వృత్తివిద్యా కోర్సుల్లో.. సీట్లకు గరిష్ట పరిమితి | Maximum limit for seats In vocational courses | Sakshi
Sakshi News home page

వృత్తివిద్యా కోర్సుల్లో.. సీట్లకు గరిష్ట పరిమితి

Published Tue, Feb 11 2020 4:14 AM | Last Updated on Tue, Feb 11 2020 4:14 AM

Maximum limit for seats In vocational courses - Sakshi

సాక్షి, అమరావతి :ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తివిద్యా కోర్సులు నిర్వహించే కాలేజీల్లో గరిష్ట సీట్ల సంఖ్య ఇక నుంచి పరిమితం కానుంది. కోర్సుల వారీగా గరిష్ట సీట్ల సంఖ్యను నిర్ణయించిన జాతీయ సాంకేతిక విద్యా మండలి.. 2020–21 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానుంది. ప్రొఫెషనల్‌ కాలేజీలు కొన్ని డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో అత్యధిక సీట్లకు అనుమతులు తీసుకుంటున్నాయి. ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు పరిమితంగానే ఉన్నా అదనపు సెక్షన్లను కొనసాగిస్తూ విద్యార్థులకు బోధనను వాటితోనే సరిపెడుతున్నాయి. కానీ, మిగతా కాలేజీల్లో ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలున్నా వాటిలోని సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి.

డిమాండ్‌ ఉన్న కోర్సులపై తప్ప ఇతర కోర్సులపై ఆయా కాలేజీల యాజమాన్యాలు కూడా పెద్దగా శ్రద్ధ చూపడంలేదు. దీంతో కొన్ని కాలేజీల్లో సీట్లు 1,200 వరకు ఉండగా మరికొన్నిటిలో 200 నుంచి 300 వరకు మించి ఉండడంలేదు. ఈ నేపథ్యంలో 2020–21 విద్యా సంవత్సరం నుంచి కాలేజీల్లో కోర్సుల వారీగా సీట్ల సంఖ్యను నిర్దిష్ట గరిష్ట పరిమితిని విధించి ఆ మేరకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన హేండ్‌బుక్‌–2020–21లో దీన్ని పొందుపరిచింది.


కొత్త కోర్సులకు పెద్దపీట
కాగా, విద్యార్థుల్లో నూతన సాంకేతిక అంశాలను పెంపొందించడానికి కొత్త కోర్సులను కూడా కాలేజీల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఏఐసీటీఈ అభిప్రాయపడుతోంది. నేటి అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్లో సామర్థ్యాలు సంప్రదాయ కోర్సులతో కన్నా కొత్త కోర్సుల ద్వారానే సాధ్యమని ఏఐసీటీఈ స్పష్టంచేసింది. ఈ కారణంగానే సంప్రదాయ కోర్సుల్లో అదనపు సీట్లను ఇక నుంచి కేటాయించరాదని నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్త సాంకేతిక కోర్సుల వైపు విద్యా సంస్థలను మళ్లించనుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్‌ సాఫ్ట్‌వేర్, మొబిలిటీ, అనలైటిక్స్, క్లౌడ్‌ వంటి అంశాలు అత్యధిక డిమాండ్‌తో పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే నాస్‌కామ్, ఫిక్కి, బీసీజీ అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. దీంతో యూజీ, పీజీ కోర్సులు నిర్వహించే విద్యా సంస్థలు ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్సు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌తో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బ్లాక్‌చైన్, రోబోటిక్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్, డాటా సైన్సెస్, సైబర్‌ సెక్యూరిటీ 3డీ ప్రింటింగ్, డిజైన్, అగ్యుమెంటెడ్‌ రియాలిటీ, వరŠుచ్యవల్‌ రియాలిటీ అంశాలకు ప్రాధాన్యమివ్వాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement