూడు లక్షల విలువ దాకా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ-సిగరెట్ల విక్రయానికి పాల్పడుతున్న ఇండియన్ బిజినెస్ స్కూల్ విద్యార్థి మాధవను (19) పోలీసులు అరెస్ట్ చేశారు. ICFAi, IBS స్కూళ్లలో పదిమంది విద్యార్థులు, మహీంద్రా యూనివర్సిటీ, సంస్కృతి డిగ్రీ కాలేజ్, ఆకాష్ ఇన్స్టిట్యూట్, గీతం కాలేజ్ , అమిటీ కాలేజ్ విద్యార్థులకు ఈ సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. మాధవ్ నుంచి 22 ఈ-సిగరెట్ల తో పాటు రెండు మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. అమిటి కాలేజీలో చదువుతున్న అచ్యుత్.. 71 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ-సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. వీళ్లిద్దరితో పాటు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఇంటర్నేషనల్ స్కూళ్లపై యమా క్రేజ్
సాక్షి, అమరావతి: గత దశాబ్దన్నర కాలంగా దేశీయ విద్యా రంగం కొత్త పుంతలు తొక్కుతూ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కాన్వెంట్లు పోయి కార్పొరేట్ స్కూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ ట్రెండ్‌లోను మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు ఇంటర్నేషనల్ స్కూళ్ల వైపు మొగ్గుచూపుతున్నారని ప్రముఖ సంస్థ ఐఎస్సీ(ఇంటర్నేషనల్ స్కూల్ కన్సల్టెన్సీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఏడేళ్ల వ్యవధిలో దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్య రెండింతలవడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉందని, వాటి ట్యూషన్ ఫీజుల టర్నోవర్ ఏకంగా రూ.8,615 కోట్లకు చేరిందని వెల్లడించింది. అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలు అందించాలనే తాపత్రయంతో ధనిక వర్గాలే కాకుండా ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా తమ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఐఎస్సీ తాజా నివేదిక ప్రకారం ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్యలో చైనా మొదటి స్థానంలో నిలవగా.. మనం రెండో స్థానం దక్కించుకున్నాం. విదేశీ విద్యపై మోజుతోనే.. గత 15 ఏళ్లుగా ఉన్నత విద్య కోసం మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాఠశాల విద్య కూడా ఇంటర్నేషనల్ సిలబస్‌లో ఉంటే మంచిదనే భావన తల్లిదండ్రుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2012 నాటికి దేశంలో ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమైన ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇప్పుడు చిన్న నగరాలకు కూడా విస్తరించాయి. ఇవి ఎక్కువగా కేంబ్రిడ్జ్ ప్రైమరీ, సెకండరీ, అడ్వాన్స్డ్ ప్రోగ్రాం కోర్సులు అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా విశేష గుర్తింపున్న ‘ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ కోర్సులో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతున్న వారిలో 63.40 శాతం భారతీయులు కాగా మిగిలినవారు విదేశీయుల పిల్లలు. విదేశీ దౌత్యవేత్తలు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న విదేశీయుల పిల్లలు దాదాపు 36 శాతం ఉన్నారు. భారీగానే ఫీజులు మన దేశంలోని ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ. 2.87 లక్షల నుంచి రూ. 7.17 లక్షల వరకు ట్యూషన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర తక్కువేనని ఐఎస్సీ నివేదిక పేర్కొంటుంది. మన దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల సగటు వార్షిక ఫీజు రూ. 2.36 లక్షలు కాగా.. చైనాలోరూ. 11.29 లక్షలు, యూఏఈలో రూ. 5.79 లక్షలుగా ఉంది. మున్ముందు దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల ప్రాభవం మరింతగా పెరుగుతుందని ఐఎస్సీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఎస్సీ 1994 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్కూళ్లకు సంబంధించిన డేటాను సేకరిస్తూ విశ్లేషిస్తోంది. -
‘మెగా’ ఫ్యామిలీకి సంబంధం లేదు..
సాక్షి, హైదరాబాద్ : శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ‘చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్’తో మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని సీఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట స్థాపించిన సంస్థకు చిరంజీవి, రాంచరణ్, నాగబాబుకు గానీ ఎలాంటి సంబంధం లేదు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులమైన తాము సేవా దృక్పధంతో, సామాజిక స్పృహతో ఈ స్కూల్ పేరిట సంస్థను స్థాపించాం. దిగువ తరగతి ప్రజలకు తక్కువ ఫీజుతో విద్యను అందించాలనే దృఢసంకల్పంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాం. మెగా కుటుంబం మీద ఉన్న అభిమనాంతో చిరంజీవి,రాంచరణ్, నాగబాబుని గౌరవ పౌండర్, గౌరవ అధ్యక్షులు, గౌరవ చైర్మన్‌గా మంచి ఉద్దేశంతో మేం నియమించుకునన్నాం. దయ ఉంచి మెగా స్నేహితులందరు ఈ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ సంస్థకు చిరంజీవి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు. అదేవిధంగా మా చిరు (సంస్థ) ప్రయత్నాన్ని ముందుకు నడిపించి పేద ప్రజలకు విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడానికి మీరు కూడా సహకరిస్తారని కొండంత అభిమానంతో’ అని సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. Press Release : #Chiranjeevi international schools not owned by Megastar Chiranjeevi or his family. The school in Srikakulam is running by a Mega Fan. pic.twitter.com/iEOPBflyQ3 — BARaju (@baraju_SuperHit) 13 May 2019 -
ఇంటర్నేషనల్ స్కూళ్లూ ‘ప్రైవేటుకే’
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రతిపనికి ప్రైవేట్ సంస్థల్నే ఆశ్రయిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు బాధ్యతను వారికే కట్టబెట్టనుంది. పేరుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటుకు నిర్ణయించినా, వాటిల్లో ప్రైవేట్ భాగస్వామ్యమే ఎక్కువగా ఉండనుంది. నర్సరీ నుంచి డిగ్రీ వరకూ ఉండే ఈ స్కూళ్లను తొలిదశలో విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ జిల్లా అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందిన 15 ఎకరాల్లో, నెల్లూరు జిల్లా బొడ్డువారిపాలెంలో 16.45 ఎకరాల్లో స్కూళ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పీపీపీ విధానంలో స్కూళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు భారీ స్థాయిలో రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ జిల్లాలో భూమిని 33 సంవత్సరాలు లీజుకు ఇవ్వనున్నారు. ఎకరానికి తొలుత రూ. లక్ష లీజుగా నిర్ధారించిన ప్రభుత్వం.. ఆరు సంవత్సరాలకోసారి పది శాతం చొప్పున లీజు పెంపు నిబంధన విధించింది. ఈ ఒప్పందంలో ప్రభుత్వ వాటా, ఆదాయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే స్కూలు ఫీజులన్నీ ప్రైవేట్ సంస్థలే నిర్ణయిస్తాయనే నిబంధనను చూస్తే.. ప్రైవేటుకే అధిక లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో రెసిడెన్షియల్ సదుపాయంతో పాటు, పలు రకాలైన క్రీడా మైదానాలు ప్రైవేటు సంస్థలే ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే నిబంధన కూడా ఉంది. పర్యాటకంలోనూ ‘పీపీపీ’ ఇక పర్యాటక ప్రాజెక్టులను కూడా పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ. 6,000 కోట్లు వ్యయంతో పలు ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రూ. 1,020 కోట్లతో ఎకో టూరిజం, రూ. 563 కోట్లతో బీచ్ టూరిజం, రూ. 1,265 కోట్లతో అడ్వెంచర్ అండ్ రిక్రియేషన్, రూ. 74 కోట్లతో హెరిటేజ్ టూరిజం ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. రూ. 781 కోట్లతో టెంపుల్ టూరిజం, రూ. 1,026 కోట్లతో బుద్ధిస్ట్ థీమ్ ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ ఆమోదం తెలిపేందుకే ఇటీవల ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్‌ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.