Engineering Pharmacy Courses
-
కన్వీనర్ కోటాలో 70వేలకు పైగా సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీలో కన్వీనర్ కోటా ద్వారా కేటాయింపు జరిగే మొత్తం సీట్లు 70,030 అని, ఇందులో ఇంజనీరింగ్ 66,290 కాగా ఫార్మాసీ 3740 సీట్లు ఉన్నాయని టీఎస్ఎంసెట్ కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కన్వీనర్ కోటాలో సీట్ల కేటాయింపునకు విద్యార్థులు ఆప్షన్ల నమోదును ఈ నెల 16వ తేదీ (గురువారం) అర్ధరాత్రి 12 గంటల్లోగా పూర్తి చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. ఎంసెట్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేసుకున్న విద్యార్థులు 71,186 కాగా వారిలో ఇప్పటి వరకు 47,471 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకున్నట్లు ఆయన వివరించారు. మంచి కాలేజీల్లో సీట్లు రావడానికి ఒక విద్యార్థి ఎన్ని ఆప్షన్లు అయినా పెట్టుకోవచ్చని, ఈసారి ఒక విద్యార్థి కౌన్సెలింగ్ కోసం ఏకంగా 1,186 ఆప్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. 47,471 మంది మొత్తంగా 18,97,052 ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కోర్సుల వారీగా కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ఆయన వెల్లడించారు.. సీట్ల వివరాలు.. సీఎస్ఈ(16,801), ఈసీఈ(12,582), ఈఈఈ(6,366), సీఐవీ(5,766), ఎంఈసీ(5,355), సీఎస్ఎం(5,037), ఐఎన్ఎఫ్(4,713), సీఎస్డీ(3,003), సీఎస్సీ(1,638), సీఎస్ఓ(1,029), ఏఐడీ(420), ఎంఐఎన్(388), సీఎస్ఐ(336), ఏఐఎం(270), సీఎస్బీ(252), సీహెచ్ఈ(246), ఏఎన్ఈ(210), సీఎస్డబ్లు్య(210), ఈఐఈ(196), ఏఐ(126), సీఐసీ(126), ఈసీఎం(126), ఏయూటీ(84), సీఎస్ఎన్(84), ఎఫ్‌డీటీ(84), టీఈఎక్స్(80), డీటీడీ(60), ఎఫ్ఎస్పీ(60), ఎంఈటీ(60), బీఎంఈ(51), సీఎంఈ(42), సీఎస్జీ(42), సీఎస్టీ(42), ఈసీఐ(42), ఈటీఎం(42), ఎంసీటీ(42), ఎంఎంటీ(42), పీహెచ్ఈ(42), పీఎల్జీ(40), ఎంఎంఎస్(30), ఎంటీఈ(30), ఐపీఈ(28), ఏజీఆర్(24), బీఆర్జీ(22), బీఐఓ(21), పీహెచ్ఎం(3,220), పీహెచ్డీ(520) -
వృత్తివిద్యా కోర్సుల్లో.. సీట్లకు గరిష్ట పరిమితి
సాక్షి, అమరావతి :ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తివిద్యా కోర్సులు నిర్వహించే కాలేజీల్లో గరిష్ట సీట్ల సంఖ్య ఇక నుంచి పరిమితం కానుంది. కోర్సుల వారీగా గరిష్ట సీట్ల సంఖ్యను నిర్ణయించిన జాతీయ సాంకేతిక విద్యా మండలి.. 2020–21 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానుంది. ప్రొఫెషనల్ కాలేజీలు కొన్ని డిమాండ్ ఉన్న కోర్సుల్లో అత్యధిక సీట్లకు అనుమతులు తీసుకుంటున్నాయి. ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు పరిమితంగానే ఉన్నా అదనపు సెక్షన్లను కొనసాగిస్తూ విద్యార్థులకు బోధనను వాటితోనే సరిపెడుతున్నాయి. కానీ, మిగతా కాలేజీల్లో ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలున్నా వాటిలోని సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులపై తప్ప ఇతర కోర్సులపై ఆయా కాలేజీల యాజమాన్యాలు కూడా పెద్దగా శ్రద్ధ చూపడంలేదు. దీంతో కొన్ని కాలేజీల్లో సీట్లు 1,200 వరకు ఉండగా మరికొన్నిటిలో 200 నుంచి 300 వరకు మించి ఉండడంలేదు. ఈ నేపథ్యంలో 2020–21 విద్యా సంవత్సరం నుంచి కాలేజీల్లో కోర్సుల వారీగా సీట్ల సంఖ్యను నిర్దిష్ట గరిష్ట పరిమితిని విధించి ఆ మేరకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన హేండ్‌బుక్–2020–21లో దీన్ని పొందుపరిచింది. కొత్త కోర్సులకు పెద్దపీట కాగా, విద్యార్థుల్లో నూతన సాంకేతిక అంశాలను పెంపొందించడానికి కొత్త కోర్సులను కూడా కాలేజీల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఏఐసీటీఈ అభిప్రాయపడుతోంది. నేటి అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్లో సామర్థ్యాలు సంప్రదాయ కోర్సులతో కన్నా కొత్త కోర్సుల ద్వారానే సాధ్యమని ఏఐసీటీఈ స్పష్టంచేసింది. ఈ కారణంగానే సంప్రదాయ కోర్సుల్లో అదనపు సీట్లను ఇక నుంచి కేటాయించరాదని నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్త సాంకేతిక కోర్సుల వైపు విద్యా సంస్థలను మళ్లించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్, మొబిలిటీ, అనలైటిక్స్, క్లౌడ్ వంటి అంశాలు అత్యధిక డిమాండ్‌తో పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే నాస్కామ్, ఫిక్కి, బీసీజీ అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. దీంతో యూజీ, పీజీ కోర్సులు నిర్వహించే విద్యా సంస్థలు ముఖ్యంగా కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డాటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ 3డీ ప్రింటింగ్, డిజైన్, అగ్యుమెంటెడ్ రియాలిటీ, వరŠుచ్యవల్ రియాలిటీ అంశాలకు ప్రాధాన్యమివ్వాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. -
ఉద్రిక్తతల మధ్య ఎంసెట్ కౌన్సెలింగ్
* 19 కేంద్రాల్లో నిలిచిన తనిఖీ * విధులు బహిష్కరించిన పాలిటెక్నిక్ కళాశాలల సిబ్బంది * డిగ్రీ కళాశాలల్లో అడ్డుకున్న సమైక్యవాదులు * తొలి 15 వేల ర్యాంకర్లలో 5,742 మంది హాజరు * 30లోగా ఎవరు ఎక్కడైనా హాజరు కావచ్చు: విద్యామండలి ఛైర్మన్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన ఎంసెట్ వెబ్‌కౌన్సెలింగ్ సోమవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది. తెలంగాణలో ధ్రువపత్రాల తనిఖీ సజావుగా సాగినా.. సమైక్య ఉద్యమం నేపథ్యంలో సీమాంధ్రలోని 34 సహాయక కేంద్రాలకుగానూ 19 కేంద్రాల్లో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కేవలం 15 కేంద్రాల్లోనే సజావుగా సాగుతోంది. సీమాంధ్రలో ఉదయం 16 కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైనా.. సిబ్బంది విధులు బహిష్కరించటం, నిరసనకారులు అడ్డుకోవడంతో మధ్యాహ్నం 3 గంటల సమయానికి వీటిలో 7 కేంద్రాల్లో నిలిచిపోయింది. తరువాత తిరిగి 15 కేంద్రాల్లో ప్రక్రియ కొనసాగింది. తొలిరోజు 15 వేల మంది ర్యాంకర్లను పిలవగా రాత్రి 7 గంటల సమయానికి 5,742 మంది విద్యార్థులే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. సీమాంధ్రలోని 15 కేంద్రాల్లో 1896 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీమాంధ్రలో విధుల బహిష్కరణ సీమాంధ్రలోని 34 సహాయక కేంద్రాలకుగాను పాలిటెక్నిక్ కళాశాలల్లో 21 కేంద్రాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో 6, యూనివర్సిటీల్లో 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉదయం కేవలం 6 కేంద్రాల్లో మాత్రమే సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 3 గంటలకు వీటిలో ఒకటి పనిచేయడం ఆగిపోయింది. 15 పాలిటెక్నిక్ కళాశాలల్లో సిబ్బంది విధులు బహిష్కరించడంతో అవి ప్రారంభం కాలేదు. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీల్లోని సహాయక కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ను నిరసనకారులు అడ్డుకోవటంతో మధ్యాహ్నం వీటిలో కౌన్సెలింగ్ నిలిపివేశారు. చివరకు సాయంత్రం వీటిలో తిరిగి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఆలస్యం: హైదరాబాద్‌లో కొన్ని చోట్ల సాంకేతిక లోపంతో ఇబ్బందులు తలెత్తాయి. సిబ్బంది సమయానికి రాకపోవడంతో కొన్ని చోట్ల ధ్రువపత్రాల పరిశీలన ఆలస్యంగా ప్రారంభమైంది. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్, బాగ్‌లింగంపల్లిలోని అంబేద్కర్ కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడంతో గందరగోళం నెలకొంది. కనీస వసతులు కల్పించని అధికారుల తీరుపట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. నగరంలో ఆరు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐదు కేంద్రాల్లో 1వ ర్యాంక్ నుంచి 15 వేల ర్యాంకు వరకు సాధారణ అభ్యర్థులకు, మాసబ్‌ట్యాంక్‌లోని హెల్ప్‌లైన్ కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన, ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. తిరుపతిలో ఆగిన కౌన్సెలింగ్ తిరుపతిలో వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సమైక్యవాదులను పోలీసులు నిలువరించారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో కౌన్సెలింగ్‌కు 150 మంది హాజరుకాగా 8 మంది సర్టిఫికెట్లు మాత్రమే పరిశీలించారు. అనంతరం అధ్యాపకులు విధులను బహిష్కరించటంతో కౌన్సెలింగ్ నిలిచిపోయింది. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో భారీ భద్రత నడుమ కౌన్సెలింగ్ నిర్వహించారు. అడ్డుకోవటానికి ప్రయత్నించిన 8 మంది సమైక్యవాదులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ కర్నూలు, నంద్యాలలోనూ వాయిదా పడింది. వరంగల్‌లో కౌన్సెలింగ్‌కు హాజరైన నెల్లూరు విద్యార్థిని సీమాంధ్రలో ఆందోళనల నేపథ్యంలో నెల్లూరుకు చెందిన విద్యార్థిని సాయి హిమవర్షిణి వరంగల్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైంది. ఎంసెట్‌లో 994 ర్యాంక్ పొందిన ఈ విద్యార్థిని వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైంది. తన తండ్రి మధ్యప్రదేశ్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని సర్టిఫికెట్ల పరిశీలనకు నేరుగా అక్కడి నుంచే వచ్చినట్లు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అందరి ధ్రువపత్రాలు తనిఖీ చేశాకే సీట్ల కేటాయింపు సీమాంధ్రలోని పలు కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవమేనని, అయితే ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా చూస్తామని, అందరి సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ పూర్తయ్యాకే సీట్ల కేటాయింపు ఉంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు పేర్కొన్నారు. తొలిరోజు కౌన్సెలింగ్‌పై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘షెడ్యూలు ప్రకారం హాజరుకాలేని విద్యార్థులు ఈనెల 30లోగా ఎప్పుడైనా, ఏ కేంద్రంలోనైనా సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకావచ్చు. ఆ తరువాతే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఏడాదికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నాం. అధ్యాపకులతోపాటు అన్ని వర్గాల ప్రజలు కౌన్సెలింగ్‌కు సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఉన్నతవిద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, సాంకేతిక విద్య సంయుక్త సంచాలకులు మూర్తి, మండలి కార్యదర్శి డాక్టర్ సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ సమీక్షలో పాల్గొన్నారు.