ఇంటర్నేషనల్ స్కూళ్లూ ‘ప్రైవేటుకే’ | AP Govt to set up PPP mode international schools | Sakshi
Sakshi News home page

ఇంటర్నేషనల్ స్కూళ్లూ ‘ప్రైవేటుకే’

Published Mon, Aug 3 2015 1:49 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

ఇంటర్నేషనల్ స్కూళ్లూ ‘ప్రైవేటుకే’ - Sakshi

ఇంటర్నేషనల్ స్కూళ్లూ ‘ప్రైవేటుకే’

సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రతిపనికి ప్రైవేట్ సంస్థల్నే ఆశ్రయిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు బాధ్యతను వారికే కట్టబెట్టనుంది. పేరుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటుకు నిర్ణయించినా, వాటిల్లో ప్రైవేట్ భాగస్వామ్యమే ఎక్కువగా ఉండనుంది. నర్సరీ నుంచి డిగ్రీ వరకూ ఉండే ఈ స్కూళ్లను తొలిదశలో విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

విశాఖ జిల్లా అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందిన 15 ఎకరాల్లో, నెల్లూరు జిల్లా బొడ్డువారిపాలెంలో 16.45 ఎకరాల్లో స్కూళ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పీపీపీ విధానంలో స్కూళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు భారీ స్థాయిలో రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విశాఖ జిల్లాలో భూమిని 33 సంవత్సరాలు లీజుకు ఇవ్వనున్నారు. ఎకరానికి తొలుత రూ. లక్ష లీజుగా నిర్ధారించిన ప్రభుత్వం.. ఆరు సంవత్సరాలకోసారి పది శాతం చొప్పున లీజు పెంపు నిబంధన విధించింది. ఈ ఒప్పందంలో ప్రభుత్వ వాటా, ఆదాయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే స్కూలు ఫీజులన్నీ ప్రైవేట్ సంస్థలే నిర్ణయిస్తాయనే నిబంధనను చూస్తే.. ప్రైవేటుకే అధిక లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో రెసిడెన్షియల్ సదుపాయంతో పాటు, పలు రకాలైన క్రీడా మైదానాలు ప్రైవేటు సంస్థలే ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే నిబంధన కూడా ఉంది.

పర్యాటకంలోనూ ‘పీపీపీ’
ఇక పర్యాటక ప్రాజెక్టులను కూడా పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ. 6,000 కోట్లు వ్యయంతో పలు ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రూ. 1,020 కోట్లతో ఎకో టూరిజం, రూ. 563 కోట్లతో బీచ్ టూరిజం, రూ. 1,265 కోట్లతో అడ్వెంచర్ అండ్ రిక్రియేషన్, రూ. 74 కోట్లతో హెరిటేజ్ టూరిజం ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు.

రూ. 781 కోట్లతో టెంపుల్ టూరిజం, రూ. 1,026 కోట్లతో బుద్ధిస్ట్ థీమ్ ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ ఆమోదం తెలిపేందుకే ఇటీవల ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్‌ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement