
ప్రకటనల్లో సాంప్రదాయ మాధ్యమాలను దాటి ముందుకు
అడ్వర్టైజింగ్ బడ్జెట్లలో టాప్‌లో సోషల్ మీడియా, ఆన్‌లైన్ వీడియోలు, పెయిడ్ సెర్చ్‌లు
కొన్నాళ్ల క్రితం వరకు ప్రకటనలంటే పత్రికలు, టీవీలు, రేడియోల్లాంటి సాంప్రదాయ మాధ్యమాలకే పరిమితమయ్యేవి. ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత నెమ్మదిగా డిజిటల్ వైపు మళ్లడం మొదలైంది. ఇక అందరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తుండటం, డేటా చౌకగా లభిస్తుండటంలాంటి అంశాల కారణంగా ఇది మరింతగా జోరందుకుంది. ఎంత లా అంటే .. అడ్వర్టైజింగ్ సంస్థలు తమ బడ్జెట్‌లో దాదాపు సగభాగాన్ని డిజిటల్‌కే కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరు నాటికి దేశీయంగా డిజిటల్ అడ్వర్టైజింగ్ విభాగం, సాంప్రదాయ మాధ్యమాలకు మించి ఏకంగా రూ. 62 వేల కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి.
అడ్వర్టైజింగ్ పరిశ్రమలో డిజిటల్ మీడియా చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. నగరాలు మొదలుకుని గ్రామాల వరకు ఇది అసాధారణ స్థాయిలో విస్తరిస్తోంది. దీంతో డిజిటల్ యూజర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. సాం ప్రదాయ మీడియాని మించి డిజిటల్‌పై భారీగా వెచ్చిస్తున్నాయి. అంతర్జాతీయ అడ్వర్టైజింగ్ దిగ్గజం డెంట్సు నివేదిక ప్రకారం.. దేశీఅడ్వర్టైజింగ్ పరిశ్రమ ప్రస్తుతం రూ. 93,166 కోట్లుగా ఉంది.
2025 ఆఖరు నాటికి ఇది సుమారు మరో 10 శాతం పెరిగి రూ. 1,12,453 కోట్లకు చేరుతుందని అంచనా. 2022లోలో రూ. 40,685 కోట్లుగా ఉన్న డిజిటల్ విభాగం ఈ ఏడాది ఆఖరుకల్లా రూ. 62,045 కోట్లకు.. అంటే మొత్తం అడ్వర్టైజింగ్ బడ్జెట్లలో సగానికి పైగానే వాటా దక్కించుకునే అవకాశం ఉంది. గతేడాది విషయం తీసుకుంటే 44 శాతం వాటాతో డిజిటల్ అగ్రస్థానంలో ఉండగా, టీవీ 32 శాతం, ప్రింట్ మీడియా 20% వాటాతో తర్వాత స్థానాల్లో నిల్చాయి. ఏఐలాంటి టెక్నాలజీ ఊతంతో టార్గెట్ ఆడియన్స్‌ను సరిగ్గా చేరుకునే వెసులుబాటు ఉండటం డిజిటల్‌కి సానుకూలాంశంగా ఉంటోంది.
టెలికం అత్యధిక కేటాయింపులు..
టెలికం రంగ సంస్థలు తమ మీడియా బడ్జెట్లలో 64 శాతం భాగాన్ని డిజిటల్‌కి కేటాయిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్ తమ బడ్జెట్లలో 94 శాతం భాగాన్ని డిజిటల్, టీవీ మాధ్యమాలకు కేటాయిస్తోంది. సాంప్రదాయ అడ్వర్టైజర్లే కాకుండా, డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్లు, స్టార్టప్‌లు మొదలైనవి ఎక్కువగా ఆన్‌లైన్ ప్రకటనలపైనే దృష్టి పెడుతున్నాయి. క్విక్–కామర్స్, ఈ–కామర్స్, విద్యా రంగ సంస్థల్లాంటివి మరింతగా కస్టమర్లకు చేరువయ్యేందుకు డిజిటల్ మాధ్యమాల మీదే ఆధారపడుతున్నాయి. షార్ట్ వీడియోలు, సోషల్ కామర్స్‌లపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల డిజిటల్ బడ్జెట్లూ ఎక్కువగానే ఉంటున్నాయి. దేశీయంగా డిజిటల్ విప్లవం ప్రజల జీవితాలు, పరిశ్రమలు, సమాజంలో పెను మార్పులు తీసుకొస్తోందని, కృత్రిమ మేథ కూడా ఇందుకు దోహదపడుతోందని డెంట్సు దక్షిణాసియా సీఈవో హర్ష రజ్దాన్ చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవీయ కోణానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియా హవా...
డిజిటల్ మీడియా కేటగిరీలో చూస్తే 30% వాటాతో (రూ. 11,962 కోట్లు) సోషల్ మీడియా అగ్రస్థానంలో ఉండగా, ఆన్‌లైన్ వీడియోలు 29%, పెయిడ్ సెర్చ్ 23% వాటా దక్కించుకున్నాయి. టెలికం కంపెనీలు తమ డిజిటల్ మీడియా బడ్జెట్లో 80% భాగాన్ని ఆన్‌లైన్ వీడియో, సోషల్ మీడియా, పెయిడ్ సెర్చ్‌లకు కేటాయిస్తున్నాయి. ఈ–కామర్స్ కంపెనీలైతే తమ మొత్తం మీడియా బడ్జెట్లో 61 శాతాన్ని డిజిటల్ మీడియాకు కేటాయిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ అదే తీరు..
తెలుగు రాష్ట్రాల్లోనూ డిజిటల్, సోషల్ మీడియా ప్రకటనలు జోరుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వీటికి భారీగానే బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. రాజకీయేతర డిజిటల్ ప్రకటనల వ్యయాలపై నిర్దిష్ట డేటా లేకపోయినప్పటికీ గత కొన్నాళ్లుగా, చాలా వేగంగా వృద్ధి చెందుతోందని ఓటీఎస్ అడ్వర్టైజింగ్ అకౌంట్ డైరెక్టర్ సాయి సిద్ధార్థ్ నల్లూరి తెలిపారు. దక్షిణాదివ్యాప్తంగా 2020 నాటి నుంచి గణాంకాలు చూస్తే డిజిటల్ అడ్వర్టైజింగ్ 30 శాతం వృద్ధి రేటు కనపర్చిందని చెప్పారు. విద్య తదితర రంగాలు డిజిటల్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని, ఈ సేవల కోసం స్పెషలైజ్డ్ ఏజెన్సీలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత సాంప్రదాయ మీడియాపై ప్రకటనల వ్యయాలు తగ్గాయని వివరించారు.
– సాక్షి, బిజినెస్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment