Advertising Agency
-
ఫేస్బుక్ ఇండియా లాభం ఎలా ఉందంటే..
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు చెందిన అడ్వర్టయిజ్మెంట్ యూనిట్ ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ టోఫ్లర్ వివరాల ప్రకారం నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ.505 కోట్లను తాకింది.టోఫ్లర్ తెలిపిన వివరాల ప్రకారం..ఫేస్బుక్ ఇండియా 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.353 కోట్ల నికర లాభం మాత్రమే ఆర్జించింది. కానీ 2023-24 ఏడాదిలో ఇది 43 శాతం పెరిగి రూ.505 కోట్లను తాకింది. కంపెనీ దేశీయంగా అడ్వర్టయిజింగ్ ఇన్వెంటరీని కస్టమర్లకు విక్రయించే సర్వీసులతోపాటు మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్‌కు ఐటీ ఆధారిత సపోర్ట్, డిజైన్ సపోర్ట్ సేవలు సైతం అందిస్తోంది. కాగా..2023-24లో టర్నోవర్ 9 శాతంపైగా ఎగసి రూ.3,035 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ.2,776 కోట్ల ఆదాయం నమోదైంది.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!ఫేస్బుక్ ఇండియా విభాగంలో దాదాపు 2,500 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్, సపోర్ట్ సర్వీస్..వంటి విభిన్న విభాగాల్లో సేవలందిస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా మెటా ప్లాట్‌ఫామ్స్ సుమారు 67,317 మందికి ఉపాధి కల్పిస్తుంది. -
ది అడ్వర్టైజింగ్ క్లబ్ చైర్మన్‌గా రానా బారువా
అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, మీడియా పరిశ్రమకు చెందిన అపెక్స్ బాడీ అడ్వర్టైజింగ్ క్లబ్ నూతన మేనేజింగ్ కమిటీని ప్రకటించింది. తమ 69వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2023-2034 సంవత్సరానికి సంబంధించి హవాస్ ఇండియా గ్రూప్ సీఈవో రానా బారువాను అధ్యక్షునిగా నియమించింది. మాజీ అధ్యక్షుడు పార్థ సిన్హా మేనేజింగ్ కమిటీ సభ్యునిగా కొనసాగనున్నట్లు అడ్వర్టైజింగ్ క్లబ్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. తన నియామకం గురించి.. రానా బారువా మాట్లాడుతూ, “దాదాపు 70 చరిత్ర కలిగిన సంస్థ ది యాడ్ క్లబ్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కొత్త తరం, ఔత్సాహికులకు మెరుగైన సేవలు అందిచాలనేది తమ లక్ష్యమని.. ఇందుకోసం వివిధ రంగాల్లో వైవిధ్యమైన లీడర్స్ అపరిమిత అవకాశాల్ని, సేవల్ని అందించేందుకు తమ ఉత్తమమైన మేనేజ్మెంట్ టీమ్‌తో కలిసి ముందుకెళ్తామన్నారు. ఇండస్ట్రీలోని కొత్త ప్రతిభను ఆకర్షించడానికి, మహిళా సాధికారతకు, భవిష్యత్తు నాయకులను ప్రోత్సహించడం, వైవిధ్యాన్ని అభివృద్ధి చేయడం, ఈక్విటీ, చేరికలను పెంచేందుకు ప్రగతిశీల పొత్తులు, సంభాషణలను ప్రోత్సహించడానికి తామంతా కలిసి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి కట్టబడి ఉంటామని చెప్పారు. అడ్వర్టైజింగ్ క్లబ్ ఆఫీస్ బేరర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు ► రానా బారువా - అధ్యక్షుడు ►ధీరజ్ సిన్హా - ఉపాధ్యక్షుడు ►డాక్టర్ భాస్కర్ దాస్ - కార్యదర్శి ►శశి సిన్హా - జాయింట్ కార్యదర్శి ►మిత్రజిత్ భట్టాచార్య - కోశాధికారి మేనేజింగ్ కమిటీ సభ్యులు ►అవినాష్ కౌల్ ►మాల్కం రాఫెల్ ►ప్రశాంత్ కుమార్ ►పునీత ఆరుముగం ►శుభ్రాంశు సింగ్ ►సోనియా హురియా ► సుబ్రహ్మణ్యేశ్వర సమయం కో-ఆప్టెడ్ పరిశ్రమ నిపుణులు ►అజయ్ కాకర్ ►ప్రదీప్ ద్వివేది ►విక్రమ్ సఖుజా డ్వర్టైజింగ్ క్లబ్‌ను మరింత ముందుకు నడిపేందుకు ప్రతిభ నైపుణ్యం, సంబంధిత విభాగాల్లో లోతైన అనుభవం ఆధారంగా ఎంపికైన మరికొంత మంది వ్యక్తులు ► అజయ్ చాంద్వానీ ► అలోక్ లాల్ ► అనూషా శెట్టి ► లులు రాఘవన్ ► మన్షా టాండన్ ►నిషా నారాయణన్ ►రాజ్ నాయక్ ►సత్యనారాయణ రాఘవన్ ►వికాస్ ఖంచందాని -
తప్పుదోవ పట్టించే ప్రకటనలు వద్దు
న్యూఢిల్లీ: వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా తమ ప్రకటనలు ఉండకుండా చూసుకోవాలని తయారీ సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటనకర్తలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలకు కేంద్రం సూచించింది. ఇటు వ్యాపార, అటు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని పేర్కొంది. ముంబైలో నిర్వహించిన అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు సూచనలు చేశారు. వినియోగదారులకు వెల్లడించాల్సిన కీలక వివరాలను (డిస్క్లోజర్లు) హ్యాష్‌ట్యాగ్‌లు లేదా లింకుల రూపంలో కాకుండా ప్రకటనల్లోనే ప్రముఖంగా కనిపించేలా జాగ్రత్తలు తీసు కోవాలని పేర్కొన్నారు. వీడియోల్లోనైతే డిస్క్లోజర్లను ఆడియో, వీడియో ఫార్మాట్లలో చూపాలని, లైవ్ స్ట్రీమ్‌లలోనైతే ప్రముఖంగా కనిపించేలా, నిరంతరాయంగా చూపాలని సింగ్ చెప్పారు. 50 కోట్ల మంది పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్రకటనల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తమ విశ్వసనీయతపై ప్రభా వం చూపేలా ప్రకటనకర్తలతో తమకు ఏవైనా లావాదేవీలు ఉంటే ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వాటిని వెల్లడించాలని సింగ్ తెలిపారు. -
ప్రకటనలపై వ్యయాలు 15 శాతం అప్
ముంబై: దేశీయంగా ఈ ఏడాది ప్రకటనలపై వ్యయాలు 15.5% పెరిగి రూ. 1.46 లక్షల కోట్లకు చేరనున్నాయి. 2021తో పోలిస్తే 2022లో పరిశ్రమ 15.7 శాతం వృద్ధి చెందిందని అంచనాలు నెలకొన్నాయి. మీడియా ఏజెన్సీ గ్రూప్ఎం ఈ అంచనాలను వెలువరించింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న టాప్ 10 మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉండనుందని, అడ్వర్టైజింగ్పై వెచ్చించే వ్యయాల విషయంలో ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంటుందని గ్రూప్ఎం వివరించింది. స్థూల ఆర్థిక అస్థిరతలు, అంతర్జాతీయ పరిణామాలు గత మూడేళ్లుగా ప్రకటనకర్తల వ్యాపారాలు, అడ్వర్టైజింగ్ వ్యయాలపై ప్రభావం చూపాయని సంస్థ సీఈఓ (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. 2023లో ప్రకటనల వ్యయాలకు టెలికం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు.. బీమా, రిటైల్, ఫిన్‌టెక్, గేమింగ్, ట్రావెల్, పర్యాటకం మొదలైన విభాగాల నుంచి ఊతం లభిస్తుందని గ్రూప్ఎం బిజినెస్ ఇంటెలిజెన్స్ హెడ్ పర్వీన్ షేక్ చెప్పారు. ఈ ఏడాది గ్రామీణ ఎకానమీ కూడా పుంజుకోగలదన్నారు. టాప్ మెట్రోలను దాటి ఇతర ప్రాంతాలకూ 5జీ సేవలు విస్తరిస్తుండటం, స్మార్ట్ఫోన్లు చౌకగా లభిస్తుండటం తదితర అంశాలూ ప్రకటనకర్తలు అడ్వర్టైజింగ్పై మరింతగా వెచ్చించేందుకు దోహదపడగలవన్నారు. డిజిటల్‌దే పైచేయి.. గ్రూప్ఎం అంచనాల ప్రకారం మొత్తం ప్రకటన వ్యయాల్లో సింహభాగం వాటా డిజిటల్ మీడియాదే ఉండనుంది. అత్యంత వేగంగా 20 శాతం వృద్ధితో ఏకంగా 56 శాతానికి చేరనుంది. టీవీ మాధ్యమం వాటా మాత్రం స్వల్పంగా 31 శాతం నుంచి 30 శాతానికి తగ్గనుంది. ప్రింట్ మాధ్యమంలో ప్రకటనలపై వ్యయాలు మరింతగా తగ్గి 11 శాతం (2022లో) నుంచి ఈ ఏడాది 10 శాతానికి పరిమితం కానున్నాయి. విలువపరంగా మాత్రం ప్రింట్లో ప్రకటనలు రూ. 13,519 కోట్ల నుంచి రూ. 14,520 కోట్లకు పెరగనున్నాయి. -
క్రిప్టో కరెన్సీ.. ఇది చాలా రిస్క్ గురూ!
ముంబై: క్రిప్టో కరెన్సీలు, నాన్–ఫంజిబుల్ టోకెన్ల ప్రకటనలకు సంబంధించి అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలి ఏఎస్సీఐ మార్గదర్శకాలు ప్రకటించింది. వీటి ప్రకారం ఇకపై ఈ సాధనాల ప్రకటనల్లో ఇవి ‘అవ్యవస్థీకృతమైనవి, అత్యధిక రిస్కులకు అవకాశమున్నవి‘ అని పేర్కొనడం తప్పనిసరి కానుంది. ఇలాంటి లావాదేవీల వల్ల నష్టం వాటిల్లితే నియంత్రణ సంస్థలపరంగా పరిష్కార మార్గాలేమీ ఉండకపోవచ్చని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. క్రిప్టోలుగా వ్యవహరించే అన్ని వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ), నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ)కు ఇవి వర్తిస్తాయి. వివాదాస్పద క్రిప్టో సాధనాలు, సర్వీసుల ప్రకటనలు మార్కెట్‌ను ముంచెత్తుతున్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వం, ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు ఏఎస్సీఐ తాజా గైడ్‌లైన్స్ రూపొందించింది. ఈ అసెట్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఇంకా చట్టమేదీ చేయకపోయినప్పటికీ.. వీటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద పన్ను వేయాలని మాత్రం ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఓవైపు క్రిప్టోలను పూర్తిగా నిషేధించాలని ఆర్బీఐ పట్టుబడుతుండగా మరోవైపు ప్రభుత్వం మాత్రం పన్ను విధించాలని ప్రతిపాదించడం అనేది వీటికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నంగా భావించవచ్చని పరిశ్రమ చెబుతోంది. నిబంధనలు.. ► ప్రింట్ ప్రకటనల్లో అయిదో వంతు స్థలాన్ని డిస్‌క్లెయిమర్ కోసం కేటాయించాలి. వీడియో ప్రకటన అయితే, ఆఖర్లో సాదా బ్యాక్‌గ్రౌండ్‌పై టెక్ట్స్‌ను సాధారణ వేగంతో వాయిస్ ఓవర్ ద్వారా చెప్పాల్సి ఉంటుంది. వీడియో యాడ్లలో కనీసం అయిదు సెకన్ల పాటైనా చూపాలి. అదే రెండు నిమిషాలు పైగా సాగే ప్రకటనల్లోనైతే యాడ్ ప్రారంభం కావడానికి ముందు, ఆ తర్వాత ఆఖర్లోనూ చూపాలి. ఆడియో, సోషల్ మీడియా పోస్టులు మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది. ► కరెన్సీ, సెక్యూరిటీలు, కస్టోడియన్, డిపాజిటరీలు మొదలైన పదాలన్నీ నియంత్రణ సంస్థ పరిధిలోని ఉత్పత్తులుగా ప్రజలు భావించే అవకాశం ఉన్నందున వీడీఏ సాధనాలు లేదా సర్వీసుల ప్రకటనల్లో అడ్వర్టైజర్లు వీటిని వాడకూడదు. ► ఆయా సాధనాలకు సంబంధించి గత పనితీరు గురించి పాక్షికంగా కూడా చూపకూడదు. మైనర్లతో యాడ్స్ తీయకూడదు. ► భవిష్యత్తులో కచ్చితంగా లాభాలు పెరుగుతాయనే హమీ ఇచ్చే పదజాలం వాడకూడదు. ► వీడిఏ సాధనాల్లోని రిస్కులను తగ్గించి చూపే విధంగా ప్రకటనలు ఉండకూడదు. అలాగే నియంత్రిత అసెట్స్‌తో పోల్చి చూపకూడదు. ► వినియోగదారులు తప్పుదోవ పట్టకుండా చూసే క్రమంలో.. యాడ్స్‌లో నటించే సెలబ్రిటీలూ ప్రకటనల్లో చెప్పే విషయాల గురించి క్షుణ్నంగా తెలుసుకుని వ్యవహరించాలి. -
డిజిటల్ అడ్వర్టయిజింగ్ మార్కెట్‌పై.. విదేశీ పెత్తనం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలంలో కాటన్ ఎగుమతి చేసి బట్ట లు దిగుమతి చేసుకునేవాళ్లమని పెద్దలు చెబుతుంటారు. ఇదే తరహాలో మన దేశం ఒక విచిత్ర సమస్య ఎదుర్కొంటోంది. మనం సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ప్లాట్‌ఫామ్‌లు మనమే క్రియేట్ చేసి ఇస్తున్నాం. కంటెంట్ మనదే. పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులు మనవాళ్లే. ప్రకటనలపై వెచ్చించేది మనవాళ్లే. ఆదాయం మాత్రం.. ఈ ప్రకటనలను సమీకరించి ప్రచురణకు ఇస్తున్న విదేశీ డిజిటల్ యాడ్స్ ఏజెన్సీలది. మనకు గూగుల్ కేవలం ఒక సెర్చ్ ఇంజిన్‌గా మాత్రమే తెలుసు. కానీ దీని ప్రధాన ఆదాయ వనరు డిజిటల్ యాడ్స్. కం పెనీల నుంచి యాడ్స్ తీసుకోవడం, డిజిటల్ పబ్లిషర్స్‌కు ప్రచురించేందుకు ఇవ్వడం. దీని ద్వారా డిజిటల్ పబ్లిషర్స్‌కు కొంత ఇవ్వడం, అది కొంత వాటా తీసుకోవడం. ఫేస్బుక్ మనకు కేవలం సోషల్ మీడియాగానే తెలుసు. కానీ మనం ఒక యాడ్ ఇవ్వాలనుకున్నా, ఒక పోస్ట్ చాలా మందికి చేరాల నుకున్నా మనం డబ్బులు వెచ్చించాలి. అంటే కేవలం తన సోషల్ మీడియా యాప్‌లోనే యాడ్స్ ప్రచురించి సొమ్ము చేసు కుంటుంది. యూజర్స్ మనమే. డబ్బులు వెచ్చించేది చాలావరకు భారతీయ కంపెనీలే. చూసేది మనమే. క్లిక్ చేసేది మనమే. ఆయా యాప్‌లను నిర్మించింది, నిర్మించే సత్తా ఉంది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే. ఈ యాప్‌లు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నాయి. కానీ మన పబ్లిషర్లకు పెద్దగా మిగిలిందేమీ లేదు. చైనా యాప్స్ బ్యాన్ ప్రభావం ఎలా ఉండబోతోంది.. 59 చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడం, వోకల్ ఫర్ లోకల్ పిలుపు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఇండియా డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ రంగం స్వదేశీ కంపెనీలను ఆకర్షిస్తోంది. 80 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్న దేశంలో ప్రకటనలను సమీకరించి ప్రచురణకు ఇచ్చే డిజిటల్ ఏజెన్సీలకు, స్వదేశీ సోషల్ మీడియా యాప్‌లకు, ఆన్లైన్ వీడియో యాప్‌లకు, స్వదేశీ ఓటీటీలకు భారీ అవకాశాలు ముందున్నాయి. అలాగే స్వదేశీ బ్రౌజర్లు, స్వదేశీ న్యూస్ అగ్రిగేటర్లు, స్వదేశీ న్యూస్ యాప్‌లకు బోలెడు అవకాశాలు ఆహ్వానం పలుకనున్నాయి. కంటెంట్, యూజర్లు, ప్రకటనలకు కొదవలేనందున ప్లాట్‌ఫామ్‌లు కూడా స్వదేశీ అయితే దేశ ఆర్థిక వృద్ధిలో అవీ భాగమవుతాయి. డెంట్సూ నివేదిక ఏం చెప్పింది? గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, టిక్‌టాక్ యాడ్స్(టిక్‌టాక్ యాప్‌ను కేంద్రం బ్యాన్ చేసింది) ఇలాంటి డిజిటల్ యాడ్ ఏజెన్సీల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో డెంట్సూ ఏజిస్ నెట్వర్క్(డీఏఎన్) తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం డిజిటల్ అడ్వర్టయిజింగ్ ఇండస్ట్రీ 2019–20 నాటికి రూ. 13,683 కోట్ల టర్నోవర్‌తో ఉంది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 26 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2020–21 నాటికి ఇది రూ.17 వేల కోట్లకు చేరనుంది. అలాగే 2022 నాటికి డిజిటల్ అడ్వర్టయిజింగ్ ఇండస్ట్రీ రూ.28,249 కోట్లకు, 2025 నాటికి రూ.58,550 కోట్లకు చేరనుంది. కాగా ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల ఇండస్ట్రీ టర్నోవర్ మొత్తం మన దేశంలో రూ.68,475 కోట్లు ఉండగా.. 2025 నాటికి రూ.1,33,921 కోట్లకు చేరనుంది. ఈ రంగం ఏటా 11 శాతం వృద్ధి సాధిస్తుండగా.. డిజిటల్ యాడ్స్ రంగం మాత్రం ఏటా 27.42 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకోనుందని డెంట్సూ ఏజిస్ నెట్వర్క్(డీఏఎన్) తన నివేదికలో తెలిపింది. దూసుకుపోతున్న మొబైల్ యాడ్ మార్కెట్ చవకైన డేటా ప్లాన్స్, స్మార్ట్ ఫోన్ల అందుబాటు కారణంగా డిజిటల్ యాడ్స్‌పై వెచ్చించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. డిజిటల్ అడ్వర్టయిజింగ్ మార్కెట్లలో మొబైల్ యాడ్స్‌పై వెచ్చించే మొత్తం ప్రస్తుతం 40 శాతం ఉంది. అది ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 52 శాతానికి చేరనుంది. మిలీనియల్స్‌ను దృష్టిలోపెట్టుకుని అడ్వర్టయిజ్మెంట్లపై కంపెనీలు వెచ్చించడం ఇటీవల పెరిగింది. యువత వీటిపై రోజుకు సగటున 2.5 గంటలు వెచ్చిస్తున్నట్టు డీఏఎన్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్, టిక్‌టాక్, ఫేస్బుక్, షేర్‌చాట్, రొపోసో వంటి సోషల్ మీడియా యాప్స్ నిండా మిలీనియల్స్‌ను దృష్టిలో పెట్టుకుని కంటెంట్ ఉంటుంది. అలాగే మ్యూజిక్ యాప్‌లు, యూట్యూబ్ వీడియోలు.. ఇలా డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్లకు వేదికగా మారాయి. డిజిటల్ అడ్వర్జయిమెంట్ వ్యయం సోషల్ మీడియాపై 28 శాతం ఉండగా.. పెయిడ్ సెర్చ్‌పై 25 శాతం, ఆన్లైన్ వీడియోపై 22 శాతం ఉంది. ఆన్లైన్ వీడియోలపై వెచ్చించే డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ల వృద్ధిరేటు 32 శాతంగా ఉంది. -
తొలిసారిగా రీజినల్ యాడ్ ఏజెన్సీలకు అవార్డ్స్
-
బోర్డు తిప్పేశారు
► ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రూ.2 కోట్లకు కుచ్చుటోపీ ► రెండు నెలలుగా సంస్థ కార్యాలయానికి తాళం ► లబోదిబోమంటున్న బాధితులు సాక్షి, కర్నూలు: ‘‘షోరూమ్, రెస్టారెంట్, షాపు, సెలూన్.. ఏదైనా పర్వాలేదు.. అందులో మా కంపెనీకి చెందిన ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేసుకోండి.. నెలకు రూ. 5వేలు అద్దెగా పొందండి’’ ... ఈ ప్రకటన చదివిన వారెవరైనా అబ్బా ఇదేదో మంచి అవకాశం.. షాపులో ఉంటూ ఏం చక్కా ప్రతినెలా రూ. 5వేలు సంపాదించొచ్చు అని ఎగిరి గంతేస్తారు. మన జిల్లాలో వారూ ఇలాగే చేశారు. కంపెనీ షరతులను అంగీకరించి.. వారికి డిపాజిట్ చెల్లించారు. తక్షణమే ఆ కంపెనీ టీవీలు తెచ్చి వారి షాపుల్లో అమర్చింది. రెండు నెలలు అద్దె డబ్బులు వచ్చాయి. మూడో నెల నుంచి అదిగో.. ఇదిగో అంటూ చివరకు చేతులెత్తేశారు. ఇలా డిపాజిట్ రూపంలో సేకరించిన కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన ఓ అడ్వటైజింగ్ ఏజెన్సీ నిర్వాకం ఇది. ఇదీ కథ.. అడిటస్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.. హైదరాబాద్ ఏఎస్రావు నగర్ కేంద్రంగా పనిచేస్తోంది. డిజిటల్ యాడ్స్‌కు బ్రాండింగ్ చేయడమే ఈ సంస్థ పని. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ మన జిల్లాకు సంబంధించి కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని యూ కాన్ కాంప్లెక్స్‌లో ఆరునెలల క్రితం కార్యాలయాన్ని ప్రారంభించింది. ‘సంస్థకు చెందిన ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేసుకుని.. ప్రతి రోజూ ఉద యం నుంచి సాయంత్రం వరకు(టీవీ ఆయా వ్యాపార సంస్థల యాడ్స్ వస్తుంటాయి) 9 గంటలపాటు ఆన్‌చేసి ఉంచితే చాలు ప్రతినెలా రూ. 5 వేల అద్దె చెల్లిస్తాం’ అంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో కర్నూలు నగరంతోపాటు ఆదోని, నంద్యాల పట్టణాల్లోని వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న యువకులు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా మొబైల్ షాపులు, టిఫిన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు, ఆటో మొబైల్ షాపులు, హాస్పిటల్స్, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు వీరి వలలో పడ్డారు. టీవీ ఏర్పాటు చేయాలంటే అడ్వాన్స్‌గా రూ. 40 వేలు చెల్లించాలని సంస్థ పెట్టిన షరతు మేరకు డీడీలు చెల్లించి టీవీ ఏర్పాటు చేయించుకున్నారు. వీరికి రూ. 5 వేలు చెల్లించే విధంగా కంపెనీ.. మూడు పోస్టు డేటెడ్ చెక్‌లను(పీడీసీ) ఇచ్చింది. మొదటి రెండు నెలలు అందరికీ అద్దె డబ్బులు అందాయి. తర్వాత ఫిబ్రవరి నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. బాధితులు బ్రాంచ్ మేనేజర్‌ను ప్రశ్నించగా అదిగో ఇదిగో అంటూ చివరకు నెల రోజులుగా కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఇలా సుమారు 500 మంది నుంచి వసూలు చేసిన రూ. 2కోట్లకు కంపెనీ కుచ్చుటోపీ పెట్టింది. కంపెనీ డెరైక్టర్లనుఅడగండి.. అడిటస్ సంస్థ మోసాలను తెలుసుకున్న ‘సాక్షి’.. సంస్థ మేనేజర్ శ్రీనివాస్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అతని తండ్రి ఫోన్లో మాట్లాడాడు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదన్నారు. కంపెనీకి డెరైక్టర్లున్నారని, వారి నుంచి వివ రణ తీసుకోవాలన్నారు. నోటీసులు పంపారు.. మాకు నెలసరి అద్దె చెల్లించకపోగా ప్రస్తుతం కంపెనీ డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేదంటూ మాకు నోటీసులు పంపారు. ఇది ఎంతవరకు న్యాయం. ఇలాంటి వారి నుంచి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటే మంచిది -
పర్యాటక అభివృద్ధి గాలికి!
సాక్షి, హైదరాబాద్: ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పైసా ఖర్చు చేయని ప్రభుత్వం ఇతర దేశాల్లో రోడ్‌షోల పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తోంది. బుద్ధుడి పేరిట టూరిజం ప్రాముఖ్యతను విదేశాలకు విస్తరించి వారిని ఆహ్వానించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పర్యాటక శాఖ కొత్త విధానాన్ని రూపొందించింది. నెలకు ఒక దేశాన్ని ఎంచుకొని ఆయా దేశాల్లో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి రోడ్‌షోలు నిర్వహించేలా ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా చైనా, జపాన్ దేశాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలతో కూడిన ఒక ప్రతినిధి బృందం వెళ్తోంది. విదేశీ పర్యాటకులు రాష్ట్రంలో ప్రత్యేకించి చూడదగ్గ ప్రాంతాలు లేకపోయినా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఇతర దేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తుండాన్ని కొందరు అధికారులే తప్పు పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి విదేశీ పర్యాటకులు ఒక శాతం కూడా వచ్చిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. పర్యాటక రంగాల అభివృద్ధికి నిధుల లేమి.. రాష్ట్రంలో ప్రధానమైన 54 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించి ఇందుకోసం అనేక ప్రోత్సాహకాలతో ప్రణాళికలను రూపొందించిన విషయం తెలిసిందే. వీటిలో తొమ్మిది పర్యాటక ప్రాంతాలను తక్షణం అభివృద్ధి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా సాగర తీరాలు, జలాధార, ఎకో, బౌద్ధ, మత, వారసత్వ, వినోదం, సాహస, ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైద్య పర్యాటక రంగాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినా వాటి కోసం ప్రత్యేకించి నిధులు విడుదల చేయలేదు. పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నా నిధులు లేని కారణంగా అనుకున్న మేరకు అభివృద్ధి చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు టూరిజంపై నిర్వహించిన ప్రతి సమీక్ష సమావేశంలోనూ చెబుతుండడం గమనార్హం. రాష్ట్రంలో ముఖ్యంగా సాగరతీరంలో ఆహ్లాద థీమ్ పార్క్, వాటర్ వరల్డ్, నౌకాయానం, వినోద పార్కులు, మెరైన్ టూరిజం లాంటి పార్కులు ఎక్కడా లేవు. ఇలాంటి వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ప్రచారం కోసం విదేశాల్లో రోడ్‌షోల నిర్వహణకు, ప్రచారం కోసం హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తోంది. మొక్కుబడి కార్యక్రమాలు మినహా పర్యాటక అభివృద్ధి సుస్థిరం కావడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. తీర ప్రాంత పర్యాటకాన్ని వివిధ ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తే లక్షలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా పట్టించుకోవడం లేదు. -
శాంతి ఆర్ట్స్ కి 6 అవార్డులు
హైదరాబాద్: స్క్రీన్ ప్రింటింగ్, అడ్వర్టైజింగ్ సంస్థ శాంతి ఆర్ట్స్ తాజాగా జాతీయ స్థాయిలో ఆరు అవార్డులు దక్కించుకుంది. స్క్రీన్ ప్రింట్ ఇండియా నిర్వహించిన ఎక్స్‌లెన్స్ ఇన్ స్క్రీన్ ప్రింటింగ్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో వీటిని అందుకుంది. ఇందులో రెండు పసిడి ట్రోఫీలు, 3 రజత పతకాలు, 1 కాంస్య పతకం ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఎస్జీఐఏ వైస్ ప్రెసిడెంట్ జానీ షెల్ చేతుల మీదుగా శాంతి ఆర్ట్స్ ఎండీ పీఎం జైన్ ఈ అవార్డులను అందుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.