ముంబై: దేశీయంగా ఈ ఏడాది ప్రకటనలపై వ్యయాలు 15.5% పెరిగి రూ. 1.46 లక్షల కోట్లకు చేరనున్నాయి. 2021తో పోలిస్తే 2022లో పరిశ్రమ 15.7 శాతం వృద్ధి చెందిందని అంచనాలు నెలకొన్నాయి. మీడియా ఏజెన్సీ గ్రూప్‌ఎం ఈ అంచనాలను వెలువరించింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న టాప్ 10 మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉండనుందని, అడ్వర్టైజింగ్‌పై వెచ్చించే వ్యయాల విషయంలో ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంటుందని గ్రూప్‌ఎం వివరించింది.
స్థూల ఆర్థిక అస్థిరతలు, అంతర్జాతీయ పరిణామాలు గత మూడేళ్లుగా ప్రకటనకర్తల వ్యాపారాలు, అడ్వర్టైజింగ్ వ్యయాలపై ప్రభావం చూపాయని సంస్థ సీఈఓ (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. 2023లో ప్రకటనల వ్యయాలకు టెలికం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు.. బీమా, రిటైల్, ఫిన్‌టెక్, గేమింగ్, ట్రావెల్, పర్యాటకం మొదలైన విభాగాల నుంచి ఊతం లభిస్తుందని గ్రూప్‌ఎం బిజినెస్ ఇంటెలిజెన్స్ హెడ్ పర్వీన్ షేక్ చెప్పారు. ఈ ఏడాది గ్రామీణ ఎకానమీ కూడా పుంజుకోగలదన్నారు. టాప్ మెట్రోలను దాటి ఇతర ప్రాంతాలకూ 5జీ సేవలు విస్తరిస్తుండటం, స్మార్ట్‌ఫోన్లు చౌకగా లభిస్తుండటం తదితర అంశాలూ ప్రకటనకర్తలు అడ్వర్టైజింగ్‌పై మరింతగా వెచ్చించేందుకు దోహదపడగలవన్నారు.
డిజిటల్‌దే పైచేయి..
గ్రూప్‌ఎం అంచనాల ప్రకారం మొత్తం ప్రకటన వ్యయాల్లో సింహభాగం వాటా డిజిటల్ మీడియాదే ఉండనుంది. అత్యంత వేగంగా 20 శాతం వృద్ధితో ఏకంగా 56 శాతానికి చేరనుంది. టీవీ మాధ్యమం వాటా మాత్రం స్వల్పంగా 31 శాతం నుంచి 30 శాతానికి తగ్గనుంది. ప్రింట్ మాధ్యమంలో ప్రకటనలపై వ్యయాలు మరింతగా తగ్గి 11 శాతం (2022లో) నుంచి ఈ ఏడాది 10 శాతానికి పరిమితం కానున్నాయి. విలువపరంగా మాత్రం ప్రింట్‌లో ప్రకటనలు రూ. 13,519 కోట్ల నుంచి రూ. 14,520 కోట్లకు పెరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment