
టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో జీసీసీల ఏర్పాటు అధికమవుతోంది. అసలు ఈ జీసీసీలు ఏమిటనే అనుమానం కొంతమందిలో ఉంది. జీసీసీలు ఏమిటి.. ఎందుకోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకుందాం. గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లుగా పిలువబడే ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీలు) బహుళజాతి సంస్థలు ఇతర దేశాల్లో స్థాపించే ప్రత్యేక వ్యాపార యూనిట్లు. ఈ కేంద్రాలు గ్లోబల్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, కంపెనీకి విలువను జోడించడానికి స్థానిక ప్రతిభను, నైపుణ్యాలను, మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తాయి. జీసీసీలు ఏర్పడకముందు కూడా ఇలాంటి విధానం అమల్లో ఉండేది. గతంలో ఔట్ సోర్సింగ్ కోసం బ్యాక్ ఆఫీసులను ఏర్పాటు చేసి వివిధ పరిశ్రమల్లో ఇన్నోవేషన్ హబ్‌లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లుగా కార్యకాలాపాలు సాగించేవి. క్రమంగా అవి జీసీసీలుగా మారాయి.
ఎందుకోసం అంటే..
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్‌లో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ) విభాగంలో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో ఆవిష్కరణలకు దోహదం చేస్తాయి. ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ వంటి కీలకమైన బిజినెస్ విధులను నిర్వహిస్తాయి. గ్లోబల్ క్లయింట్‌లకు అధిక క్వాలిటీ కస్టమర్ సర్వీస్, టెక్నికల్ సపోర్ట్‌ను అందిస్తాయి. కొన్ని జీసీసీలు వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలతో సహా స్థిర ఇంధన పద్ధతులపై దృష్టి పెడుతున్నాయి.
ఈ నగరాలు ముందంజలో..
నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, సహాయక విధానాలు, స్థానిక ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, అధునాతన మౌలిక సదుపాయాల కారణంగా బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి నగరాలు ముందంజలో ఉండటంతో జీసీసీలకు గ్లోబల్ హబ్‌గా మారుతున్నాయి. వివిధ విభాగాల్లో సృజనాత్మకతను జోడించడంలో, ప్రపంచ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో జీసీసీల సాంకేతిక అభివృద్ధి పాత్ర కీలకంగా మారుతుంది.
సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్
వివిధ పరిశ్రమల కోసం ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్లు, అప్లికేషన్స్ అభివృద్ధి చేయడంలో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కేంద్రాలు తరచుగా నిర్దిష్ట వ్యాపార అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను సృష్టించడంలో తోడ్పడుతాయి.
ఏఐ, మెషిన్ లెర్నింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ ఆవిష్కరణల్లో జీసీసీలు ముందంజలో ఉన్నాయి. ప్రిడిక్టివ్ అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ రికగ్నిషన్, అటానమస్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి అల్గారిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను రూపొందిస్తారు. ఉదాహరణకు, జీసీసీలు సంభాషణాత్మక ఏఐ టూల్స్, కస్టమర్ సర్వీస్ చాట్ బాట్‌లను అభివృద్ధి చేస్తున్నాయి.
క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ
కొన్ని జీసీసీలు క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రత్యేకత కలిగి ఉంటాయి. సంస్థల డేటాను సమర్థవంతంగా నిల్వ చేయడానికి, నిర్వహించడానికి, ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తాయి. సెక్యూరిటీ థ్రెట్స్ నుంచి డేటాను, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కాపాడటంపై దృష్టి సారిస్తాయి.
ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)
ఈ కేంద్రాలు తరచుగా ఐఓటీ సంబంధిత ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తాయి. డేటాను సేకరించి ప్రాసెస్ చేయగల స్మార్ట్ పరికరాలను, అందుకు అవసరమయ్యే వ్యవస్థలను సృష్టిస్తాయి. స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీల నుంచి ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్ కేర్ సొల్యూషన్స్ వరకు దాదాపు అన్ని రంగాల్లో డిజిటల్ అప్లికేషన్లను తయారు చేస్తాయి.
రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్
బ్లాక్ చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆగ్మెంటెడ్/ వర్చువల్ రియాలిటీ (ఏఆర్/వీఆర్) వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో పరిష్కారాలను అన్వేషించడానికి టెక్నాలజీ ఆధారిత జీసీసీలు ఆర్ అండ్ డీలో భారీగా పెట్టుబడులు పెడుతాయి. భవిష్యత్తు వ్యాపారాలపై ప్రయోగాలు, ఆవిష్కరణలు చేసేందుకు తోడ్పడుతాయి.
ఖర్చు నిర్వహణ
భారతదేశంలో చౌకగా మానవవనరుల లభ్యత ఉంటుందనే అభిప్రాయలున్నాయి. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా బహుళజాతి సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను ఆప్టిమైజ్ చేసుకోవడానికి జీసీసీలు వీలు కల్పిస్తాయి. ఇది కంపెనీలు పరిశోధన, అభివృద్ధిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: ఇంటి అద్దెలు పెరుగుతాయ్..?
టాలెంట్ డెవలప్‌మెంట్
శ్రామిక శక్తిని పెంచడం, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను తిరిగి నేర్పించడంలో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతాయి. ప్రపంచ డిమాండ్లను తీర్చడానికి నైపుణ్యం కలిగిన నిపుణులను సరఫరా చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment